17, జులై 2023, సోమవారం

లక్ష్మీదేవి

 



*లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు. మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే. ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.*


*పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.*


*ఇంకే ముంది జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి సమాలోచన చేశాడు.*


*వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.*


*ఇంద్రుడు వారి సలహా పై దత్తాత్రేయుని శరణువేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు. ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.*


*ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.*


*యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.*


*అనఘా దేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.*


*జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.*


*నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.*


*మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండ వచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగ పరచినంత మటుకూ పర్వాలేదు.*


*కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.*


*తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవు తుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుంది.*


*🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🙏*

🪷🪷🪷 🍁🕉️🍁 🪷🪷🪷

కామెంట్‌లు లేవు: