30, జులై 2023, ఆదివారం

నీచునకు ధీరునకు గల వ్యత్యాసము

 సుభాషితం

  --------------------- 


    ఉ: గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన ,విశీర్ణమైన, సా

          యాసమునైన ,నష్ట రుచియైనను, ప్రాణ భయార్తయైన " సం

          త్రాస మదేభ కుంభ పిశిత గ్రహలాలస శీల సాగ్రహా 

           గ్రేసర భాసమాన మగు కేసరి" జీర్ణ తృణంబు మేయునే?


              భర్తృహరి సుభాషితములు- ఏనుఁగు లక్ష్మణ కవి ; 


         అల్పునకు అధికునకు, నీచునకు అభిమాన వంతునకు ,పిరికివానికి వీరునకు గల తేడా యెట్టిదో యీపద్యమున కవి చిత్రించినాడు. దానికి ఒకసింహాన్ని ఉదాహరణగా నెన్నుకొనినాడు. సింహము యొక్క స్వభావమెట్టిది? 


                  గ్రాసములేక స్రుక్కిన- తిండిలేక బాధపడుతున్నా,( ఆకలి బాధేకదా) జరాకృశమైన- ముసలితనంతో చిక్కిపోయినా, విశీర్ణమైన- శరీర అవయవములు పట్టు దప్పినా, సాయాసమునైన- ఆయాసపడుతున్నా, నష్టరుచియైనను-కాంతితగ్గినా, ప్రాణభయార్తయైనా-ప్రాణభయంతో అరచు చున్నా,


                        సంత్రాస- తనను జూచి భయపడే, మదేభ- మదించిన యేనుగుయొక్క; కుంభ-కుభస్థలమునందలి; పిశిత-మాంసమును; గ్రహ-స్వీకరించే; శీల-స్వభావముతో ;సాగ్రహాగ్రేసర- కోపమున ముందుండే కేసరి;-సిహము; జీర్ణతృణంబున్-ఎండుగడ్డిని; మేయునే తినునా? యని యర్ధము;


                  భావము: సింహము యొక్కస్వభావమేమి? యేనుగు కుంభస్థలమును చీల్చి యామాంసమును తినుట! అదిమాని అది ఆకలితోనున్నను ముసలితనమున చిక్కినను ఆయాస పడు చున్నను ఫ్రాణభయమే దాపురించినను

యెండు గడ్డిని మాత్రము తినదు. అని భావము. 


              సింహము ఇట్టిపని చేయదన భావమేమి,? తక్కిన యల్ప జంతువులు చేయుట కవకాశమున్నదనియేగదా!

ఇదియొక దృష్టాంతము. నీచునకు ధీరునకు గల వ్యత్యాసమునకు. దీనిని బోధించుటకై కవి యొక యర్దాంతరమును

యిక్కడ ప్రదర్శించినాడు. అది "కేసరి జీర్ణతృణంబు మేయునే" యనునది. అట్లే అభిమానవంతుడు అల్పపు పనులకు

పాల్పడడని భావము. 


                                ఈపద్య రచనలో చక్కని రచనా శిల్పాన్ని కవి ప్రదర్శించాడు. యెలాగంటే,దాని దీన దశను సూచించటానికి ,"గ్రాసములేక ఇత్యాదిగా ప్రాణభయార్తయైన వరకూ వ్యస్త పదములను ప్రయోగించిన కవి, దానిపరాక్రమాన్ని సూచించటానికి "సంత్రాస ఇత్యాదిగా కేసరి' వరకూ పెద్ద సమాసాన్ని ప్రయోగించాడు. 


                           ఇది గొప్ప రచనా శిల్పం! 


          ఈవిధంగా యీపద్యం " సింహంలా అభిమానవంతులై బ్రతకండి! నీచమైన బ్రతుకు బ్రతకవలదని

                                                 ప్రజలకు సందేశమందించుట.


                              స్వస్తి!

కామెంట్‌లు లేవు: