21, జులై 2023, శుక్రవారం

శివగాథలు - మౌనోపదేశము*

 *ఓం నమో భగవతే శ్రీరమణాయ🙏* 


*శివగాథలు - మౌనోపదేశము* 


🌷🌷🕉🌷🌷


దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ తమిళంలో పద్యాలు, వాటి తాత్పర్యం వ్రాస్తూ ఆ దక్షిణామూర్తి అవతార కారణమగు మూలకథను సంగ్రహించి, అవతారికలో వ్రాసారు.


ఆ మధ్య నేను (సూరి నాగమ్మ) ఆ అవతారికకు తెలుగు అనువాదం వ్రాసాను. భగవాన్ అది చూసి చిరునవ్వుతో, "ఇదుగో, నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి వ్రాసానుగానీ, అసలు కథ చిత్రంగా ఉంది" అంటూ ఇలా చెప్పసాగారు (శ్రీరమణాశ్రమ లేఖలు, దక్షిణామూర్తి ప్రాదుర్భావం: 07-02-1947).


త్రిమూర్తులలో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త. విశ్వాన్ని నిర్మించి, దానిలో జీవరాశులను నింపుటకు తన మనసునుంచి కొందరు శక్తిమంతులైన ప్రతినిధులను సృష్టించాడు. వసిష్ఠుడు, నారదుడు, ఋభువు, దక్షుడు వారిలో కొందరు. ఆయన వారిని గృహస్థులై, సంతానాభివృద్ధి చేయమన్నాడు. దక్షుడు, వసిష్ఠుడు వంటివారు తండ్రి ఆనతిని శిరసా వహించి, ఆయన అనుగ్రహంచేత విశిష్ఠ స్థానాలను పొందారు. నారదుడు, ఋభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక, విరాగులై సంచరించారు. అటువంటివారే సనక సనందులు కూడా. వీరు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులే. వీరి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు. తండ్రి సంకల్పం నుంచి అవతరించగానే, అనగా బాల్యంలోనే వీరు విరాగులైనారు. నలుగురికీ ఒకటే నిర్వేదం. 'ఈ సంసారం నుంచి బయటపడుట ఎలా? ఏ జ్ఞానంచేత అన్ని సంశయాలు తీరి మరియు తపన, ఆరాటం శమించి శాంతి లభిస్తుంది? ఈ ఉపాయాన్ని సులభంగా అందించగలిగేవారు ఎవరా' అని అన్వేషణ ప్రారంభించారు. అలా సంచరిస్తూ నందనవనం ప్రవేశించారు.


అక్కడ దేవసభలో సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష గంధర్వ విద్యాధరాధి దివ్యశక్తి సంపన్నులు; తపశ్శక్తి సంపన్నులైన మునులు అంతా సమావేశమై, గోప్యమైన సంగతులను చర్చించుకొంటున్నారు. అలౌకిక ప్రకాశంతో, అమాయకత రూపుదాల్చినట్లున్న ఈ నలుగురు బాలకులను చూసి, ఆ సభను అలంకరించిన ప్రముఖులతో సహా అంతా లేచి ఎదురేగి, సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్య, పాద్యాలను ఇచ్చి పూజించి, "సంసార తరణోపాయాన్ని బోధించవలసింది" అని అభ్యర్థించారు. విచారించగా, అక్కడి సభలోనివారంతా ప్రాపంచిక విషయాలనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు, వారికెవరికీ బ్రహ్మవిద్య గురించిన అవగాహన లేదని సనకాదులు గ్రహించారు.


ఆ స్థితిలో మార్గదర్శికై విచారిస్తున్న వారివద్దకు నారద మహర్షి ఏతెంచారు. ఇహపర సంబంధమైన ఎటువంటి సమస్యలకైనా తరణోపాయాన్ని చూపగల ఘటనాఘటన సమర్థుడాయన. ఆయన పనిలో శ్రద్ధవుంది, సామంవుంది, పేచీవుంది, వేడికోలువుంది, చమత్కారంవుంది, సాఫల్యంవుంది. అన్నిటినీ, అందరినీ కలుపుకొనిపోగల లోకకళ్యాణం సంపూర్ణంగా వుంది. నిజంగా నారదునివంటి మహానుభావులే లేకుంటే, పురాణగాథలన్నీ లవణం (ఉప్పు) లేని శాకపాకాలు (కూరలు) గా ఉండేవేమో! బాల చతుష్టయం ఆయనను పూజించి, తన మనోభావాన్ని తెలిపింది.


ఇంకేం? అంతకంటే ప్రీతిగొలిపే పనేముంటుంది నారదునికి? ఇప్పటికే సృష్టికార్యంలో ఇచ్చలేని బ్రహ్మకుమారులను మోక్షపథగాములను చేయడమే కాకుండా, దక్షశాపానికి కూడా గురయ్యాడు. అయితే ఆయనకు అదే భయకారణం కాలేదు. సత్కార్యాచరణ చేసేవారు కష్టనష్టాలను ఓర్చుకొంటూ, తమపని చేసుకొని పోతుంటారు. "రండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించుటకు బ్రహ్మదేవునికన్నా ఎవరు మిన్న? ఆయననే ఆశ్రయిద్దాం" అని వారిని సత్యలోకానికి తీసుకొని వెళ్ళాడు. కన్నులకు ఇంపైన సన్నివేశం అక్కడ వారికి సాక్షాత్కరించింది. చతుర్ముఖుడు, పితామహుడు అయిన బ్రహ్మ తన కమలాసనంలో కూర్చుని వున్నాడు. చదువులతల్లి సరస్వతి శ్వేత పద్మాసనంపై, శుభ్రవస్త్రాన్వితయై కూర్చుని పరమేశ్వర స్తుతిపరమైన గానం చేస్తుండగా, ఆమెకు ఎదురుగా ఆసీనుడైన విరించి ఆ పాటకు తాళం వేస్తున్నాడు. అనగా వారు నామసంకీర్తనం చేస్తున్నారన్నమాట.


నామసంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనమ్. ప్రణామో దుఃఖశమనః నామసంకీర్తనం పాపాలను నశింపచేసి, దుఃఖాన్ని శమింపచేస్తుంది. దేవతలకైనా అదే ఉపాయం. మరి సృష్టికర్తకు పాపమూ, దుఃఖమూనా? ఉండవు. కానీ లోకానికి ఆదర్శవంతం కదా! బాలురైన సనకాదులు ఆ విధాత (బ్రహ్మ), విధియువతి (సరస్వతి)లను చూసి, "ఆధ్యాత్మ తత్త్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీ సాంగత్యంలో ఉండడమా? ఈయన మనకేమి బోధ చేయగలడు?” అని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. బ్రహ్మజ్ఞానమును పొందడానికి అర్హులైనప్పటికీ, గురుస్వరూపాన్ని నిర్ణయించుటలో వారు పరిపక్వత చెందలేదు. అందుచేతనే ఈ 'ప్రమాదం సంభవించింది.


అక్కడనుంచి వారు సరాసరి వైకుంఠం చేరారు. “అల వైకుంఠ పురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో” అన్నట్లు స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి, అనేక మణిమయ ప్రాకారాలు దాటితేగానీ కనిపించడు. ఈ లోపు ఎన్నెన్ని ద్వారాలో, ఎందరెందరు ద్వారపాలకులో? చొరవగల నారదుడు దాటుకొనిపోయి ఇట్టే తిరిగి వచ్చాడు. "బాగు, బాగు. అక్కడ బ్రహ్మదేవుడు భార్యకు ఎదురుగానైనా, కొంచెం దూరంలోనే కూర్చున్నాడు. ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉంటే, పత్ని లక్ష్మీదేవి మురిపెంగా ఆయన పాదాలు వత్తుతోంది. ఒట్టి సుఖలాలసుడుగా కనిపిస్తున్నాడు.


పైగా ఈ అంతఃపుర వైభవాన్ని, నగర విలాసాన్ని చూస్తే ఎవరికీ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలుగదు సరికదా, భోగాపేక్ష కలుగుతుంది. గంపెడు సంసారమున్న ఈయన జ్ఞానబోధ ఏమి చేయగలడు? ఇక మూడవవాడైన ముక్కంటినే ఆశ్రయిద్దాం. నిరాడంబరుడని ప్రసిద్ధి కదా!" అంటూ త్వరపెట్టాడు.


బాలురు కూడా త్వరపడి నారదుని అనుగమించారు. అత్యంత శ్రమకోర్చి హిమశైలాలను దాటుతూ, ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేసారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిరుత్తరులైనారు. బ్రహ్మ తాళం వేస్తుండగా, విష్ణువు తదనుగుణంగా మృదంగం, అలాగే ఇతర దేవతలు ఇతర వాయిద్యాలను ప్రయోగిస్తున్నారు. మధ్యలో ఆదిదంపతులైన శివపార్వతులు ఒకరితో ఒకరు ఏకమై, మమేకమై ఒకే శరీరంగా కనిపిస్తున్నారు. భూతగణాలు కేరింతలు వేస్తుండగా, అంతా తైతక్కలాడుతున్నారు. సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది. "ఇది మరీ చోద్యం, ముందువారే నయం. ఈయన స్త్రీ సాంగత్యాన్ని వదలడానికే వీలు లేకుండా ఉన్నాడు. వీరి సంగతే ఇలా ఉంటే, ఇక మనకెవరు బోధించేది?” అంటూ విషాదంతో కదిలారు.


నర్తనకేళిలో నిమగ్నమై ఉన్నా, పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూనే ఉన్నాడు. "స్త్రీ సాంగత్యంచేతనే జ్ఞానం నశిస్తుందా? వీరి అపోహ వీరిని జ్ఞానదూరులను చేసింది" అని జాలిపడి, వారిని ఉద్ధరించుటకు నడుం కట్టాడు. పార్వతిని వదలి తానొక్కడే బయలుదేరాడు. సనకాదులు మనోభీష్టానికి తగిన రూపధారణ చేసాడు. తాపసులను కూడా సంమోహపరచే ఆకృతి అది. షోడశ (పదహారు) సంవత్సరాల యువకునివలె కళాప్రపూర్ణ ముఖబింబంతో శాంతికాంతులను ప్రసరిస్తూ, సనకాదులు వస్తున్న త్రోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో, ఎడమ పాదాన్ని కుడి మోకాలిపై ఉంచి, చిన్ముద్ర ధరించి, దక్షిణాభి ముఖుడై, యోగిరాట్ చక్రవర్తివలె సమాధి అవస్థలో ఆసీనుడైనాడు. ఆయన మహిమాతిశయంచేత ఆ ప్రాంతమంతా అలౌకిక శాంతి, తృప్తి, వెలుగులతో నిండిపోయింది.


ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడకు వచ్చి, సూదంటు రాయివలె ఉన్న ఆ దక్షిణామూర్తిని చూచేకొద్దీ వారి మనసులు చల్లబడి, అంతకు ముందెన్నడూ అనుభవించని హాయిని, అనుభూతిని చెందసాగారు. ఆయన పాదాలవద్ద చతికిలపడ్డారు. ఏ ప్రయత్నం లేకుండానే స్వస్థితి అయిన సమాధిలో నెలకొన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందారు. సంశయాలన్నీ దూరమయ్యాయి.


భిద్యంతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయః 

హృదయగ్రంథి తెగిపోయింది. సంశయాలు సమసిపోయాయి. 

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః 

గురువు బోధ మౌనం, శిష్యులు సంశయాలు పటాపంచలు.


వీరు అడిగిందేమీ లేదు, ఆయన చెప్పిందీలేదు. కానీ, ఫలితం అమోఘం.. శిష్యులు ఆత్మజ్ఞానులైనారు. వాగ్రూప ఉపదేశం సామాన్యులకు. కొంత పక్వచిత్తులకు కన్నుగీటితే చాలు, తెలుసుకుంటారు... 'నయనదీక్ష' అన్నమాట. అతిపక్వచిత్తులకు కేవల సాన్నిధ్యమే అత్యంతికం. ఆ పూర్ణమౌనంలోనే మనసు హృదయమగత చెంది, సద్వస్తువును గ్రహిస్తుంది.


"చిత్రం వటతరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువా”


చిత్రం! మర్రిచెట్టు మొదట కూర్చొన్న గురుడు యువకుడు. శిష్యులు వృద్ధులు... భళారే విచిత్రం! మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనడం ఉచితమేనా? ఆ జ్ఞానంలో పుట్టినవారు బాలురతో సమానం. అలా కానివారు బాలురైనా, జరామరణాలకు గురయ్యే వృద్ధులవంటివారేనని వివరణ.


మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిప్లైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥


మిక్కిలి వృద్ధులైనా తనను చేరి సేవించుచూ, బ్రహ్మనిష్ఠను పొందిన ఋషిమునిగణాలచే పరివేష్ఠితుడై చిన్ముద్రతో, రూపుదాల్చిన ఆనందమే అయినట్టి యువకుడు మౌనంచేతనే పరబ్రహ్మమును ప్రకటిస్తున్నాడు. ఇక ఆయన వాక్కు ఎంతటి అమోఘమైనదో కదా!) అటువంటి సంబరంతో మెరిసి పోయేవానిని, తనయందే క్రీడించుచు తృప్తుడై ఉన్నవానిని, ఆచార్యులకు ప్రభువైన శ్రీదక్షిణామూర్తిని సేవించెదను.


*ఓం అరుణాచల శివ🙏*

🌷🌷🕉🌷🌷

కామెంట్‌లు లేవు: