3, జులై 2023, సోమవారం

గురుర్బ్రహ్మ

 డా. దేవులపల్లి పద్మజ

విశాఖపట్టణము

ఫోను 9849692414

గురు పూర్ణిమ


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం !!


తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును

తండ్రి వెంట నిలచి దన్ను నిచ్చు

గురువు విద్యనేర్పి గుణములు గరపును

ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞ మనకు !!


మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ ఏదైనా పవిత్రమైనదే. ఈ రోజు వ్యాసభగవానుని జన్మదినము. అష్టాదశ పురణాములను మనకు అందించిన మహనీయుని జన్మదినం కారణంగా గురుస్థానములో ఆ వ్యాసభగవానుని స్మరిస్తూ చేసుకునే పవిత్రమైన రోజు.  ఆషాడ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైనది.  గురువుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తాము. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచినది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన  ఒక చక్కని కథను తెలుసుకుందాము. 


ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు.  కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు.  అప్పుడు గురువుగారు యిలా చెబుతారు --


శృణు విప్ర తపేచ్చా చేత్‌ దర్శనార్థం తదా త్వయా

పూజనీయో విశేషేణ, కథంవాచయితా స్వయం !


బ్రాహ్మణోత్తమా! నీవు నన్ను దర్శించాలని కూతూహలంగా ఉన్నావు గనుక విను.  ఎవరైనా పురాణగాథలను, వేదగాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, అతనిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలసినది.  నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను అని అంటారు.


అందువలన పౌరాణికులు, కథకులు, బోధకులు గురువులుగా పిలవబడతారు.  పురాణాలలో నిగాఢంగా నిహితం చేయబడిన విషయాలను మానవజాతి ఙ్ఞానం సంపాదించాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరము.  అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను ధూపదీప నైవేద్యాలతో పూజించి తగిన విధంగా సత్కరించాలి.  గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి.  అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి.  హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు.  తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాథన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం.  గురువులుగా ప్రసిద్ధిగాంచిన , ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషరిడీ సాయినాథుడుమొదలైనవారిని ఈరోజు కొలుస్తారు.  ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు.  ఆఙ్ఞానమనే  చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు.  మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు.


గురుపూర్ణిమ నాడు ఉదయమే మేల్కాంచి, శుచియై తమ ఇంటిలోని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇంటి ముఖద్వారానికి చక్కటి మామిడి తోరణాలను అలంకరించాలి.  ఒక కొత్త వస్త్రాన్ని పరచి అందులో బియ్యం పోసి, మధ్యలో తమలపాకు నుంచి, వాటి మధ్యలో గురు ప్రతిమనుంచాలి.  ఉత్తరం వైపుగా కంచు దీపం వెలిగించి,  తులసిమాల ధరించి పూజ నిర్వహించాలి.  షోడశోపచారములతో పూజలు నిర్వహించి, తీర్థప్రసాదములను స్వీకరించాలి.  ఈ విధంగా నిర్వహించటం వలన సకల ఈతి బాధలు తొలగిపోతాయని నమ్మకం.


ఈ రోజు దేవాలయాలలో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు.  ఉదయం పాలాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.  రోజంతా గురుప్రార్థనలు చేస్తారు.  సాయంకాలం చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు.  భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆనంద పరవశులౌతారు.  శ్రీ గురుచరిత్ర, సాయిచరిత్ర వంటి పుస్తకాలను, ఉడకబెట్టిన శెనగలను అందరికీ పంచిపెడతారు.


పూర్వకాలంలో గురుకులాలుండేవి.  శిష్యులందరూ ఈ రోజు అమితమై భక్తిశ్రద్ధలతో గురువును పూజించి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించేవారు.  గురువులు కూడా శిష్యులను తమ కన్న పిల్లలవలె చూసుకునేవారు.  అందుకే ఆనాటి గురు శిష్య పరంపర, సంబంధ బాంధవ్యాలు అవిచ్ఛిన్నంగా కొనసాగేవి.  కాని నేటి తరంలో అటువంటి స్థితిగతులు కానరావటం లేదు.  సాక్షాత్తు దేవదేవుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసిస్తారు.  శ్రీకృష్ణుడు కూడా తన చిన్నతనంలో గురు ఆశ్రమంలో విద్యనభ్యసించి, గురువుకు గురుదక్షిణ చెల్లిస్తాడు.  ఆయనకు ఆసాధ్యమైనది ఏదీ లేకపోయినప్పటికి, సర్వం ఆయన సృష్టి అయినప్పటికి, ఆచారాలను పాటించాలని, అందరకూ మార్గనిర్దేశనం చేయటానికి ఆవిధంగా చేస్తాడు.


కామధేనువు మరి కల్పవృక్షము కూడ

గురువు మనసునందు కొలువుయుండు

గురువునకు సరియగు గురుదేవులే సుమా

ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞ మనకు !!


సమస్త ప్రకృతిలో నిండి నిభిఢీకృతుడై ఙానానందాన్ని, ప్రేమను పంచటానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.  ఆ మహత్తర  ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం.  మనిషిలో గుప్తంగా దాగియున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు. ‘‘గురువు లేనివాడు బరువగు నేలకు’’.


తల్లి దండ్రి గురువు ధరణిలో పూజ్యులు

మరువకున్న దైవ కరుణ కలుగు

మరచిపోవువారు పరమ హీనులు సుమా

ప్రకృతి పలుకునిచ్చు ప్రఙ్ఞమనకు !!


మనమందరమూ గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం.  విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బాటలు వేద్దాం.  గురువులు కూడా సత్ప్రవర్తన కలిగి, ఉన్నత ఆశయాలతో, నిష్కల్మష ప్రేమనందిస్తూ శిష్యులద్వారా లోకోన్నతికి కృషి చేయాలి.  అందరం కలసి ఈ శుభదినాన ప్రతిన చేద్దాం, విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.


ఓం శ్రీ గురుభ్యోనమః

కామెంట్‌లు లేవు: