29, ఆగస్టు 2023, మంగళవారం

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? అలా మార్చుకునేటప్పుడు ఎలాంటి విధి, విధానాలు ఆచరించాలి?*



యజ్ఞోపవీతము మార్చుకోవాల్సిన సందర్భాలు ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. అందరికీ తెలిసినట్లుగా జాతాశౌచం, మృతాశౌచం తీరిన  తరువాత మార్చుకోవాలి. గ్రహణ మోక్షం తరువాత మార్చుకోవాలని కూడా చాలా మంది చెబుతారు. యజ్ఞోపవీతము జీర్ణమయితే మార్చుకోవాలి. శవ స్పర్శ చేస్తే మార్చుకోవాలి. శవ వాహకులుగా ఉన్నవారూ మార్చుకోవాలి , మోయక పోయాయినా స్మశాన సందర్శనం చేస్తే కూడా మార్చుకోవలసి ఉంటుంది. యజ్ఞోపవీతమునకు అశుద్ధ మయిన పదార్థములు తగిలితే ( చీము,రక్తము వగైరా ) మార్చుకోవలసి ఉంటుంది. ఏ అశుచీ లేకపోయినా 3 నెలలకు మార్చుకోవాలని కొంతమంది పెద్దలు, 6 నెలలకు ఒకసారి సరిపోతుందని కొంత మంది పెద్దలూ చెబుతారు. శ్రాద్ధ కార్య క్రమాలకు ముందు, శుభ కార్యాలకు ముందు ( పెళ్ళి మొ.) మార్చుకుంటారు. ఇక శ్రావణ పౌర్ణమికి అందరికీ తెలిసిందే. ఋగ్వేద సంప్రదాయులు వినాయక చవితికి మార్చుకుంటారు.

బాగా సంప్రదాయ వాదులు అయితే మల మూత్ర విసర్జన సమయంలో యజ్ఞోపవీతమును నీవీతి చేసి, కుడి చెవికి చుట్టుకోకపోతే మార్చుకుంటారు. క్షుర కర్మ చేసుకున్నప్పుడు కూడా మార్చు కుంటారు. తగల కూడని వారిని తాకితే కూడా మార్చుకుంటారు.

ఇక యజ్ఞోపవీతము మార్చేటప్పుడు విధి విధానాలు అంటే జాతా, మృతా అశౌచం తీరిన తరువాత స్నానానంతరం శుభ్రమైన మడి వస్త్రాలను ధరించాలి. ధోవతి కచ్చపోసి ధరించాలి. మా పెద్దలు బ్రహ్మచారులు కచ్చ పోసి కట్టనవసరము లేదని చెప్పారు. పుండ్ర/భస్మ ధారణ తరువాత వారి వారి మతానుసారముగా యజ్ఞోపవీత ధారణ విధిని అనుసరించి నూతన యజ్ఞోపవీతాలను ధరించి, పాతవి త్యజించాలి. సంప్రదాయం పాటించే వారి ఇండ్లలో 'ఎలా మార్చుకోవాలి' అన్నది వ్రాయబడిన పుస్తకాలు ఉంటాయి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత యజ్ఞోపవీతమును శిరస్సు పై ఉండే తీసివేయాలి. దానిని ఎవ్వరూ త్రొక్కని చోట వేయాలి. కొంతమంది విసర్జించిన యజ్ఞోపవీతములను 'తాడు' లాగా వాడడం నేను చూసాను. ఇది బాధాకరం. సంకల్పం, మంత్రం చెప్పకుండా ఈ కార్యక్రమము చేయరాదు. యజ్ఞోపవీతము చాలా పవిత్రమైనది. దర్భ పవిత్రం ధరించే చేయాలి. ఆచమనము చేసేప్పుడు పవిత్రం కుడి చెవికి పెట్టు కోవాలి. కొంత మంది బంగారు అంగుళీయకము వేసుకుని ఉంటారు. చాలా మంది పెద్దలననుసరించి ఇది కూడా ఆమోదయోగ్యమే.

కామెంట్‌లు లేవు: