20, సెప్టెంబర్ 2023, బుధవారం

ఋషి పంచమి*

 *భాద్రపద శుక్ల పంచమి ఋషి పంచమి*


లోక పూజ్యులు , సమాజ సృష్టికర్తలైన

అత్రి,  కశ్యప, భరద్వాజ, గౌతమ, 

వశిష్ట, జమదగ్ని,విశ్వామిత్ర  మహర్షులను

ఈ భాద్రపద శుద్ధ పంచమి రోజున

ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలి.


కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః!

వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!


( 1 ) 

కశ్యప మహర్షి:

సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి.

మరీచి, కళ దేవీల పుత్రుడు.

దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని,

వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. 

వారి ద్వారానే దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, 

మానేయులు, యక్షులు, , వృక్ష లతా త్పణ జాతులు,

రాక్షసులు , సింహ, మృగ, సర్పాలను, పక్షులను,

గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు,

కాలకేయులను, పౌలోములను,

పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే 

బ్రహ్మర్షిని పుత్రులుగా పొందారు .

( 2 ) 

అత్రి మహర్షి :

సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి  

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు.

అతని భార్య అనసూయ దేవి .

అత్రి తన తపోబలంతో

త్రిమూర్తులను పోలిన  సోమ, దూర్వాస,

దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.

అత్రి భార్య అనసూయదేవి .

మహా పతివ్రతా శిరోమణి.

బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల సంతానమే 

దత్తాత్రేయ స్వామివారు.

( 3 ) 

భరద్వాజ మహర్షి :

భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు.

తల్లి పేరు మమతా దేవి .

బృహస్పతి కృప వలన జన్మించి,

ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది,

ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

శ్రీ మహావిష్ణువునకు త్రేతాయుగంలో

శ్రీరామునికి , సీతాదేవికి , లక్ష్మణ స్వామివార్లకు 

తన ఆశ్రమంనందు ఆశ్రయమిచ్చి 

చిత్రకూట పర్వతాలకు 

దారి చూపించి సహాయం చేసిన ఋషి.

( 4 ) 

విశ్వామిత్ర మహర్షి :

విశ్వామిత్రుడు రాజర్షి.

త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని,

హరిశ్చంద్రునిచే అసత్యమాడించే ప్రయత్నం చేసి 

మరి కొంత ఫలాన్ని కోల్పోయి ,

మేనక వల్ల తపోవిఘ్నం పొంది

శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు.

దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భరతుడు. 

వీరి వల్లనే మన దేశానికి భరత ఖండమని , 

భారతదేశమని నామకరణానికి ఆదిగా నిలిచాడు.

( 5 ) 

గౌతమ మహర్షి :

ఈయనే ప్రప్రథమ వ్యవసాయ సృష్టికర్త.

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు వేలాదిమంది ఋషులకు , మునుల కుటుంబాలకు 

గౌతముడు తన ఆశ్రమం నందు 

భోజన వసతి కల్పించిన 

ప్రప్రథమ అన్నదాత .

ఇతని లోక క్షేమ సేవలను చూసి ,

ఇతర ఋషుల ఈర్ష్యను పెంచుకొని

ఓ మాయా గోవును సృష్టించి ,

అతని వ్యవసాయ క్షేత్రంలో వదలగా ,

ఆ మాయా గోవును దర్భతో అదిలించగా , 

మాయా గోవు మరణించడంతో బ్రహ్మహత్యా పాతకం

అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు 

గోదావరి నదిని భూమిపైకి తెచ్చిన మహర్షి .

తన భార్యను శిలగా మారేటట్లు శాపమివ్వగా 

శ్రీరాముని పాద స్పర్శతో శాప విమోచనం పొందిన

అహల్యా దేవి ఈయన ధర్మపత్నియే.

( 6 ) 

వశిష్ఠ మహర్షి :

ఇతని భార్య అరుంధతి దేవి.

నూతన వధూవరులకు వివాహం అనంతరం 

ఆకాశన నక్షత్ర మండలంలో

చూపించేది ఈ అరుంధతీదేవినే.

వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు.

భృగు మహర్షికి తోబుట్టువు.

వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు.

శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు.

దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు,

ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు,శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

( 7 ) 

జమదగ్ని మహర్షి :

భృగు మహర్షికి ముని మనుమడు.

రుచిక ముని, సత్యవతుల కుమారుడు.

జమదగ్ని కుమారుడే శ్రీ మహావిష్ణువు అవతారమైన

పరశురాముడు. ఈయనే భార్గవ రాముడు.

జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన 

అన్య పురుష వ్యామోహం వలన, 

ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు.

ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు 

ఆమెను పునర్జీవితురాలిని చేశాడు . 

క్షీర సాగర మధనంలో శ్రీ మహాలక్ష్మీతో పాటుగా జన్మించిన కామధేనువు జమదగ్ని మహర్షి ఆశ్రమంలోనే పోషింపబడింది.


సప్తర్షులు మహా తపః తేజస్సు గలవారు.

లోక కళ్యాణ కారకులు.

హైందవ ధర్మాలను , జీవన విధి విధానాలను ,

నాగరికతను సమాజానికి నేర్పించిన 

లోక కళ్యాణ కారకులైన సప్త సద్గురువులు.

ఈ సప్తఋషులను భక్తితో స్మరిస్తూ ,

పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని

శాస్త్రాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు లేవు: