20, సెప్టెంబర్ 2023, బుధవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 27*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

 *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 27*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా*

         *గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |*

         *ప్రణామ స్సంవేశ స్సుఖమఖిల మాత్మార్పణ దృశా*

         *సపర్యా పర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ||*


అమ్మవారి ఉపాసన అంటే ఏమిటో ప్రతిపాదిస్తున్నారు ఈ శ్లోకంలో. 


జపో జల్పః = జల్పం అంటే వాగుడు. వాగుడు అనే మాట వాక్కు నుండి వచ్చినదే. అమ్మా  నా వాగుడంతా నీ జపమే.


సకలమపి ముద్రావిరచనా = నా ప్రతి చేష్టా, ప్రతి చేతి కదలికా, నీకు ముద్రయే.

 ప్రతి దేవతా జపం చేసే ముందు చేతులతో ముద్రలు చేస్తారు.*ముదం రాతీతి ముద్రా* అని. ప్రతి ముద్రకీ వుండే దేవత సంతోషిస్తుంది ఆ యా ముద్రలు చేస్తే. అమ్మవారి నామాల్లో *దశముద్రా సమారాధ్యా* ఒకటి.


గతిః ప్రాదక్షిణ్య క్రమణ = నా ప్రతి అడుగు, నడక నీకు ప్రదక్షిణ క్రమమే.


అశనాద్యాహుతి విధిః = నేను తినే ఆహారమంతా నీకు ఆహుతులే.


ప్రణామః సంవేశః = నేను పడుకుంటే నీకు సాష్టాంగ ప్రణామమే.


సుఖమఖిలం సపర్యా పర్యాయః = నేను అనుభవించే ప్రతి సుఖము నీకు సపర్యయే.

ఇవన్నీ అందరూ చేస్తారు. ఇవి జప,ముద్రలు ఎప్పుడు అవుతాయి?


ఆత్మార్పణ దృశా = ఆత్మార్పణ దృష్టితో చేసినప్పుడు. సర్వదా అమ్మను స్మరిస్తూ తన కర్మలన్నీ ఆమెకు సమర్పించినప్పుడు. ఇదే ఆధ్యాత్మిక సాధన. 


గొప్ప విషయం ఏమిటంటే ప్రతిదీ అమ్మకోసమే అనుకున్నవాడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతాడు. *మాతృకా వర్ణ రూపిణీ* అనుకొని.అంటే ప్రతి అక్షరం అమ్మ రూపమే అనుకొని

తినే ప్రతి ప్రదార్థమూ శుద్ధమైనదిగా భగవంతునికి నివేదన చేసి, తాను తింటాడు.తనలోని పరమాత్మకు ఆహుతి ఇస్తున్న భావనతో. అతడు నడిస్తే అమ్మకు ప్రదక్షిణం చేస్తున్నానని భావిస్తాడు. పడుకొని అమ్మకు సాష్టాంగ ప్రణామంగా భావిస్తాడు.


భగవాన్ రమణులు అనేవారట రాత్రి పడుకునేటప్పుడు అమ్మను ధ్యానించు. ఉదయం లేస్తూనే మళ్ళీ ధ్యానించు. మధ్య నిద్రా సమయమంతా సమాధి స్థితియే. స్వప్నములు నీ ప్రమేయం లేకుండా వస్తాయి కనుక నీ సమాధికి భంగం కాదు. సాధనంతా మెలకువ దశలోనే అని.


ఆదిశంకరులు తమ శివ మానస పూజా స్తోత్రం లో చెప్పారు.


*ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం*

*పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |*

*సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో*

*యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్*


నా ఆత్మవు నీవే శంకరా  నా బుద్ధి గిరిజా దేవి

 నా ప్రాణములు, ఇంద్రియములు నీ సేవకులు. నా శరీరము నీ గృహము.

 నా ప్రాపంచిక భోగానుభవములన్నీ నీకు పూజయే. నా నిద్ర సమాధి స్థితి.నా అడుగులన్నీ నీ ప్రదక్షిణ క్రమం లోనివి. నా వాక్కులన్నీ నీకు స్తోత్రములు. నేను చేసే ప్రతి కర్మ నీ ఆరాధనే ప్రభూ!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: