24, జులై 2023, సోమవారం

శ్రీరుద్రనమకవైభవమ్

 శివాయగురవేనమః, 🙏

శ్రీరుద్రనమకవైభవమ్-3

- పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు


రుద్రనమకంలో జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తుల విజ్ఞానమూ ఉంది. కర్మకాండకు, ఉపాసనా కాండకు రెండింటికీ పనికి వస్తుంది. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం కొరకు రుద్రాన్ని యజ్ఞాది కర్మలలోను, ఉపాసనాదులలోను వినియోగిస్తారు. ఇష్టమైనది దొరకడానికి, ఇష్టం లేనిది తొలగడానికి ఏ కర్మయైనా, ఉపాసనయైనా, లౌకికమైన ఉపాయాలతో సాధించలేని దానిని సాధింపజేయడానికి పుట్టింది వేదం.


పరమేశ్వరుని గురించి తెలుసుకుని ఉంటే ఆ పరమేశ్వరునిపై మనకు ప్రేమ కలుగుతూ ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం - అని చెప్తుంది వేదం. వేదంలో కర్మకాండలో చెప్పబడ్డ ఈ దివ్యమైన జ్ఞానం అటు ఉపాసనకు ఉపకరిస్తుంది. ఇటు ఉపనిషత్తుకాండకు పనికి వస్తుంది.


జ్ఞానకాండకు, ఉపాసనా కాండకు, కర్మకాండకు మూడింటికీ పనికి వస్తోంది కనుకనే సరిగ్గా వేదాలలో ప్రముఖస్థానంలో రుద్రాన్ని పెట్టారు. వేదములో హృదయస్థానంలో యజుర్వేదముంది. యజుర్వేదానికి హృదయ స్థానంలో రుద్రముంది. 


ఇంట్లో వెలుగు కావాలంటే ఇంట్లో దీపం పెట్టుకుంటాం. వీధిలో వెలుగు కావాలంటే వీధిలోకి పెట్టుకుంటాం. ఈ రెండింటికి వెలుగు కావాలంటే మధ్యలో పెడతాం. దీనిని 'ద్వార్దేహళీ దత్తదీప న్యాయం’ అంటారు. కర్మకాండకు, జ్ఞానకాండకు పనికివచ్చేట్లు యజుర్వేదానికి మధ్యలో రుద్రాన్ని పెట్టారు. అందుకు దీనిని వేదానికి హృదయం అన్నారు.


అంతేకాదు శతరుద్రీయం అనబడేది ఒక ఉపనిషత్తుగా కూడా ప్రతిపాదించారు. రుద్రం వినడం ఎంత విశేషమో... రుద్రం గొప్పతనం గూర్చి తెలుసుకోవడం కూడా అంత విశేషమే. అది చెప్తూ ఉంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. వేదంలో ఎన్ని భాగాలున్నా ఒక్క భాగం గురించి ఇంత గొప్పగా ఇతర గ్రంథముల యందు ప్రస్తావన చేయడం ఎక్కడా కనబడదు. ఒక్క రుద్రానికి మాత్రమే వివిధ వివరణలు కనబడుతున్నాయి. ఇటు పురాణాలలో, అటు ధర్మశాస్త్రాలలో, తంత్రశాస్త్రాలలో అన్నింటిలో రుద్రం ప్రయోగాలు చెప్పారు.


దేనిని పొందడానికి ఏం చెయ్యాలో... ఎలా చెయ్యాలో... రుద్రంలో మంత్రాలున్నాయి. పదకొండు అనువాకాలు అందులో ఉన్నాయి. ఈ పదకొండు భాగాలలో మళ్ళీ ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఒకొక్క మంత్రంతో ఒక్కొక్క ప్రయోజనం సాధించవచ్చు. వాక్శక్తి కావాలంటే ఏ మంత్రం చేయాలి...? రోగం పోవాలంటే ఏ మంత్రం చేయాలి...? ఋణ బాధలు పోవాలంటే ఏ మంత్రం చేయాలి...? సంతానం కావాలంటే ఏం చెయ్యాలి... ? ఒకరి మధ్య శత్రుత్వ బాధ పోవాలంటే ఏం చెయ్యాలి...? ఇలాగ ఒకొక్క దానికి ఒకొక్క మంత్రం చెప్పబడుతుంది.


దేశంలో అరిష్టాలు, ఉత్పాతాలు, ఉప్పెనలు వస్తే ఏ మంత్రం చేయాలి...? ఇన్నీ రుద్రంలో ఉన్నాయి. అంటే ఇది పెద్ద 'మెడికల్ షాప్' వంటిది. చెప్పాలంటే ఒకొక్క మంత్రం ఒకొక్క ఓషధి. ఆ ఓషధిని ఎలా వినియోగించి ఏ ప్రయోజనం పొందాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దాని గురించి కూడా 'కల్పశాస్త్రం' ఒకటి ఉంది. దానిలో ఈ ప్రయోగాలు చెప్పారు. ఇది కాక మంత్రశాస్త్రాలలో రుద్రమంత్రాన్ని దేనిని ఎలా ప్రయోగించాలో చెప్పారు. 


రుద్రం మీద భాష్యంగా దొరుకుతున్న గ్రంథాలలో విద్యారణ్యస్వాములవారి భాష్యం ఒకటి. వారు పదాలకున్న అర్థాలు చక్కగా తేటగా తెలియచేస్తూ ఒక మాటన్నారు - 

కర్మ ప్రకరణే పాఠాత్ కర్మాంగత్వ మపీష్యతే

జ్ఞాన హేతుత్వమప్యస్య సర్వోపనిషదీరితమ్

ఇది కర్మప్రకరణలో వచ్చింది కనుక దీనికి కర్మాంగము ఉంది. దీని వలన జ్ఞానం కలుగుతోంది కనుక అన్ని ఉపనిషత్తులలో చెప్పడం జరిగింది. అన్ని ఉపనిషత్తుల సారమిది అని చెప్పారు.

శివాయగురవేనమః🙏

కామెంట్‌లు లేవు: