8, ఆగస్టు 2023, మంగళవారం

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట* 


గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వానిపై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి!

ఒక్కరోజయినా నీవు ఆ ఆవుపాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. 


నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.


ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. 


ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.


రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును.


 ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. మందలించుటయేమి – హెచ్చరించినది.


 ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడనన్నాడు వినయముగా గోపాలుడు.


రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది. 


ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది. 


ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. 


పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.


కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! 


అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. 


తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.


ఆయన తల పై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై బడి మూర్చపోయినాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా;* *ధరణీనాయక గోవిందా,* *దినకరతేజా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,* 

*గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా.* 12||


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*🙏

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: