27, ఆగస్టు 2023, ఆదివారం

ఛాందస్సులు అంటే ఎవరు తెలుపగలరు?

 నిత్యాన్వేషణ: 


ఛాందస్సులు అంటే ఎవరు తెలుపగలరు?


సూటి సమాధానం:

నియమ నిబంధనలను తు.చ. తప్పకుండ పాటించేవారు ఛాందసులు.


విశ్లేషణ + వివరణ:

ఛందస్సునకు సంబంధించినది ఛాందసము. ఛాందసమును పాటించేవారు ఛాందసులు.

ఛాందసము అంటే ఏమిటో తెలియాలంటే, ముందుగా ఛందస్సు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి.

'ఛందస్సు' అనే పదానికి చాలా అర్థాలు వున్నాయి.

* 'పద్యలక్షణము తెలిపెడి శాస్త్రము'. (ఇది మనకు బాగా తెలిసిన అర్థం). ఈ అర్థంలో ఛందస్సు అనేది వేదాంగములలో ఒకటి.

    * 'ఛంద' అనే సంస్కృత మూలరూప క్రియా పదానికి అర్థాలు to spread as a cover, to protect, to be pleased with, delight in. వేదంలోని శ్లోకాలు, పద్యాలు నోటి ద్వారా ఒకరి నుండి మరొకరికి చెప్పబడేవి. అలా చెప్పినపుడు ఉచ్ఛారణ, వినికిడి, జ్ఞాపకశక్తి లోపాల వల్ల అక్షరాలు మారిపోకుండ, మారిపోయినా వాటిని సరిచెయ్యడానికి ఈ వేదాంగం ఉపయోగ పడుతుంది. అంతే కాకుండ పద్యాలకు చెవులకు ఇంపైన ఉచ్చారణ క్రమాన్ని కూడా ఇస్తుంది ఈ ఛందస్సు.

* ఛందస్సు అనే పదానికి వేద మంత్రాలని కూడా అర్థం ఉంది. వేదాంగాలలో ఒకదాని పేరు వేదాలకు కూడా ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. వేద మంత్రాలు ఛందస్సుల చేత (పద్య లక్షణాల చేత) తమను తాము సమాహితం చేసుకోవడం వల్ల వేదం ‘‘సంహిత’’ అయింది. ఈ అర్థం ప్రకారం వేదం చదివిన వారిని కూడ ఛాందసులు అంటారు.

* ఒక నియమము లేదా సూత్రం (A rule, principle). ఇది ప్రధాన అర్థం. పై రెండు అర్థాలను ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు.

* యథేచ్ఛమైన నడవడిక.

* ఇచ్ఛ, కోరిక.

* అభిప్రాయము.

పంచాంగంలో (శాస్త్రంలో) చెప్పబడిన వైదిక ఆచారాలను ఉన్నవి ఉన్నట్లుగా నియమబద్ధంగా పాటించడాన్ని ఛాందసము అనేవారు.

పాత పద్ధతులకే కట్టుబడి, సమాజంలో వస్తున్న మార్పులను వ్యతిరేకించే వ్యక్తులను వారిలో ఉన్న 'కేవలం పుస్తకాల పురుగు యొక్క మూర్ఖత్వాన్ని' ఆసరాగా తెలివితక్కువవారిగాను, అమాయకులుగాను, లౌకిక జ్ఞానం లేకపోవడంగాను కూడ పరిగణిస్తారు. వారినే ఈ కాలంలో ఛాందాసులు అంటున్నారు.


మరువలేని మధురమైన ఉదాహరణ:

ఈ సందర్భంలో … తమను తాము ఆధునిక మేదావులుగా చెప్పుకొనేవారు సాంప్రదాయవాదులను ఛాందసులు అని ఆక్షేపణ చేసే దృశ్యం శంకరాభరణం సినిమాలో తప్పకుండా చూసితీరాలి …



- రెండవసమాధానం:


వట్టి ఛాందసులు అని వెటకారం చేస్తూ ఉంటారు కొందరు. కానీ ఈ పదాల అర్థం ఎవరికీ తెలిసి ఉండదు.

ఛందస్సు అంటే వేదం. వేదం చదివి అర్థం చేసుకొన్న వాడు అయోగ్యపు పనులు చేయడానికి ఇష్టపడడు. సందేహిస్తాడు. పాప భీతి ఒకటి పీకుతూ ఉంటుంది.

పెద్ద వాళ్లు వస్తే లేచి ఎదురుబోవాలి.

* సత్యం వద*..కాబట్టి తేలికగా అబద్దం చెప్పడానికి నోరు రాదు.

*మా గృధః కస్యస్విత్ ధనం *..వేరే వాళ్ళ డబ్బు కొట్టేయవద్దు.!!!.

" ఇలాంటివి ఈ రోజుల్లో పెట్టుకుంటే కుదరదండీ!" అని సమయానుకూలంగా అబద్ధమో సుబద్ధమో ఏదో ఒకటి చెప్పి పని జరుపుకు పోయే వాళ్ల కు — ఈ లాంటి వాళ్ల ప్రవర్తన వీళ్ళేదో కృతయుగం నాటి మనుషులు అనిపిస్తుంది. "వట్టి ఛాదస్తులు ..ఈ కాలానికి పనికి రారు" —అని బాహాటంగానే ఆక్షేపిస్తూ ఉంటారు.

కామెంట్‌లు లేవు: