26, జులై 2023, బుధవారం

భక్తి

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


                   *భక్తి*


భక్తి’ అనే మాట ఉపనిషత్తుల్లో ప్రతిపాదితమై, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రతిష్టితమై, ప్రహ్లాదాదులతో అనుష్టితమై... మధ్యయుగంలో ఉద్యమం అయింది. ఆధునిక కాలంలో ఈ మాటను... ‘దైవ భక్తి, దేశభక్తి, ప్రభుభక్తి, రాజ భక్తి, రాజకీయ భక్తి, మూఢభక్తి’...  ఇలా అనేక విధాలుగా వాడడంతో, దాని అసలు అర్థం మసకబారింది. మూఢవిశ్వాసానికి పర్యాయపదంగా పరిగణన పొందుతోంది. ఈ దుస్థితికి కారణం నిజమైన భక్తితత్త్వాన్ని నిజజీవితంలో ప్రకటింపజేసే మహాత్ములు మన సమాజంలో కనుమరుగైపోవడమే! 

అసలు భక్తి అంటే ఏమిటి? ‘‘భగవంతుని మీద సర్వోత్తమైన ప్రేమే భక్తి. అది అమృతానంద స్వరూపం. త్యాగరూపమైనది  ఏ కోర్కెలూ లేని స్థితి అదే మోక్షం’’ అని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. భగవద్గీతలోని ‘భక్తియోగం’ భక్తి తత్త్వాన్నీ, లక్షణాల్నీ విపులంగా తెలిపింది. శ్రీమద్భాగవతం భగవద్భక్తుల లక్షణాలను, భక్తి స్వరూపాన్నీ సవిస్తరంగా ఆవిష్కరించింది. మానవునికి క్రోధం, శోకం లాంటి ఎన్నెన్నో అనుభూతులు ఉన్నా ప్రేమ లాంటి మధురమైన అనుభూతి మరేదీ లేదు! అందునా, ప్రేమ పొందడం కన్నా ప్రేమించడం ఇంకా మధురం. మానవునికి స్వతహాగా ప్రేమించే లక్షణం ఉన్నా... ఆ ప్రేమ ఒక వ్యక్తికో, ఒక వస్తువుకో మాత్రమే పరిమితమవుతుంది. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ, స్వార్థభావంతో కలుషితమౌతూ, విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. శాస్త్రం దీన్ని ‘సంగం’ అని అంటుంది. కానీ ఆ ప్రేమే నిష్కల్మషమైతే, సార్వజనీనమైతే, నిరంతరానుభవమైతే అదే నిత్యానందానుభూతి. అక్కడే సమస్త దుఃఖాలకు ఉపశాంతి. అదే భక్తి!  అటువంటి నిరవధికమైన ప్రేమైక్య స్థితిని సాధించడానికి ముందుగా ప్రపంచమంతటా కనిపించే ‘అనేక’త్వాన్ని పక్కకునెట్టి, అంతటా ‘ఏక’రూపంగా ఉన్న తత్త్వాన్ని నిష్కామంగా ప్రేమించడాన్ని సాధన చెయ్యాలి. ఆ ‘ఏక’ రూప తత్త్వమే భగవంతుడు! ఈ జగత్తులో భగవంతుడు వ్యాపించనిది ఏదీ లేదు కదా! సమష్టి రూపమైన భగవంతుని పట్ల... సాధకులు చేసే ’నిష్కామప్రేమ‘ అనే ఈ ఉపాసనాక్రమానికి కూడా ’భక్తి‘ అనేదే వ్యవహార నామం. భక్తి సార్వజనీనం, భేదరహితం కావడంవల్ల నిజమైన భక్తిలో ‘విషమత్వం’ లేదు. అంతా ‘సమత్వ’మే!

అనన్య భక్తి

మరి అంతటా ఉన్న భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి? అందుకు సులభమైన మార్గమే భగవంతుని సగుణ, సాకార మూర్తి! అనంతమైన భగవత్తత్త్వానికి అనంతమైన కళ్యాణ గుణాలు, రూపాలు, నామాలు ఉన్నాయి! వాటిలో రాముడు, కృష్ణుడు, శివుడు, లలిత తదితర సంపూర్ణ దేవతామూర్తుల్ని ఉపాసనా సౌలభ్యం కోసం వేద, పురాణాలు మనకు అందించాయి. భక్తులు తమకు ఇష్టమైన ఒక దేవతా మూర్తిని స్వీకరించి, సమస్త దేవతలనూ, సమస్త జగత్తునూ ఆ మూర్తిలోనే ఉన్నట్టు భావించి, పరదేవతగా ఉపాసించడం మొదటి క్రమం. ఆ తరువాత సమస్త జగత్తులో భగవద్దర్శనం, నిరంతరానుభూతి పొందడం. ఉపాసించడం అంటే - ఆ మూర్తి దివ్య మంగళ స్వరూపం, గుణాలు, లీలలు తదితరాలన్నిటితో చేసే ధ్యానం. మనసు మరే ఇతర విషయాల మీద, ఇతర దేవతా రూపాల మీద కాకుండా... ఆ ఇష్టదేవతామూర్తి పైనే నిరంతరం లగ్నం కావాలి. దీన్నే ‘అనన్య భక్తి’ అంటారు. ‘అనన్య’ అంటే... ‘వేరే ఇతరమైనది ఏదీ లేకుండా’ అని అర్థం.

పురాణాలు ఒక్కొక్క దేవతను ప్రధానంగా కీర్తిస్తూ... తక్కిన దేవతలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ‘విష్ణు పురాణం’ విష్ణు పారమ్యంగా ఉంటూ... ఇతర దేవతామూర్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే ‘శివ పురాణం’ శివ పారమ్యాన్ని బోధించి, ఇతర దేవతా మూర్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇది కేవలం ఆయా రూపాలను ఉపాసించే భక్తులకు అనన్య భక్తిని అలవరచడానికే! అంతేకాని విష్ణువు, శివుడు వేరని మాత్రం కాదు. ఒకే భగవంతుడు అనేక విభూతులలో, అనేక కార్యాలు చేస్తూ, వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపాలతో, వేరు వేరు తత్త్వాలుగా అగుపిస్తాడు. 

నవవిధ మార్గాలు

భక్తి అంటే ‘నిరంతరం భగవంతుణ్ణి సేవించడం, లేదా భగవత్సాన్నిధ్యంలో ఉండడం’ అని కూడా అర్థం ఉంది.  భగవత్సాన్నిధ్యంలో ఉండడం కోసం భక్తుడికి ప్రతిపాదితమైన అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో భాగవతంలో ప్రహ్లాదుడు వెల్లడించిన నవవిధ భక్తులు... అంతే తొమ్మిది విధాలుగా ఆచరించే భక్తి మార్గాలు ప్రసిద్ధమైనవి. ఇవి- శ్రవణం (ఏడు రోజులు నిరంతర భాగవత శ్రవణం చేసిన పరీక్షిత్తు దీనికి చక్కని ఉదాహరణ), కీర్తనం (నారదుడు), స్మరణం (ప్రహ్లాదుడు), పాదసేవనం (మహాలక్ష్మి), అర్చనం (పృథు చక్రవర్తి), వందనం (అక్రూరుడు), దాస్యం (హనుమంతుడు), సఖ్యం (అర్జునుడు), ఆత్మనివేదనం (బలి చక్రవర్తి). ఇవన్నీ భక్తులు భగవంతునితో నిరంతరంకూడి ఉండటానికి ఏర్పరచుకున్న సంబంధాలు. ఇవే కాకుండా.. వాత్సల్య భక్తి- భగవంతుణ్ణి సొంత బిడ్డలాగా భావించడం (యశోద), మధుర భక్తి - భగవంతుణ్ణి ప్రియునిగా భావించడం (గోపికలు) లాంటి సంబంధాలు కూడా ప్రతిపాదితమయ్యాయి. ఆళ్వారుల ‘దివ్య ప్రబంధాల’లో ప్రధానంగా కనిపించేవి ఈ భక్తి తత్త్వాలే!

కామెంట్‌లు లేవు: