20, ఆగస్టు 2023, ఆదివారం

నవగ్రహ పురాణం - 30 వ అధ్యాయం

 _*నవగ్రహ పురాణం - 30 వ అధ్యాయం*_


*గురుగ్రహ జననం - 1*


అంగిరసుడు ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని కొడుకు ఉతథ్యుడికి వేదం. నేర్పుతున్నాడు. ఉతథ్యుడు శ్రద్ధాసక్తులతో పాఠం నేర్చుకుంటున్నాడు. తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు ఉతథ్యుడు ఆలోచించి , సమాధానాలు చెపుతున్నాడు. సమయానికి నారద మహర్షి వచ్చాడు , 'నారాయణ' నామ స్మరణం చేస్తూ.


అంగిరసుడు తన మానస సహోదరుడైన నారదుణ్ణి సాదరంగా దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. పాఠం ముగించి , ఉతథ్యుడు వెళ్ళాడు. 


*"విద్యలో తండ్రిని మించిపోయేలా ఉన్నాడే , ఉతథ్యుడు !"* అన్నాడు నారదుడు.


*"లేదు. నారదా ! ఉతథ్యుడు తెలివైన వాడే. మాటల్లోనూ , నడతలోనూ , నడకలోనూ బాగా నెమ్మదిగా ఉంటాడు. కుశాగ్ర బుద్ధీ. మహా మేధావీ అయిన ఆదర్శ పుత్రుణ్ణి పొందాలని ఉంది నాకు"* అంగిరసుడు నవ్వుతూ అన్నాడు.


*“అగ్నిశిఖ లాంటి తీక్షణమైన , చురుకైన బుద్ధి కలిగిన పుత్రుడు మీకు తప్పక కలుగుతాడు ! అగ్నిభట్టారకుణ్ణి ఆరాధించండి !"* నారదుడు అన్నాడు.


*“అగ్ని దేవుడా"* అంగిరసుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఔను ! అగ్నిదేవుడే ! మీరంటే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం. ప్రత్యేకమైన అభిమానం ఉన్నాయి. మరిచి పోయారా ? అగ్ని అలిగి వెళ్ళి అరణ్యాల్లో తపస్సులో మునిగినప్పుడు ఆయన విధుల్ని నిర్వహించి , మీరు లోకాలకు ఉపకారం చేశారు గదా !"* గతాన్ని గుర్తు చేశాడు నారదుడు. 


*"ఎందుకు గుర్తు లేదు , నారదా ! తన పదవిని శాశ్వతంగా స్వీకరించమన్నాడు. ఆనాడు అగ్నిహోత్రుడు. సవినయంగా నిరాకరించాను. నన్ను తన జ్యేష్ఠ పుత్రుడిగా భావించమన్నాను"* అంగిరసుడు చిరునవ్వుతో అన్నాడు. 


*"ఇంకేం ! మేథావి అయిన కుమారుడికి - మహామేధావి అయిన కుమారుణ్ని అనుగ్రహిచి , ఆశీర్వదించడానికి అగ్నిహోత్రుల వారు సందేహించరు ! శుభస్య శీఘ్రం ! వెంటనే అగ్నిభట్టారకుడు అభిమానించే హోమకార్యం ప్రారంభించండి !"* అంటూ లేచాడు నారదుడు.


అంగిరసుడు నారదుడి సూచనను అనుసరించి , అగ్నిదేవుడికి ప్రీతి కలిగించే 'అగ్నికార్యం' ప్రారంభించాడు. ధర్మపత్నిని పక్కన ఉంచుకొని భక్తి ప్రపత్తులతో శాస్త్ర సమ్మతంగా ఆయన చేసిన యాగం సత్వరమే సత్ఫలితాన్ని కలిగించింది.


అగ్నికుండంలో ప్రజ్వరిల్లుతున్న కీలలలో ధగధగ వెలిగిపోతున్న అగ్నిభట్టారకుడు ప్రత్యక్షమయ్యాడు. అంగిరసుడూ , శ్రద్ధా భయభక్తులతో చేతులెత్తి నమస్కరించారు. 


*"అంగిరసా ! నువ్వు నన్ను ఎప్పుడు వరం కోరుతావా అని ఆతృతగా చూస్తున్నాను. సుమా ! కోరుకో ! ఏం కావాలి ?"* ఆశ్రమ ప్రాంగణంలో అగ్నిదేవుడి కంఠం గంభీరంగా ప్రతిధ్వనించింది. 


*"కుశాగ్రబుద్ధీ , మహామేధావీ అయిన ఆదర్శ పుత్రుణ్ణి ప్రసాదించు , తండ్రీ !"* అంగిరసుడు అర్ధించాడు.


*"పుత్రుడు కోరితే పుత్రుణ్ని ఇవ్వకుండా ఉండగలనా ?"* అగ్నిదేవుడు నవ్వుతూ అన్నాడు. *"సునిశిత బుద్ధీ , అద్వితీయమైన వాక్చాతుర్యం , మహత్తరమైన మేథోసంపదా కలిగిన పుత్రుడు నీ సతీమణి శ్రద్ధ ద్వారా నీకు కలుగుతాడు. లోకాలన్నీ భవిష్యత్తులో అతని పేరునే బుద్ధికుశలతకు పర్యాయపదంగా ఉపయోగిస్తాయి. తల్లిదండ్రులైన మీ చరిత్రనూ , కీర్తినీ ఆ కుమారుడు శాశ్వతం చేస్తాడు"* అగ్నిదేవుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.


*"ధన్యోస్మి !"* అంగిరసుడు శిరస్సు వంచి నమస్కరించాడు. *"శుభం భూయాత్ !"* అంటూ అగ్ని జ్వాలలో కలిసిపోయాడు.


అగ్నిదేవుడి వరం ఫలించింది. సకాలంలో 'శ్రద్ధ గర్భవతి అయింది. తను ఎంతగానో కోరిన మహామేధావి అయిన పుత్రుణ్ణి గర్భంలో మోస్తున్న ధర్మపత్నిని అంగిరసుడు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. ఆశ్రమంలో నెమ్మదిగా తిరుగాడుతున్నది. శ్రద్ధాదేవికీ నవమాసాలూ నిండాయి.


అది ఒక శుభదినం. శ్రద్ధాదేవి ఒక బాలునికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే పరిమళం వెదజల్లే పుష్పంలా బాలకుడి ముద్దు మొహంలో ఏదో జ్ఞానతేజం ప్రతిఫలిస్తోంది. ఆ విశాల నేత్రాలలో ఏదో వెలుగు !


అంగిరస మహర్షి పుత్ర జననాన్ని పురస్కరించుకొని , శాస్త్రం విధించిన అగ్నికార్యాలు నిర్వర్తించాడు. ఇతర మానస పుత్రులు సకుటుంబంగా నామకరణమహోత్సవానికి విచ్చేశారు.


అంగీరసుడు పుత్రుడికి 'బృహస్పతి' అని నామకరణం చేశాడు. త్రిమూర్తుల ప్రతినిధిగా ఆ శుభకార్యంలో పాల్గొన్న నారద మహర్షి శ్రద్ధా అంగిరసులను అభినందించి , ఇలా అన్నాడు....


*"మీ చిన్ని శిశువు మహాజ్ఞాన సంపన్నుడుగా మాత్రమే కాదు , భావి కాలంలో నవగ్రహాలలో ఒక ప్రముఖ దేవతగా అభిషిక్తుడవుతాడు. త్రిమూర్తులు ఈ సందేశాన్ని మీకు అందజేయమన్నారు”*

కామెంట్‌లు లేవు: