7, జులై 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 108*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 108*


మరి కొద్దిసేపటికి సిద్ధార్థకుడు ఆ గూడారంలోకి వచ్చి "అయ్యా మనం పాటలీపుత్రం సమీపంలో ఉన్నాం చాణక్యుల వారు పదవిని వదులుకున్నారు కాబట్టి నాకిక వారి భయంలేదు. ఇక్కడికి సమీపంలో మా అత్తగారి గ్రామంలో నా భార్యాబిడ్డలున్నారు. తమ వద్ద నేను దాచుకున్న తమరిచ్చిన బహుమతులు ఇప్పిస్తే నేను వెళ్లి మావాళ్ళను చేరుకుంటాను" అని అర్ధించాడు వినయంగా. 


జీవసిద్ధి పలాయనంతో మనసు చెడిన రాక్షసుడు సిద్ధార్థకుడి నగలపెట్టే అతనికిచ్చేయమని శకటదాసుకి సైగ చేశాడు చిరాగ్గా. 


శకటదాసు చిన్న చెక్క పెట్టెను తెచ్చి ఇచ్చాడు. ఆ పెట్టె మూసి దానిపై రాక్షసామాత్యుని అంగుళీయకం ముద్ర వేయబడివుంది. సిద్ధార్థకుడు ఆ పెట్టను కళ్ళకద్దుకొని "మహాప్రసాదం" అంటూ నిష్క్రమించాడు. 


ఆ తదనంతరం రాక్షసామాత్యుడు కాస్తంత తేరుకొని "నాకెందుకో... ఏదో అనుమానం మనస్సును తొలిచేస్తుంది... నువ్వు మారువేషంలో కుసుమపురానికి వెళ్లి విశేషాలు సేకరించు...." అని ఆజ్ఞాపించాడు. శకటదాసు తలఊపి వెంటనే ఆ కార్యంమీద గుడారంలోంచి వెళ్లిపోయాడు. 


ఇక, రాక్షసునితో తెగతెంపులు చేసుకున్న జీవసిద్ధి వడివడిగా బాగురాయణుని గుడారానికి వచ్చి "బాబూ.... మీకూ మీ రాజతంత్రాలకూ నమస్కారం. నాకో అనుమతి పత్రాన్ని దయచేస్తే నాదారి నేను చూసుకుంటాను" అన్నాడు విసురుగా. 


బాగురాయణుడు నవ్వి "అంత కోపంగా ఉన్నారేమిటి స్వామీ....? రాక్షసామాత్యుల వారిని, వారి స్నేహాన్ని విడిచిపెట్టి మీరెక్కడికి వెళ్లగలరండీ....? అన్నాడు వేళాకోళంగా. 


బాగురాయణునుతో ఏదో చర్చించాలని అప్పుడు అక్కడికి వచ్చిన మలయకేతు గూడారంలోంచి ఆ మాటలు వినిపించి బైట ఆగిపోయాడు. 


"రాక్షసునితో స్నేహమా... ? ఛీఛీ .... ? ఆ రాక్షసునికి పగసాధించడమే తప్ప స్నేహపు విలువ ఏం తెలుసు ? తెలిస్తే .... నాచేత విషకన్యను సృష్టించి పర్వతకులవారిని చంపిస్తాడా ?" అన్నాడు జీవసిద్ధి కసిగా. గుడారం బయటవున్న మలయకేతు ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు. 


బాగురాయణుడు విస్తుబోతూ "అదేమిటి ? పర్వతకుల వారిని చాణక్యుడే చంపించాడని అంతా అనుకుంటున్నారు గదా ! అదీగాక పర్వతకుల వారికి రాక్షసుడు మిత్రుడు గదా ? ఇంత ఘాతకానికి వొడిగడతాడా ?" అన్నాడు నమ్మలేనట్టు. 


"అదేమరి... పర్వతకులవారు తనకి మిత్రుడై ఉండీ, ధర్మం కోసం చాణక్యు చంద్రగుప్తుల వారికి సహాయం చెయ్యడాన్ని రాక్షసుడు భరించలేకపోయాడు. నా చేత విషకన్యని తయారు చేయించాడు. తాను విషకన్యని చంద్రగుప్తునికి కానుకగా సమర్పిస్తు, సభా మర్యాద పాటిస్తూ చాణక్యుడు ఆమెని పర్వతకులవారికి సమర్పిస్తారనీ, విషకన్య పొందుతో పర్వతకులవారు మరణిస్తారని, తాను చేసిన సహాయానికి మెచ్చి తనని మగధ మహామాత్య పదవిలో కొనసాగనిస్తారనీ, ఆ రాక్షసుడు నాతో ముందే చెప్పాడు. అంతా అతను చెప్పినట్లే జరిగింది. కానీ పదవి విషయంలో చాణక్యుడు అడ్డోచ్చేసరికి పారిపోయి మలయకేతు పంచన చేరి యుద్ధం దాక తీసుకొచ్చాడు. ఇప్పుడేమో చంద్రగుప్తుల వారి వద్ద నుంచి అనుకూల సంకేతాలేవో అందినట్లున్నాయి. అందుకని, ఇప్పట్లో యుద్ధ ప్రకటనకి సుముహూర్తం లేదంటూ నన్ను మలయకేతుకి చెప్పమని బలవంతం చేశాడు. ఇలాంటి వాడు రేపు మలయకేతు వారిని మాత్రం వెన్నుపోటు పొడవడని నమ్మకం ఏమిటి?" అన్నాడు జీవసిద్ధి. 


అప్పటిదాకా వింటున్న మలయకేతు యిక ఆవేశాన్ని ఆపుకోలేక లోపలికొచ్చేశాడు. జీవసిద్ది గడగడ వణికిపోయాడు. 


"భయపడకండి జీవసిద్ధీ ! రాక్షసునివలె మేము మిత్రద్రోహులం కాము. బాగురాయణా ! వీరికి గుర్తింపు పత్రం ఇచ్చి పంపించెయ్యండి. వీరికి ఇష్టమైన చోటుకు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు" అన్నాడు మలయకేతు ఆవేశాన్ని అణుచుకుంటూ గంభీరంగా. 


బాగురాయణుడు గుర్తింపుపత్రాన్ని ఇవ్వగానే జీవసిద్ది వాళ్ళకి నమస్కారం చేసి జారుకున్నాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

కామెంట్‌లు లేవు: