2, ఆగస్టు 2023, బుధవారం

ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


     *ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*

                ➖➖➖✍️


*ఒకసారి ధర్మరాజు భీష్ముని…        “పితామహా! ధనతృష్ణతో  కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు?” అని అడిగాడు.*


*భీష్ముడు… “ధర్మజా  ధనము సంపాదించి,సంపాదించి విసుగుపుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది.             ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను… ”ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతో బంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. *


*అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి.*


*అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో…           "అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంప్రదించాలి అనుకున్నాను. అది సాధ్యంకాదని తేలి పోయింది.*


*మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలికాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవివ్యర్ధమేకదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరికవదలకుంటే సుఖం ఉండదు.*


*కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది.*


*కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందాలి. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే      నా లోని ధనాపేక్ష తగ్గింది.*


*నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడుపుతాను.” అన్నాడు.*


*దుఃఖ విముక్తి:-*


*ధర్మరాజు… “పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు?”  అని అడిగాడు.* 


*భీష్ముడు…  “ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను... ‘పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు.*


*అందుకు ఆ బ్రాహ్మణుడు…  "మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము  ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు.*


*ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు  మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి.* 


*ఈ సృష్టిలో  భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు.     నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను.*


*దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక  ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద, కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను.*


*లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు.*


*అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకము చేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది" అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.*


*మనుషులు తరించడానికి కృత యుగంలో  ధ్యానం  తపస్సులు, త్రేతా యుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరంలో పూజా పరిచర్యలు, కలిలో హరినామ సంకీర్తనములైనట్లే,  శిష్టులను ఉద్దరించి దుష్టులను ఉత్తరించుటకు కృత ,  త్రేత,  ద్వాపర  యుగాలలో  ఆ  జగన్నాథుడు అవతారములు  ధరించాడు,  మరి కలియుగం మాటేమిటి ?*


*కలియుగంలో  దుష్టశిక్షణ,  శిష్టరక్షణ కోసం  నేను  రాను గాక  రానని  ఆ  దేవదేవుడు  తెగేసి  చెప్పటమే  గాక , తాను చేయాల్సిన పనిని ప్రకృతియే తన వికల్ప ములచే పూర్తి చేస్తుందని సెలవిచ్చాడు. *✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: