4, అక్టోబర్ 2023, బుధవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-65🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-65🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తిరుమల అనగా శ్రేష్టమైనకొండ అని అర్ధము. ద్రావిడ భాషయందు శ్రీవైష్ణవ సిద్ధాంతములో తిరు అనునది. శ్రేష్ఠ వాచకము. మలై అను శబ్దమునకు పర్వతమనియర్ధము.


 ఈ పర్వతము తూర్పుకొండలలో నిది. 2500 అడుగులు యెత్తున్నది. తిరుమల అనెడి పేరుకంటె తిరుపతికొండనియు, తిరు మలైయనియు విశేషముగ వాడబడును

(ఈకొండకు కృతయుగములో వృషభాచలమనియు త్రేతాయుగములో సంజనాచలమనియు ద్వాపరయుగములో శేషాచలమనియు కలియుగములో వేంకటాచలమనియు పేర్లుగలవు.


"కలౌవేంకటనాయక:" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము. వడవానై (ఉత్తరదిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము. "వడక్కుత్తిరుమలై" యని (వడ తిరువేంగడం) "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు" అని సాంప్రదాయక తిరునామములు గలవు. 


ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము ఉంది.

 

అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.


అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.

స్వయం వ్యక్త క్షేత్రములు

 

1. శ్రీరంగము శ్రీరంగనాదులు

2. శ్రీముష్ణము భూవరహ పెరుమాళ్

3. తిరుమలై తిరువేంగడముడై యాన్

4. తిరునీర్మలై శ్రీరంగనాధన్(నీర్వణ్ణన్)

5. నైమిశారణ్యం దేవరాజన్(వనరూపి)

6. పుష్కరమ్ పరమపురుషన్(తీర్దరూపి)

7. బదరికాశ్రమం తిరునారణన్

8. సాలగ్రామం శ్రీమూర్తి


*ఆళ్వార్ల కీర్తనలలో తిరుమల*


తొలుత దేశభాషయైన తమిళభాషలో తిరుమలేశుని కీర్తించి ఆతని మహిమను లోకమున చాటిచెప్పినవారు ఆళ్వార్లు.


 "వడతిరు వేజ్గడమ్; తిరుమలై" అని వారు ఈ పర్వతరాజమును కీర్తించారు. 


ఇచటి స్వామిని "తిరువేంగడత్తాన్; తిరువేంగడముడైయాన్; అలర్మేల్ మంగై యుఱై మార్పన్"అని ప్రస్తుతించారు.


భగవన్తుడు వేంచేసియుండు దివ్యదేశముల కన్నింటికి "తిరుప్పది" అనియే పేరు "పది" అనగా స్థానము అని అర్దము.


 108 తిరుప్పదులు ఆళ్వార్లచే కీర్తింపబడినవి. అవి అన్నియు తిరుప్పదులే. కానీ కాలక్రమంలో "తిరుప్పది" అనుపేరు. ఈక్షేత్రమునకు మాత్రమే వాచకంగా రూడమైనది. "తిరుప్పది"యే తిరుపతిగా మారినది. 


"తిరుమాల్ అనగా శ్రియ:పతి. ఆయనకు నిత్యనివాసస్థానమైన తిరుమలై తమిళదేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా "తొల్కాప్పియం" అను ప్రాచీన తమిళ గ్రంథమున పేర్కొనబడింది.


ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఈ శ్రీనివాసుని పాదారవిందముల యందే "అలర్మేల్ మంగై యుఱైమార్పా....పుగలొ న్ఱిల్లా నడియేన్ ఉన్నడి క్కీళ అమర్న్దు పుకున్దేనే" అంటూ పిరాట్టిని (లక్ష్మీదేవిని) పురుషాకారంగా చేసికొని శరణాగతి చేసారు. మఱియు "అలర్మేల్ మంగై యుఱైమార్పా" అని ప్రస్తుతించి లక్ష్మీ పతిత్వమును ప్రకటించారు.


మరియు "ఒళవిల్ కాలమెల్లామ్" అను దశకమున సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును ఈస్వామి తిరువడి ఘుళ్ళలో (శ్రీపాదములయందు) కైంకర్యము చేయుటచే పరమ పురుషార్థమని ప్రవచించారు. అంతేకాక ఈ దశకములోనే "ఎజ్గళ్పాశంవైత్త" అను చోట స్వామియొక్క వాత్సల్యగుణమును ప్రకాశింపచేసారు.


శ్రీగోదాదేవి తమ నాచ్చియార్ తిరుమొళిలో "విణ్ణీలమేలాప్పు" అను దశకమున ఈస్వామివార్కి మేఘములద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇట్లే ప్రథమ దశకములో "వేంగడవఱ్కెన్నై విదిక్కిత్తియే" అంటూ "మన్మథా! నన్ను వేజ్కటాచలపతితో కలసపూ" అని ప్రాదేయ పడతారు.


ఈస్వామిమ్రోల "వడియాయ్ కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే" కడపరాయిగా పడియుండి స్వామి దివ్యాధరమును సర్వదా సేవించు చుందును గాక! అని శ్రీకులశేఖరాళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమొళిలోని ఊనేఱశెల్వత్తు అను దశకములో ప్రార్థిస్తారు.


 కావుననే ఇచట గర్భ గృహద్వారమున గల గడపకు "కులశేఖరపడి" అని పేరు. 


"మన్దిపాయ్ వడవేంగడమామలై;వానవర్ శన్దిశెయ్య నిన్ఱాన్" అంటూ తిరుప్పాణి ఆళ్వార్ జ్ఞానులు అజ్ఞానులు అనుభేదం లేక ఊర్ధ్వలోక వాసులు భూలోకవాసులు సేవించునట్లు దయార్ద్రహృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసియున్నాడు అని అభివర్ణించిరి.


తిరుమంగై ఆళ్వార్లును "తిరువేంగడ ముడై నెంజమే" ఓ మనస్సా ! తిరువేంగడమును ఆశ్రయింపుమని భావించి; "నాయేన్ వన్దడైన్దేన్ నల్గియాళైన్నై క్కొణ్డరుళే" అంతట సంచరించి అన్నిబాధలను అనుభవించి అగతికుడనై నిహీన జంతువువలె నీసన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించితిని. ఆదరముతో నన్ను అనుగ్రహింపుము అని దీనంగా ప్రార్దిస్తారు. (పెరియతిరుమొళి)

"నమ్మాళ్వార్ ఈక్షేత్రమును "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు (భూలోక వాసులకును పరమపద వాసులకును సమానుడు)" అని అబివర్ణించియున్నారు. 


(కణ్ణావా నెన్ఱుమ్ మణ్ణోర్ విణ్ణోర్కు" తి.వా.మొ 1-8-3) తిరుమంగై యాళ్వార్ "వడవానై" (ఉత్తర దిశాదిగ్గజము తిరునెడున్దాణ్డగమ్ 10) అనిస్తోత్రము చేసియున్నారు. మరియు ఈక్షేత్రమునకు "వడక్కుత్తిరుమలై" యని సంప్రదాయక తిరునామము. 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: