17, ఆగస్టు 2023, గురువారం

శిష్యురాలిగా

 



ఆరోజుల్లో గోదావరి ప్రాంతములో చాటపర్తి సుందరమ్మ అనే భోగం మేళం నాయకురాలు ఉండేదిట. మహా అందగత్తె .. గాయని, మరియు నాట్యములో అందెవేసిన చేయి. నా అంతవారు లేరు అని ఆమెకు మహా గర్వం. నా వాలు చూపులతో, అభినయం తో ఎంతటివారినైనా కట్టి పడేయగలను అని ధీమాగా పాడుతూ నాట్యం చేసేదిట.


ఓ సారి ఓ పేరు మోసిన వైశ్యుని కుమారుడి వివాహములో తన బృందముతో గజ్జె కట్టింది. ఆమె సంస్కృతాంధ్ర భాషల్లో పట్టున్న ఘనురాలు. "కాంతో యాసతి దూరదేశ మితి చింతా పరం జాయతే, లోకానంద కరోపి చంద్రవదనే, వైరాయాతే చంద్రమాః" అనే శ్లోకం చదువుతూ .. అభినయం చేస్తూ .. "అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచ బాణస్యసాయకాః" అంటూ అయిదు బాణాలను ప్రేక్షకుల మీద వేసింది. 


వెంటనే సభలో ఓ ఇద్దరు వ్యక్తులు సభ మైలపడింది అంటూ గొడవ చేయసాగారు.. జనాలందరూ తికమక పడుతూ అల్లరి చేయగానే సుందరమ్మ ఎవరో పండితులు సభలో ఉన్నారని గ్రహించివారిని గుర్తు పట్టి వారి కాళ్ళ మీద పడింది .. అయ్యా నేను అభినయములో ఏమైనా తప్పు చేసానా అని అడిగింది సవినయంగా .


దానికి వారు  పంచ బాణాలు చెబుతారు కానీ అభినయములో మాత్రం వేసేది నాలుగు బాణాలే.. అయిదవది వేస్తే నాయిక మృతి పొందుతుంది.. తద్వారా 'మృతాశౌచం' అనగానే తన తప్పు గ్రహించి సంస్కృత ఆంధ్ర భాషల్లో నిపుణురాలైన ఆమె తనను శిష్యురాలిగా అంగీకరించి తనకు విద్యాదానం చేయమని కోరిందిట. ఆ పండితులెవరనుకున్నారు.. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి, మరొకరు కూచి పూడి నాట్య ప్రముఖులు వేదాంతం లక్ష్మీనారాయణ శర్మ గారు

కామెంట్‌లు లేవు: