28, జూన్ 2023, బుధవారం

తొలి ఏకాదశి

  "తొలి ఏకాదశి!"* 


"మహావిష్ణువు" యోగ నిద్రకు ఉపక్రమించే రోజు. అందువల్ల ఈ ఏకాదశిని "తొలి ఏకాదశి" లేదా "శయన ఏకాదశి" అని అంటారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. దీన్నీ చిలుకు ద్వాదశి , ఉత్తాన ద్వాదశి అని  అంటారు. అందుచేత ఈ నాలుగు మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది.

తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. 


మహావిష్ణువుకు అత్యంత ప్రేమ పాత్రమైన "తులశమ్మ" దగ్గర పద్మం ముగ్గువేసి, దీపం వెలిగించి, వివిధరకాల పండ్లను నివేదిస్తారు. 


శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని శ్రీహరికి ఇష్టమైన "పేలపిండి" ని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. 


స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు "జాజి" పూలతో అలంకారం చేసి, "శాంతాకారం భుజగశయనం, పద్మనాభం" అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే "తొలి ఏకాదశి."


*పేలాల పిండి!*


ఇది రైతుల పండుగ కూడా. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు.


*తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.* 


"తొలి ఏకాదశి" రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.

కామెంట్‌లు లేవు: