9, జులై 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 17 : పార్ట్ - 111*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 17 : పార్ట్ - 111*


చాణక్యుని భేదోపాయము ఫలించింది. మలయకేతు కారాగారమున బంధితుడుకాగా అతని సేనలు విధిలేక మగధసేనలకు తలవోగ్గాయి. చంద్రగుప్తుని పేర జయజయధ్వనులతో పాటలీపుత్రము హోరెత్తి పోయింది.


రాక్షసామాత్యుడు రహస్యదారుల వెంట నడిచి పాటలీపుత్రపు పొలిమేరలకి చేరుకునేసరికి బాటసారుల ముచ్చట్లు ద్వారా ఆ విశేషాలన్నీ అతని చెవిన పడ్డాయి. నిస్సహాయ, నిరాధారా, నిర్భాగ్యస్థితిలో వ్యధాభరిత హృదయంతో కుసుమపుర వనసీమల ప్రాంతానికి చేరుకున్న అతడు ఆ రాత్రి నగర ప్రవేశం చెయ్యలేక ఒక వనమందు ఒంటరిగా విశ్రమించాడు. 


రాక్షసుని రహస్యంగా అనుసరించి వచ్చిన సిద్ధార్థకుడు నగరప్రవేశం చేసి చాణక్యునికి ఆ విశేషాలన్నీ వివరించాడు. 


"శభాష్ సిద్ధార్థకా.... ! చాణక్య శిష్యుడివంటే నీవే.... " అని అభినందించాడు. 


అక్కడే ఉన్న శార్జరవుడు మొహం మాడ్చుకుని "అలాంటి అవకాశాలు మాకూ ఇస్తే ఆ ఏడుపులేవో మేమూ ఏడుస్తాం గదా...." అన్నాడు బుంగమూతి పెట్టి. 


చాణక్యుడు అతడివైపు అదోలా చూసి "నిజమే... ఏడుపులకు నువ్వే తగినవాడివి... ప్రాతఃకాలంలో నీ ఏడుపు మరింత మధురంగా ఉంటుంది. నీ ఏడుపుకి కరిగిపోయి, రాక్షసామాత్యుడు తన మిత్రుడు చందనదాసుని రక్షించుకోవడానికి వధ్యస్థానానికి పరిగెత్తుకురావాలి. అర్థమైందా ?" అన్నాడు. 


శార్జరవుడు నవ్వి "రేప్పొద్దున చూస్తారుగదా, నా ఏడుపు మహత్యం..." అన్నాడు. 


చాణక్యుడు మందహాసం చేస్తూ సిద్దార్థకుని వైపు తలతిప్పి "రేపు ప్రాతఃకాలంలో నువ్వూ, ఆగమసిద్ధీ చండాలుర అవతారాలెత్తుతారు" అన్నాడు. 


సిద్ధార్థకూడు నవ్వుతూ "ఆచార్యా ! సద్భ్రాహ్మణ పుట్టక పుట్టి చండాలుర వేషాలా....?" అన్నాడు.  


చాణక్యుడూ నవ్వి "అవును. చాణక్యుని ఆదేశానుసారం చందనదాస శ్రేష్టిని శూలారోహణం ఎక్కించి మరణశిక్ష అమలు పరచవలసిన వారు మీరే...." అన్నాడు నర్మగర్భంగా. 


ఆ మరునాడు - ప్రాతఃకాల సమయంలో ఉద్యానవనంలోని ఓ వృక్షాన్ని ఆనుకొని తనలో తానే పరితాపం చెందుతున్నాడు రాక్షసామాత్యుడు. 


"ఆహాహ ...! ఏమి నా దౌర్భాగ్యం .... శ్రోత్రియబ్రాహ్మణ వంశంలో పుట్టి, వేదశాస్త్రాలను అభ్యసించి, రాజనీతి శాస్త్రమునందు పరిణితి చెంది, మగధ మహాసామ్రాజ్యమునకు మహామంత్రినైన నేను.... నేను నిస్సహాయుడినై, నిరాధారుడినై, నిలువనీడలేక ఈ ఉద్యానవనమున తలదాచుకోవలసి వచ్చింది గదా... ఏమైనది... నా అఖండ ప్రజ్ఞా దురంధరత్వం... ? రాజకీయ చదరంగపు ఎత్తుగడలతో నన్ను మించిన వారు లేరని గర్వించాను గదా.... ఆ చాణక్యుని ఎత్తుల ముందు.... ఏమైనది నా మేధా సంపత్తి....? భార్యాబిడ్డలకు దూరమై... మిత్రులచే అవమానముల పాలై .... నేటికీ దొంగవలె చాటుమాటున దాక్కోవలసిన దుర్గతి పట్టింది కదా.... చీఛీ.... ఎందులకీ పాడు బ్రతుకు.... ?" 


రాక్షసామాత్యుడు ఆవేదనా భరిత హృదయంతో వ్యధ చెందుతూ "ఇంతకీ కారణము ఆ చాణక్య హతకుడా .... ? కాదు. కాదు. నా దురదృష్టమునకు పరులను నిందించి ఏమి ప్రయోజనం ? ధర్మమును నిలబెట్టవలసిన  బ్రాహ్మణుడై ఉండీ, అధర్మంగా మగధసింహాసన మెక్కిన నవనందులకు వూడిగం చేసిన పాప ఫలితమే ఇది... సుక్షత్రియుడూ, నందవంశ నిజవారసుడైన చంద్రగుప్తుని నాశనమొనర్చడానికి కుట్రలు పన్నినందుకే ఈ పరిహారం ... నాకన్న చాణక్యుడే మిన్న... ధర్మస్థాపన కొరకు చంద్రగుప్తుని సింహాసనం మెక్కించాడు. మగధ సింహాసనం పరరాజన్యుల పాలుగాకుండా అడ్డుకున్నాడు... నేనెంతగా పగసాధించాలని వురకలెత్తినా... అతడంతకంత సంయమనం పాటించి నన్ను ఉపేక్షించాడు. లేకున్న, ఆనాడు యుద్దరంగంలో చంద్రగుప్తుడు నన్ను చంపేవాడే గదా.... అహంకారంతో, అహంభావంతో నా అంతటివాడు లేడన్న మదంతో విర్రవీగనే గానీ... నిజానికి ఆ చాణక్య చంద్రగుప్తుల ఔదార్యం ముందు నేనెంత ? జరిగిన దానికంతటికీ... కారకుడను నేనే ... నేనే...." అని వాపోయాడు బాధతో. సరిగ్గా ఆ సమయంలో ...


"ఓరి రాక్షసా ! మిత్రద్రోహీ ! ఎక్కడున్నావురా ...?" అన్నకేక బిగ్గరగా వినపడింది. రాక్షసుడు వులిక్కిపడి లేచి నిలుచున్నాడు. 


"ఈ ప్రాతఃకాలం సమయంలో, ఈ నిర్జనవనంలో తనని పేరుపెట్టి దూషిస్తున్న వారెవరు ...?" 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: