4, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩* *భాగం 1*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*


*🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩*   


*భాగం 1*


ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ 


          వేదశాస్త్రాలు యిలా చాటుతున్నాయి..

దుర్లభమైన మానవదేహాన్ని దాల్చీ శాశ్వతానంద ప్రదమైన మోక్షాన్ని పొందటానికై సాధన చేయని వ్యక్తి జీవితం నిరర్థకమని. విషయసుఖాల్లోని వ్యామోహం సంసార తాపత్రయం కారణంగా ఆత్మజ్ఞాన సాధనల్లో  అభిరుచి ఏర్పడదు. అజ్ఞానాంధకారజీవనం అలవడటంతో పరమాత్మజ్యోతిని దర్శించలేని  వారిని తరించటం ఎలా?


 సంసారసాగరంనుంచి తాము తరించటమే కాకుండా యితరులను తరింపచేయటానికై తమ జీవిత సర్వస్వాలను అర్పించే భగవదంశసంభూతులైన మహాత్ములు సమస్త ప్రజలకు మార్గ దర్శకులు  అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు వివేకానందస్వామి.


వివేకానంద  పూర్వీకుల వంశ చరిత్ర...


 కలకత్తాలోని సిమ్లా అనే పేటలో  వివేకానందుడి

 వంశస్థులు అనేక శతాబ్దాలుగ సిరిసంపదలతో తులతూగుతూ దాతృత్వానికీ కాక పాండిత్యానికి, శక్తిసామర్థ్యాలకూ ప్రఖ్యాతిగాంచారు. వీరు కాయస్థకత్రియులు, వీరిని దత్తవంశస్థులని పేర్కొంటారు. 


సంస్కృత పారసీక భాషల్లో అసమాన పాండిత్యాన్ని గడించి, న్యాయ శాస్త్రపారంగతుడై సాంసారిక జీవితాన్ని విడనాడి ఇరవై ఐదేళ్లు నిండకమునుపే సర్వసంగపరిత్యాగం చేసిన దుర్గాచరణ దత్తు ఈతడి తాత, దుర్గాచరణుడి పుత్రుడు విశ్వనాథుడు.

 

 దుర్గాచరణుడి ధర్మపత్ని కాశీవిశ్వనాథుణ్ణి సందర్శించకోరి తీర్థయాత్రకు బయలుదేరింది. 

 కాశీక్షేత్రాన్ని చేరుకొని వివిధ దేవాలయాలను దర్శించసాగింది. ఒకరోజు ఆమె విశ్వనాథాలయానికి పోతూ కాలు జారిపడి స్మృతి కోల్పోయింది. వెంటనే ఒక సన్న్యాసి రివ్వున వచ్చి ఆమెను లేవదీశాడు. తనకు సహాయం చేసిన పరివ్రాజకుడు తన భర్త ఐన దుర్గా చరణుడే అని గుర్తించిన ఆమె ఆశ్చర్యానందాలను వర్ణించటం ఎవరితరం? ఇద్దరి హృదయాల్లోను భావతరంగాలు పొంగిపొర్లాయి. "ఆహా! మాయ! మహామాయ!" అంటూ యతిపుంగవుడు అదృశ్యుడయ్యాడు! ఆమే తన యాత్రలకై మరలింది.


విశ్వనాథుడు పెరిగి పెద్దవాడై పారసీక, ఆంగ్లభాషల్లోను, న్యాయ శాస్త్రంలోను ప్రావీణ్యం గడించి వంశపారంపర్య న్యాయవాద వృత్తిని అవలంబించాడు. అనతికాలంలోనే న్యాయశాస్త్రంలో అతడి పేరు నలు దిక్కుల్లోను వ్యాపించింది. విశ్వనాథుడి భోగభాగ్యవైభవాలచేత దత్తవంశం ప్రభువంశంగా పేరుగాంచింది. మరుసటి రోజును గురించి తలచక అడగాని వారి తప్పు అన్నట్లు దానధర్మాలు చేసే మహాదాత విశ్వనాథుడు. అల్పులపట్లా, అనర్హులపట్ల కూడ తాను కనబరుస్తున్న ఆదరణకు కుమారుడైన నరేంద్రుడు ఒకప్పుడు తనను నిలదీయగా, కారుణ్యమూర్తి ఐన ఆతడిలా అన్నాడు. 


"నాయనా! మానస జీవిత మహాఘోర యాతనలు నీకేం తెలుసు? తాగటంచేత క్షణకాలమైనా తమ దుస్థితిని మరచిపోవాలనుకొంటారు యీ నిర్భాగ్యులు. ఈ దీనుల పట్ల జాలిపడటమా నా మహాపరాధం!! ఏమి దీనజన వాత్సల్యం! ఇలాటి కారుణ్యపయోనిధి కుమారుడై జన్మించిన వివేకానందుడు దరిద్రనారాయణ సేవకై తన జీవితాన్ని ధారపోయటంలో వింతేముంది?


విశ్వనాథుడి భార్య భువనేశ్వరీదేవి అతడికి తగిన సహధర్మచారిణి. నిత్యం రామాయణ మహాభారతాలను పారాయణచేస్తూ వాటిలోని ప్రశస్త భాగాలను కంఠస్తంచేసి, రామాయణ మహాభారత సారాన్ని నరేంద్రుడికి ఉగ్గుపాలతో పోసింది. నరేంద్రుణ్ణి దేశభక్తాగ్రగణ్యుడైన జాతీయ వీరుణ్ణి గావించింది మాతృబోధామృతమే అని చెప్పక తప్పదు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: