17, జులై 2023, సోమవారం

పోతన కవితా మాధుర్యము

 శు భో ద యం 🙏


పోతన  కవితా మాధుర్యము 


                                (  భక్త  ప్ర హ్లాదుని  చరిత్రము ) 


            ఉ:   అచ్చపుఁ  జీకటింబడి   గృహ  వ్రతులై  విషయ  ప్ర విష్ఠులై 

                   చచ్చుచుఁ  బుట్టుచున్  మరలఁజర్విత  చర్వణు  లైన వారికిన్ , 

                   జెచ్చెరఁ బుట్టునే  పరులు  సెప్పిననైన  నిజేఛ్చనైన   నే 

                    మిచ్చిన  నైనఁ   గానలకు  నేగిన నైన హరిప్రబోధముల్; 


                      ఈఒక్క పద్యంతో ప్ర హ్లాద చరిత్ర యందలి పరమార్ధమును పోతన యభివ్యక్త మొనరించినాడు. " జీవు లందరూ అజ్ఙానాంధకార  మగ్నులై పుడుతూ చస్తూ యిదేవలయంలో సాగుతున్నారే గాని భగవంతుని స్మరించి తరించాలనే ప్రయత్నం యేమాత్రం చేయలేక పోతున్నారు. అలాంటి వారికి యితరులు చెప్పినా, తమలోకోరికఁగల్గినా , లేక యేమైన నాశకల్పించినా, అడవుల కేగినా ,హరిని ధ్యానించి తరించే కోరిక మాత్రం కలుగఁ బోదుగదా! అంటున్నాడు పోతన. ఇది హిరణ్య కశ్యపుని మదిలో నిడుకొనిఁ జెప్పిన మాట. అతనికేగాదు అతనిని బోలిన దురహంకారులగు , సంసారమగ్నత, నజ్ఙత, జనన మరణాదిక ప్రయాణముల నిరంతరము నలసట నొందు మానవాళికిది హెచ్చరిక! 


                               ప్రహ్లాదుఁడు పరమ  భాగవతోత్తముడు . నిరంతర హరినామ చింతనా పరాయణుఁడు .అచంచలమైన  చిత్త వృత్తితో హరిధ్యాన పరాయణుఁడై మోక్షగామి యైనవాఁడు. రాజ్యాభిలాష గాని, తండ్రి యాజ్ఙ గాని నాతనిని విష్ణు భక్తి నుండి వెనుకకు మరలింప లేకపోయెను . తుదకు  ధండనము గూడ యతనికి మండనమేయైనది . విష్ణు భక్తి తో మైమరచిన యతనిని శిక్ష లు కక్షలు యేమాత్రము బాధింప లేక పోయినవి. 


       శా:  పానీయంబులు  ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్  హాస  లీ 

              లానిద్రాదులు  సేయుచున్ దిరుచున్  లక్షింపుచున్    సంతత 

              శ్రీనారాయణ  పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద  సం 

              ధానుండై  మరచెన్  సురారి సుతుఁ  డేత ద్విశ్వమున్ భూవరా! - ఇదీ ఆయన సుజీవన సరళి. సర్వకాల సర్వావస్థలయందును హరి చింతనమే! లోకముతోపనిలేదు, బంధుమిత్రులతో బనిలేదు, తలిదండ్రులతో పనిలేదు. తుదకు ఆహారముతోజను నతనికిఁ బనిలేకుండెను . కొట్టి కొఱత వేసినను లొంగడాయెను. పైపెచ్చు విష్ణు విరోధియైన తండ్రికే హరినామామృత విశిష్టత నెరిగించి యతనిమనంబును మరలిపఁ జూచినాడు. ఆహా యెంత ధీరుఁడాతడు! 


              సీ:  మందార మకరంద  మాధుర్యమున  దేలు 

                                         మధుపంబు  వోవునే మదన ములకు ; 

                    నిర్మల  మందాకినీ  వీచికలఁ  దేలు  

                                             రాయంచ  సనునె  తరంగిణులకు; 

                  లలిత రసాల పల్లవ  ఖాదియైఁ  జొక్కు 

                                         కోయిల  సేరునే  కుటజ ములకు; 

                 పూర్ణేందు   చంద్రికా  స్ఫురిత  చకోరక 

                                           మరుగునే   సాంద్ర   నీహారములకు ; 


     తే:     అంబుజోదర  దివ్య  పాదారవింద  

              చింతనామృత  పాన విశేష   మత్త 

              చిత్త మేరీతి నితరంబుఁ  జేరనేర్చు 

              వినుత  గుణశీల! మాటలు  వేయు నేల? 


                            యెంత చక్కనిపద్యము భాగవత పద్యకోటిలో నిది మణిపూస గదా! మధుర మనోహర పద సెయ్యతో గంభీరమైన భావముల పరంపరలతో నిది ప్రహ్లాదుని హృదయమునకు అద్దముఁ  బట్టినది.

   మందారపుష్పాలలోని మకరందాలను పానంచేసేగుణంగల మధుపం ఉమ్మెత్తకడకు బోవదుగదా! స్వర్గంగలో నీదురాజ హంస చిరు తరంగిణులను జేరబోదు గదా! మెత్తని తీయమావి చిగురులు మెసవు కోయిల కొండ మల్లి చిగురులు దిన గలదా! పూర్ణిమా చంద్రుని వెన్నెల మెసవు చకోరము మంచు తుంపరులకెగబడదు గదా! అటులనే పద్మనాభుని దివ్య పాదారవింద మరంద పాన మత్తులు యితరములు ఁ గోరరుగదా! వినుత గుణశీల యిక పలు మాటలేల? యని తండ్రికి ప్ర హ్లాదుని సమాధానము. యిందు చివరిపాదము ప్రశంసయో లేక హేళణయో? తెలినంత చతురతను పోతన ప్రదర్శించినాఁడు . 


         సీ:  కమలాక్షు  నర్చించు కరములు   కరములు 

                                             శ్రీ నాధు వర్ణించు  జిహ్వ  జిహ్వ! 


              సుర రక్షకుని ఁజూచు  చూడ్కులుఁ  జూడ్కులు! 

                                              శేష సాయికి మ్రొక్కు శిరము  శిరము;! 

              విష్ణునాకర్ణించు వీనులు వీనులు,  

                                    మధువైరి దవిలిన మనము మనము! 


              భగవంతు వలఁగొను పదములు పదములు! 

                                          పురుషోత్తముని మీది బుధ్ధి  బుధ్ధి! 


      తే: దేవ దేవుని చింతించు దినము దినము 

           చక్ర హస్తుని బ్రకటించు చదువు చదువు; 

            కుంభినీధవుఁ జెప్పెడి గురుడు గురుడు; 

            తండ్రి హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి! 


               చివరకు తండ్రికే  సొడ్డుఁబెట్టినాడు నేటికి విరమింతము సెలవు !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: