12, జులై 2023, బుధవారం

కృతజ్ఞత

 కృతజ్ఞత


ఉడయార్ పాళ్యం సంస్థానాధిపతులు ఒక సంవత్సరం పోషించిన తరువాత అప్పటి తంజావూరు మహారాజైన ప్రతాపరుద్రుడు కంచి మఠాన్ని తమ సీమలో వచ్చి ఉండమని ప్రార్థించాడు. అతడి రెవెన్యూ మంత్రి అయిన డబీర్ పంత్ ప్రోద్బలంతో కుంభకోణం కావేరీ తీరంలో అనువైన మఠం నిర్మించబడుతుంది. 


కాలప్రవాహంలో బ్రిటిష్ వారి నక్కజిత్తుల వలన తంజావూరు పాలకులు ఆస్తులన్నీ కోల్పోయారు. 1937 జనవరి నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వారు కోట ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు. మహాస్వామివారు ఈ సమయంలో ఒక మహా ప్రయత్నాన్ని చేసి వారికి రాజభరణం ఏర్పాటు చేశారు. తమకు మేలు చేసినవారిని ఎన్నటికి మరువరు వారు. తంజావూరు పాలకులకు ఏర్పాటు చేసిన భరణం గురించి విస్తారంగా చెప్పుకోబోయే ముందు ఒక చిన్న శాఖా సంక్రమణం -


1935 - 36లలో మహాస్వామివారు ప్రయాగలో త్రివేణీ సంగమస్నానం చేసి తల ఎత్తి చూసి ఏదో వెతుక్కుంటున్నారట. అనుష్టానం ముగించిన తరువాత పరిచారకులొకరు, “స్వామివారు చుట్టూ కలయజూసి దేనినో వెతుక్కుంటున్నారు. దేని కోసం” అని ప్రశ్నించారట. “చుట్టుపక్కల ఒక గోపురం కూడా కన్పించలేదు” అన్నారట. అప్పటి నుండి వారి మనసులో ఒక సంకల్పం - ప్రయాగ స్నానం అయిన వెంటనే గోపుర దర్శనం అయేట్లు ఒక దేవాలయ నిర్మాణం చేయాలని. 


కాలం గడచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరదేశ యాత్ర చేసే సమయం వచ్చింది. మాటల సందర్భంలో తన మనస్సులోని మాట వారికి చెప్పారు మహాస్వామివారు. గురుభక్తిలో తమకు తామే సాటి అయిన శ్రీ జయేంద్రులు ఆ ప్రయత్నం చేద్దామనుకున్నారు. అప్పుడు ఉత్తర ప్రదేశ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో ఉన్నది. గవర్నర్ గా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారున్నారు. స్థల సేకరణ విషయంలో వారి సహాయంకై మహాస్వామివారు అభ్యర్థనతో మనుష్యలను పంపారు. రెడ్డి గారు ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించి నిబంధనల మేరకు చేయదగినదంతా చేయవలసినదని అధికారులను ఆదేశించారు. రాజు తలచుకొంటే కానిదేమున్నది. శ్రీఘ్రగతిన స్థలం నిర్ణీతమైన శుల్కమునకు కేటాయించబడడం నిర్మాణారంభం జరిగిపోయింది. తరువాత వచ్చిన ముఖ్యమంత్రి - వీరభద్రసింగ్ అని జ్ఞాపకం - కాలంలో ప్రభుత్వపు సంపూర్ణ సహాయ సహకారాలతో కమాక్షీదేవికి ఎత్తైన స్తూపం మీద గుడి కట్టబడింది. ఇప్పుడు ప్రయాగలో స్నానం చేసి తల ఎత్తి చూస్తే ఉన్నతమైన గోపురం కనిపించి భగవంతుని మాబోంట్లకు మహాస్వామి వారిని జ్ఞాపకం చేస్తోంది.


1981 ప్రాంతాలలో ఆ గుడికి ప్రతిష్ట కుంభాభిషేకాదులు శ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారి అమృతహస్తాలతో జరపడానికి నిర్ణయమైంది. అప్పుడు మహాస్వామివారు సతారాలో ఉన్నారు. స్వామివారికి ఆహ్వాన పత్రం సమర్పించబడింది. పరికించి చూస్తే అందులో బెజవాడ గోపాలరెడ్డీ గారి పేరు ఎక్కడా లేదు. 


బహుశ అప్పటికి శ్రీ గోపాలరెడ్డి గారు క్రియాశీలక రాజకీయముల నుండి తప్పుకొని స్వక్షేత్రంలో స్థిరపడినారు. నిజానికి మఠానికి ఆయన మూలకంగా జరగబోయే ఉపకారమేదీ లేదు. కానీ చేసిన మేలును మరచేవారు కాదు కదా మన మహాస్వామి. వెంటనే చెన్నైలో మఠానికి సన్నిహితులైన వారికి వర్తమానం పంపబడింది. 


వారు హుటాహుటిన బయలుదేరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్న గోపాలరెడ్డి గారిని కలిసి వారిని ముందే పిలవనందుకు క్షమాపణ చెప్పి కారులో చెన్నై, అక్కడి నుండి విమానంలో ఢిల్లీ, ఢిల్లీ నుండి ప్రత్యేకమైన కారులో ప్రయాగ తీసుకువెళ్ళేందుకు అదేవిధంగా వెనుకకు తీసుకొని వచ్చేందుకు సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. సతారా నుండి పెద్ద స్వామివారు పంపిన ప్రత్యేకమైన శాలువాతో వారు సత్కరించబడ్డారు. 


కంచి ఏకామ్రేశ్వరునికి ఏడు వారాలకు ఏడు ప్రత్యేకమైన కొలనులున్నాయి. అందులో శ్రీ మఠానికి ఎదురుగా ఉన్న మంగళా తీర్థము ఒకటి. శ్రీవారు 1984లో మఠానికి తిరిగివచ్చిన తరువాత దానిలో ఒక మంగళవారం స్నానం చెయ్యడానికి బయలుదేరారు. కొలనులో కూడా ఇళ్ళు కట్టి ఉన్నాయి. మెట్లు పూర్తిగా భిన్నమయిపోయి ఉన్నాయి. కేవలం అది ఒక మరుగుదొడ్డిగా వాడబడుతున్నది. రాజకీయ బలం లేకపోతే ఆ అక్రమణదారులను తొలగించడం సాధ్యం కాదు.


స్వామివారు అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వద్దకు తమ శిష్యులను ఒక విజ్ఞాపనతో పంపారు. అప్పటి మంత్రి శ్రీ వీరప్పన్. యమ్.జి.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కంచి మహాస్వామివారి నుండి వచ్చిన వర్తమానం అనగానే ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కరడుగట్టిన ద్రవిడోద్యమ నేత రామస్వామి నాయకర్ అనుయాయులు శ్రీ వీరప్పన్, కావలసిన నిధులు, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే ఆ తీర్థానికి దురాక్రమణలను తొలగించి, పెన్సింగ్ వేసి, మెట్లు కట్టే సమయానికి వీరప్పన్ ప్రభుత్వంలో లేరు సరికదా ప్రభుత్వ పక్షం వారికి పరమ శత్రువులుగా పరిగణించబడుతున్నారు. 


కొలను సిద్ధమయింది. మహాస్వామివారు మంగళవార స్నానానికి వెళ్ళబోతూ వీరప్పన్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. తాము నీటిలో దిగి అతనిని అదే సమయంలో స్నానం చేయమని చెప్పి పునీతులను చేశారు. వారి ఔదార్యమునకు తబ్బిబ్బులయిపోయారు వీరప్పన్.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: