16, సెప్టెంబర్ 2023, శనివారం

ప్రకృతి పరవశం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

       🌷 *శు భో ద యం 🌷* 


  *బాల గోపాలుని మురళీగానం* 

         ----------------------------------

             *ప్రకృతి పరవశం!* 


ఉ: కానల నుండుచున్ సరస గాన వివేక విహీన జాతలై

వీనుల నేఁడు కృష్ణముఖ వేణు రవామృత ధారసోకినన్

మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్

మానిని ! చూడవమ్మ! బహుమానము చేసె, కృతార్ధ చిత్తలై ;


భాగ 8స్కం థం 785 ప:


బాలగోపాలుడు వేణువునూదుతుంటే ఆనాద మాధుర్యానికి ప్రకృతి యెంత పులకించి పోయిందో కిన్నర మిధునం దర్శిస్తూ  దానిని వర్ణిస్తున్నారు.

అసలు సంగీతమంటే యేమోతెలియని మృగాలు (అడవిలోజంతువులు) చేష్ఠలుడిగి తన్మయంగా చిత్రీకృత దృశ్యాలవలె నిలబడి పరవశంతో వింటున్నాయట!


మరోచిత్రం!


ఉ: తల్లుల చన్నుఁ బ్రాలు మును ద్రావు తరిన్ ,దమ కర్ణవీధులన్ 

వల్లభమైన మాధవుని వంశ రవామృత ధార చొచ్చినన్ 

ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక, కృష్ణుమీఁద దృ

గ్వల్లులు చేర్చి , నిల్చె నదె వత్సము లంగనలార!గంటిరే?


దూడలు తల్లి పొదుగు లోముట్టె దూర్చి పాలుతాగ బోతున్నాయి. ఇంతలో నల్లనయ్య మురళీరవం చెవిని సోకింది. అంతే అవి పాలుచేపేందుకు చేసేప్రయత్నం మాని యిటునటు త్రుళ్ళక మొగమును కృష్ణుని వయిపు తిప్పి వేణు రవాన్ని వింటానికి ఉత్సాహం చూపుతున్నాయట! యెంత ప్రకృతి విరుధ్ధం!


మరోవిచిత్రం!


మ: మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ

త్కమలాగ్రంబున కృష్ణునిల్పి మురళీ గానామృత శ్రేణి క

ర్ణములన్ గ్రోలుచు మేఁత మాని గళితానందా శ్రులై చిత్రితో

పమ లై గోవులు చూచు చున్న వదిగో పద్మాక్షి ! వీక్షించి తే?


ఎంతో ప్రేమతో మోరలు పైకిలేపి హృదయకమలంలో కృష్ణుని దివ్యమంగళ విగ్రహం నెలకొలిపి మురళీగానామృతమును చెవులతో పానం చేస్తూ మేతమాని ఆనందాశ్రువులు కన్నులనుండి జాలువారగా చిత్రితోపమంగా నిలచి పోయి కృష్ణుని చూచు చున్నాయట!


మరో విచిత్రం!


మ: జగతీ జంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత స్యందముల్ 

మిగుల్ వీనులఁ ద్రావి , వ్రేగుపడు నెమ్మిం గృష్ణరూపంబు చి

త్తగమై యుండగ నడ్డబెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ

ఖగముల్ సొక్కెడిఁ జూచితే మునిజనాకారంబులన్ గామినీ!!


పక్షులుగూడా పరవశములై తమలోనున్న కృష్ణుని రూపం బయటకు రాకుండా తలుపులు మూసినాయా?అనే రీతిగా కన్నులు మూసి మునులవలె మురళీగానాన్ని ఆశ్వాదిస్తున్నాయట!


నదులు సరోవరాలు తమ తరంగ హస్తాలతో పద్మములను దెచ్చి కృష్ణునకు పాదార్ఛనలు గావించేరీతిగా ఉన్నాయట! ఇదీ మురళీ గాన ప్రభావంతో అక్కడి చరాచర ప్రకృతి పరవశం!


" శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ! "- అన్నారు విజ్ఙులు!


కృష్ణుని మురళీ గానంలో నాదం ఉన్నది. అది సామ వేదం .విశ్వ ప్రేమవాదం .అదే కారణం ప్రకృతి మురిసిపోయి

మూగనోము పట్టటానికి. ఆఅదృష్టం అలనాడు నంద గోకులానికి దక్కింది. మన హృదయాలు కూడా పరిశుధ్ధమై ప్రేమ పూరితములై త్యాగ మయములై "ఆనందంతో నిండిన గోకులంగా (గోశబ్దానికి యింద్రియాలు అనే అర్ధంకూడా ఉంది)మారినప్పుడు ఆమురళీ గానం మనకు గూడా వినిపిస్తుందేమో? ప్రయత్నిద్దాం!

*సేకరణ:-  శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

🙏🙏👌👌💐🌷💐💐💐🌷🌷💐🌷💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: