24, ఆగస్టు 2023, గురువారం

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 5*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


        *హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం*

        *పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |*

        *స్మరోఽపి త్వాం నత్వా రతి నయన లేహ్యేన వపుషా*

        *మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ||*


ఈ శ్లోకంలో అమ్మవారి మంత్రశక్తిని వివరిస్తున్నారు శంకరులు. మొదటి పాదం మొదటి శబ్దం హరి తో అదే పాదంలోని చివరి శబ్దం ఈమ్ కలిపి హ్రీమ్ అనే బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు ఇందులో. అలాగే విష్ణువు మోహినిగా వచ్చి శివుడిని మోహింపజేయటం అనే ఐతిహ్యాన్ని కూడా చేర్చారు. ఇప్పుడు ఈ శ్లోకార్ధం చూద్దాం.


ప్రణత జన సౌభాగ్య జననీం = ప్రణమిల్లే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించే తల్లి. అలాంటి తల్లిని

హరిస్త్వామారాధ్య = హరి ఉపాసించాడు. ఫలం ఏమి పొందాడు?

పురా నారీ భూత్వా = తాను స్త్రీ గా మారాడు. మారి ఏమి చేశాడు?

పురరిపుమపి క్షోభ మనయత్ = త్రిపురాంతకుడైన పరమేశ్వరుని మనసును కలవరపెట్టాడు. మన్మథుడినే   భస్మం చేసిన ఈశ్వరుడిని ఎవరు మోహింపజేయగలరు, కలవరపెట్టగలరు అమ్మవారు తప్ప. మారి విష్ణువు ఎలా మోహింపజేశాడు?  నారాయణుడు అమ్మవారిని ఉపాసిస్తే నారాయణి అయిన ఆమె ఆయనను ఆవేశించి శివమోహినిగా వచ్చింది. 


ఎందుకంటే క్షీరసాగరమధనానంతరం ఆ విశేషాలను నారదుడు శివునికి విన్నవిస్తూ మోహినీ అవతారం గురించి చెప్పినప్పుడు శివుడు ఆ మోహినిని చూడాలనుకొని వైకుంఠమునకు వెళ్తాడు. అప్పుడు విష్ణువు మాయమై మోహినిగా శివునకు కనబడతాడు. ఇది విష్ణువు యొక్క శివమోహినీ స్వరూపం. ఆయన ఇతర రెండు మోహినీ స్వరూపాలు జగన్మోహిని (క్షీరసాగరమధనం) భస్మాసుర మోహిని. రెండూ రాక్షసులను మోహింపజేసి జయించటానికి. అమ్మవారి పురుష రూపమే నారాయణుడు. అందుకే ఆమెను నారాయణి అని అంటారు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు మోహినీ రూపంలో అనుగ్రహిస్తారు స్వామి.

అసలు స్త్రీ శబ్దం స కార,త కార, ర కారముల సత్వ రజస్తమో గుణాలను సూచిస్తే చివరలో వచ్చే ఈ కారము శక్తి ప్రణవం. అందువల్ల స్త్రీ అంటే త్రిగుణాత్మికమైన శక్తి స్వరూపం. అందుకే మన భారతదేశంలో స్త్రీని అవమానించరాదు అగౌరవపరచరాదు. భగవంతుడిని స్త్రీ రూపంగా కొలుస్తారు.


స్మరోఽపి త్వాం నత్వా=స్మరుడు అంటే మన్మథుడు కూడా నిన్ను ఆరాధించి

రతి నయన లేహ్యేన వపుషా = రతీదేవి కన్నులకు ఆనందం కలిగించే రూపం ధరించి (మన్మథుడిని శివుడు అగ్ని నేత్రంతో దగ్ధం చేయగా రతీదేవి అమ్మవారిని ప్రార్ధిస్తుంది తనను కనికరించమని. అప్పుడు అమ్మవారు వరం ఇస్తుంది.మన్మథుడు లోకాలకు కనబడడు కానీ నీ కళ్ళకు భువనమోహనంగా కనిపిస్తాడు అని. మన్మథుడికి అనంగుడనే పేరు అందుకే వచ్చింది)


మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ = మన్మథుడు మునులను కూడా మోహింపజేస్తున్నాడు. ఇది నీ మహాత్మ్యమే. నిన్ను ఉపాసించటం వలననే ఆయన మునులనూ లోకాలనూ మోహింపజేస్తున్నాడు.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: