24, జులై 2023, సోమవారం

నువ్వు వారి మనవడివి కాదు

 నువ్వు వారి మనవడివి కాదు


ఒకసారి నేను నా స్నేహితుడు గోపాలకృష్ణన్ ను కాంచీపురం పిలుచుకొని వెళ్ళాను. అతను ఒక పచారీ కొట్టు నడుపుతున్న ఒక తెలుగు బ్రాహ్మణుడు. శ్రీమఠం బాలు మామ మమ్మల్ని పరిచయం చేస్తూ, “విల్లుపురం చిదంబరం అయ్యర్ మనవళ్ళు వచ్చారు” అని చెప్పారు.


పరమాచార్య స్వామివారు నావైపు చూసి, “అవును ఇతను వారి మనవడే. కాని మరొకతను చూడడానికి తెలుగు బ్రాహ్మనుడిలా ఉన్నాడు” అని అన్నారు.


స్వామివారి పరిశీలనకి గోపాలకృష్ణన్ ఆశ్చర్యపోయి, “నేను కొండయ్యార్ మనవడిని” అని చెప్పాడు.


వెంటనే స్వామివారు, ”ఏ కొండయ్యార్? తురువణ్ణామలై దగ్గర్లోని సిరుపక్కమ్ అతనా? తన భూమిని అమ్మి దాంతో యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రజల కష్టాలు తీర్చాడు అతనేనా? మహాత్ముడు హఠయోగం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నాడే అతనేనా? కూర్చున్న చోటినుండే రమణమహర్షితో మాట్లాడేవాడు అతనేనా? నలభైయేళ్ళ కిందట సమాధిపొందాడు అతనేనా? కాని నువ్వు అతని మనవడిని కాదు” అని చెప్పారు.


”కాదు కాదు. వారు మా నాన్నరికి మామగారు” అని బదులిచ్చాడు.


”ఆర్థికంగా ఎలా వున్నావు?” అని అడిగారు స్వామివారు.


బావున్నానని చెప్పాడు గోపాల్. “బాంబేలో ఉన్న కుటుంబం వారొకరు కొండయ్యార్ కి ఆరాధన చేసేవారు. కాని ఎందువల్లనో కొద్దికాలం క్రితం మానేశారు. నువ్వు దాన్ని మరలా ఆరంభిచగలవా? మీ కుటుంబానికి మంచి జరుగుతుంది” అని చెప్పారు స్వామి.


ఆ తిథి ఏమిటో తనకు తెలియదన్నాడు గోపాల్. అందుకు మహాస్వామివారు, “చెన్నైలోని లూజ్ కార్నర్ లో రాధాకృష్ణన్ అని ఒకరు ఉన్నారు. వారి చిరునామా మఠం మేనేజరు వద్ద ఉంటుంది. నువ్వు అతణ్ణి సంప్రదించగలిగితే అతను తన పెద్దమ్మ జయమ్మ ద్వారా తిథి కనుక్కోవచ్చు. ఈ పని త్వరగా చెయ్యి. నాకు తెలిసి తొందర్లోనే ఆ తిథి రాబోతోంది” అని ఆదేశించారు.


తరువాత మహాస్వామివారు కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయారు. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఒక యాభైఏళ్ళ వయసున్నాయన మావద్దకొచ్చి మేము విల్లుపురం నుండి వచ్చామా అని అడిగారు. పరమాచార్య స్వామివారు ఆయన్ని మాతో మాట్లాడమన్నారని తన పేరు లూజ్ కార్నర్ రాధాకృష్ణన్ అని వారి పెద్దమ్మ పేరు జయమ్మ అని చెప్పారు. తన స్నేహితుడు హఠాత్తుగా ఇంటికి వచ్చి తనను కాంచీపురం తీసుకుని వచ్చాడని తెలిపారు.


స్వామివారు చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఇలా రావడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.


పరమాచార్య స్వామివారు చెప్పినట్టుగానే కొండయ్యార్ తిథి మరొక వారం రోజుల్లోనే ఉంది. మేము మా కుటుంబాలతో సహా సిరుపక్కం వెళ్ళి కొండయ్యార్ ఆరాధన మళ్ళీ మొదలుపెట్టాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- శ్రీ వి. సూర్యనారాయణన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: