24, ఆగస్టు 2023, గురువారం

విజయుని సోయగం!

 


విజయుని సోయగం!


అతనినుతింపశక్యమె! జయంతునితమ్ముడుసోయగంబునన్/

బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండుకృపారసంబునన్/

క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదుసమిజ్జయంబునం/

దతనికతండెసాటి చతురబ్ధిపరీత మహీతలమ్మునన్//

విజయవిలాసము-చేమకూరవేంకటకవి.

భావం: అర్జనుడు అందంలో జయంతుని తమ్ముడు .దయాస్వభావంలో విష్ణునకు ప్రాణసఖుడు.యుధ్ధంలో విజయంపొందడంలో పరమేశ్వరునకు సరిజోదు.చతుస్సాగరపర్యమతమైనయీభూమండలంలో అతనికతడేసాటి.అట్టి అర్జనుని పొగడశక్యమా?"-అని,


"చెప్పవలె కప్పురంబులు /

కుప్పలుగాబోసినట్లు,కుంకుమపైపై/

గుప్పినగతివిరిపొట్లము,/

విప్పినగతి,ఘమ్మనన్గవిత్వము సభలన్"-అని కవిత్వస్వభావానుగ్గడించిన రఘునాధుని యాస్థాని వేంకటకవి.


.చక్కనితెనుగు నుడికారంతో శ్లేషచమత్కారాలతో ఘమ్మనే కవిత్వంచెప్పిన మహనీయుడు.ఈతడేవిజయవిలాసం.

           కావ్యారంభంలోపాండవులరాజధాని వగైరాలను,ధర్మరాజును,విపులంగా వర్ణించి,పిదప కావ్యనాయకుడగు విజయునివర్ణనకు పూనుకొనినాడు.ఆ సందర్భములోనిది యీపద్యరత్నం.


అందంలో యితడు జయంతుని తమ్ముడంటాడు.ఏదోమాటవరుసకన్నమాటకాదది.నిజంగానే!అర్జనుడుగూడాయింద్రునిపుత్రుడేకదా! దయలోగరుడధ్వజుని ప్రాణమిత్రుడు.నిజమే,కృష్ణునకు ప్రాణసఖుడేకదా!.నరనారాయణులమైత్రిలోకప్రసిద్దము.యుధ్ధవిజయాలలో పార్వతీపతి శివునకు ప్రతివీరుడు.కిరాతార్జునీయకథసు ప్రసిధ్ధమే!

          ఇలాఈపద్యంలోఅర్జునుడు అందంలో,దయలో,వీరత్వంలో,జయంతునీ,విష్ణువునుఈశ్వరునీపోలినవాడనిచెప్పాడు.అయితే వారిపేరులను నేరుగా ప్రస్తావించక,వారిసంబంధాలనుసూచించే తమ్ముడు,ప్రాణసఖుడు,ప్రతిజోదు,అనేపదాలనువాడటంలో కవితన యసమానప్రతిభను వెల్లడించాడు.


చివరిగా"అతనికతండెసాటి"యనటం స్వవచన వ్యాఘాతంగా కనిపించినా అదికూడా యదార్ధమే! జయంతాదులు స్వర్గాదిలోకములకు జెందినవారు. భూలోకమునమాత్రము అర్జునుననకు సాటియర్జనుడేననుట సత్యసమ్మతమేగదా?

ఇదియే కవియొక్క చమత్కారము!!!🙏🙏🙏🌷🌷🌷💐💐💐🌷🌷🌷🌷💐💐💐💐💐💐🌷

కామెంట్‌లు లేవు: