13, సెప్టెంబర్ 2023, బుధవారం

తెలుగు వ్యాకరణము*

 *తెలుగు వ్యాకరణము*


*సులభ భాషలో తెలుగు వ్యాకరణం-* 

〰〰〰〰〰〰〰

*6. పరుషాలూ సరళాలూ స్థిరాలూ అని హల్లులు మూడు రకాలు*

☛☛☛☛☛☛☛☛☛☛☛

*[పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 4, సూత్రం‌ - 6, సూత్రం - 7 ]*

☛☛☛☛☛☛☛☛☛☛☛

• క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు

హల్లులలో  క చ ట త ప లని పరుషాలు అంటారు.

హల్లులలో గ జ డ ద బ లని సరళాలు అంటారు.

• కచటతపః పరుషాఖ్యాః గజడదబాస్తు సరళాః అని ఆంధ్రశబ్ద చింతామణి.

కచటతపలను ఉఛ్ఛరించటంలోనూ గజడదబలను ఉఛ్ఛరించటంలోనూ ఉన్న శబ్దమార్దవ బేధాన్ని అనుసరించి వీటిని పరుషాలూ సరళాలూ అని వర్గీకరించారు.

*చకారం జకారం అనేవి తాలవ్యమూ దంతవ్యమూ అని రెండురకాలుగా ఉన్నాయి. ఆ విషయం ముందు ముందు ఏడవ సూత్రంలో తెలుసుకుందాం.* *ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే* తాలవ్యదంతవ్య బేధం అనేది ఈ వర్గీకరణకు సంబంధించి లెక్కలోకి రాదు అని.

ఇతరములగు హల్లులు స్థిరములు

పరుషాలూ సరళాలూ పోను మిగిలిన హల్లులన్నింటికీ స్థిరములు అని పేరు.

సూరి గారు వాటిని స్పష్టంగా లిష్టు వేసి మరీ ఇచ్చారు.*

ఖ ఘ ఙ , ఛ ఝ ఞ, ఠ ఢ ణ,  థ ధ న, ఫ భ మ,  య ర ల వ శ ష స హ ళ

*ఇప్పుడు మనం పరుషాలూ,  సరళాలూ,  స్థిరాలూ పట్టికలలో చూదాం.* (రంగులు గుర్తుపట్తటంలో సౌలభ్యం కోసం)

క ఖ గ ఘ ఙ 

చ/ౘ ఛ జ/ౙ ఝ ఞ

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ


*య ర ల వ శ ష స హ ళ*


*ఇలా మొత్తం 36 హల్లుల్లో 5+1 పరుషాలు, 5+1 సరళాలూ ఉందగా మిగిలిన 24 హల్లులూ  స్థిరాలు.*


*దంత్య తాలవ్యంబు లయిన చజలు సవర్ణంబులు*


*దంత్యమైనా తాలవ్యమైనా చకారం పరుమే.  దంత్యమైనా తాలవ్యమైనా జకారం సరళమే.*


*సూరిగారు ఇలా విశదీకరించారు.*


*తాలవ్యచకారంబు దంత్యచకారంబునకును దాలవ్య జకారంబు దంత్యజకారంబునకును గ్రాహకంబులు*


*ముందు తాలవ్య దంతవ్యాలు చకార జకారాలు చూదాం*


తాలవ్యం         దంతవ్యం

చ                 ౘ

జ                ౙ


*తాలువు అంటే దవడ లోపలి భాగం. చ జ లనే‌వర్ణాలను ఉత్పత్తి చేసే స్థానం తాలువు అవుతున్నది కాబట్టి చ జ లను  తాలవ్యములు అన్నారు.*


*దంతము అంటే తెలిసిందే. ౘ ౙ లను పలకటానికి నాలుకను దంతాలకు ఆనించి వర్ణోత్పత్తి చేస్తాము కాబట్టి వీటిని దంతవ్యములు అన్నారు.*


*ఐతే ఈ నాలుగు వర్ణాలకు నాభ్యంతరమైన శబ్దోత్పత్తిప్రయత్నం సమానం కాబట్టి వ్యాకరణం ఇవి సవర్ణములు అంది. తుల్యాస్య ప్రయత్నమ్‌ సవర్ణం అని పాణిని వ్యాకరణం.*


*సూరిగారు ఈ‌ సూత్రంలో తాలవ్య దంతవ్యాలు పరస్పరం గ్రాహకములు అన్నారు కదా? అంటే ఏమిటీ అన్న ప్రశ్న ఉంది.  వ్యాక్రరణం చ కు ఏమి సూత్రాలను విధిస్తున్నదో అవన్నీ ౘ కూ సమానంగా వర్తిస్తాయనీ అలాగే జ కు ఏ వ్యాకరణ సూత్రాలు వర్తిస్తాయో అవన్నీ సమానంగా ౙ కు కూడా వర్తిస్తాయనీ అర్థం.*


*ఇక్కడ తాలవ్యములు, దంతవ్యములు అన్న విభాగాన్ని బాగా గుర్తుంచుకోండి*

కామెంట్‌లు లేవు: