19, అక్టోబర్ 2023, గురువారం

కనుమరుగైన 'కన్యాశుల్కం' తిట్లు'*

 *కనుమరుగైన 'కన్యాశుల్కం' తిట్లు'*

*--- ప్రకాష్.*

~~~~~~~~~~~~~~~~~


*“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! 'సప్తవెధవ' అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ అలా వరులను ఏడుసార్లు మార్చుకోవచ్చు. ఏడోసారి కూడా స్త్రీ అతణ్ణి వరించకపోతే అతణ్ణి 'సప్తవెధవ' అంటారు. ( రాంభట్ల కృష్ణమూర్తి 'వేల్పుల కథ)

 

*" నీ ఇంట కోడిని కాల్చా"* అంటాడు అగ్నిహోత్రవదాన్లు. 'మీ ఇంట పీనుగెళ్ళా! అనే తిట్టు లాంటిదే ఇది. పూర్వం కొన్ని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కోడిని శవం చుట్టూ ముమ్మారు తిప్పి ఆ తరువాత కాల్చేవారు. అనంతరం దాని ఆ ఇంటి చాకలి తీసుకుపోయేవాడు.


*"నా సొమ్మంతా 'ఘటాశ్రాద్ధపు' వెధవల పాలవుతుంది”* అని లుబ్దావధాన్లు, *“రేపు ఇంటికి వెళుతూనే 'ఘటాశ్రాద్ధం' పెట్టేస్తాను”* అనిఅగ్నిహోత్రావధాన్లు వేరువేరు సందర్భాల్లో తిడ

తారు. ఘటం అంటే కుండ. శ్రాద్ధం అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసే దానం మొ॥ కార్యాలు. శ్రాద్ధకర్మలుమొత్తం 10 .అవి ఏకోద్దిష్ట , నిత్య, దర్శ, మహాలయ, సపిండి లేక సపిండీకరణ, తీర్థ, నాందీ, హిరణ్య, ఆమ, ఘట. చివరిదైన ఘటశ్రాద్ధం గురించి“పతితుడైనవాడుప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోగా, అతనిజ్ఞాతులు బతికి ఉండగానే అతనికి ప్రేతకార్యం జరిపి, ఒక కుండను నీటితో నింపి, దాసితో దానిని తన్నించి నీటిని ఒలకపోయించడం అనే అపరకర్మ. 'ఘటనినయం' అనితెలుగుఅకాడమీ వివరించింది.

 

*“దండుముండా'* అని తిడతాడు రామప్పంతులు పూటకూళ్ళమ్మని, 'దండు' అంటే 'సమూహం' అని అర్ధం. దండుముండ అంటే 'బజారుముండ' అని అర్ధం చెప్పాయి కొన్ని నిఘంటువులు.


 మధురవాణి  *“ఏం నంగనాచివే!”* అంటుంది ఆడపిల్లవేషంలో ఉన్న కరటకశాస్త్రి శిష్యుడితో. 'నంగనాచి' అంటే సామర్థ్యంఉండి కూడా ఏమీ తెలియనట్టు ఉండటం' అనికొన్ని నిఘంటువుల్లో ఉంది. కానీ “అందరితోనూ ప్రేమకలాపాలు సాగించే పడుచు" అని తెలుగుఅకాడమీ నిఘంటువుసూచిస్తోంది. అసలు ఇది హిందీ నుంచివచ్చిందని పరిశోధకులఅభిప్రాయం. 'నంగా' అంటే 'నగ్నం' అనీ, 'నాచ్‌' అంటేనృత్యంఅనీ అర్ధాలు ఉన్నాయి. సిగ్గు విడిచి నగ్నంగా నృత్యం చేయడంసాహసమే కాబట్టి 'సిగ్గు విడిచినది' అని చెప్పే సందర్భంలో ఈతిట్టు వాడుకలోకి వచ్చి ఉంటుందనిసురవరం ప్రతాపరెడ్డిగారు 'శబ్దాల ముచ్చట' అనే వ్యాసంలో వివరించారు.


*'ధగిడీకె'* అనికరటకశాస్త్రి నోట వెలువడిన తిట్టు ఉర్దూపదం. గోదావరి జిల్లాలో 'గయ్యాళి' అనితిట్టడానికి ఈ మాట వాడేవారు. నీచస్త్రీ, దుష్టుడు అని ఈ మాటకు అర్ధం. సి.పి.బ్రౌన్‌ కాలంనాటికి కూడా ఈ పదం వాడుకలో ఉందేమో! jade, slut,wretch అనే ఇంగ్లిష్‌ అర్థాలు ఇచ్చాడు తన నిఘంటువులో. కానీఈనాడెక్కడా ఈ పదం వాడుకలో వినిపించదు.


*“భష్టాకారిముండా!"* అని తిడతాడు లుబ్ధావధాన్లు తన కూతుర్ని (మీనాక్షిని). ఈ మాటకు రెండర్థాలున్నాయి. “భష్టాకారి' అనేది భ్రష్టఅనే రూపం నుంచి వచ్చింది. భ్రష్టుడు=వెలివేయబడ్డవాడు అనిఅర్థం. ఈస్కమ్మునిటెడ్ అన్నాడు బ్రౌన్ . హిందీలో భ్రష్ట అంటే పతిత అనే అర్ధం ఉంది. 


వితంతువుని పెళ్ళాడానేమో అని ఆందోళన చెందుతున్న లుబ్ధావధాన్లుతో *“ఎందుకీ తంబళ అనుమానం?”* అంటుంది మీనాక్షి. సురవరం ప్రతాపరెడ్డిగారు  తంబల జాతివారు పూర్వం గ్రామాలలో తమలపాకులనిచ్చే వృత్తిలో ఉండేవారని అన్నారు. సి.పి.బ్రౌన్‌ “బ్రాహ్మణ స్త్రీ యందు బ్రాహ్మణునికి దొంగతనంచేత పుట్టి, ఆగమాలు చదివి శివార్చన చేసే ద్విజుడు” అన్నారు.(Aman of mixed caste, descended from a female brahmi, by adultery with a man ofthe same tribe. A brahmin who officiates in the temple of Sova) “తంబళ అనుమానం” అనేది జాతీయం.


*“అభాజనుడా!”* అని తిడతాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుని. ఈ తిట్టు ఇపుడెక్కడా వాడుకలో వినిపించదు. అయోగ్యుడు. అసమర్ధుడు అని ఈ మాటకి అర్ధం jade, slut, wretch అనే ఇంగ్లిష్ అర్ధాలిచ్చాడు బ్రౌన్.


“ఇలాంటి *'చాడీకోర్‌'* కబుర్లు చెప్పడానికి యవడికి గుండెఉంది” అంటాడుగిరీశం రామప్పంతులుతో. “చారీఖోర్‌" అనేఉర్దూ పదం దీనికి మూలం. salanderer, a tale bearer, కొండెగాడు, చాడీ కత్తె  a busybody, a girl that tells talesఅని వివరించాడు బ్రౌన్‌.


 “మధురవాణి *'సిగ్గోసిరి'* దాన్ని వదిలేస్తాను” అంటాడు రామప్పంతులు. వీళ్ళమ్మా *'శిఖాతరగా'* అంటాడు అగ్నిహోత్రావధాన్లు. ఈ రెండు తిట్లూ ఒకటే. నాటకంలో చాలా సందర్భాల్లో వస్తాయి. “దీని సిగతరగా' అనేది ఈనాటి వ్యవహార రూపం. సిగ్గోసిరి (సిగ+కోసిరి) అన్నా, శిఖ తరగడం అన్నా, సిగతరగా అన్నా శిరోముండనం అనే అర్ధం. అంటే భర్తచనిపోయినపుడ పూర్వకాలం కొన్ని కుటుంబాలలో స్త్రీలకిజరిగేతంతు. ఎదుటి స్త్రీ మీద కోపం వచ్చినపుడు వాడే శాపనార్థంవంటి తిట్టు. కొన్నిసందర్భాలలో ఊతపదంగా కూడా కనిపిస్తుంది.


 “వాడు (గుంటూరుశాస్త్రి) *'పంచాళీ మనిషి'* అనడానికి సందేహం ఏమిటి? అంటాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుతో. “పంచాళీ అంటేవదరుబోతు, వాచాలుడు, గయ్యాళి అనే

అర్ధాలున్నాయి. ప్రస్తుతం వాడుకలోవినిపించని తిట్టు ఇది.


“ఈ రామప్పంతులు కథ ' *పైన పటారం లోన లొటారం'* లా కనిపిస్తుంది” అంటుంది స్వగతంగా మధురవాణి. ‘పటారం'అసలు రూపం 'పటీరం'. చందనంఅని దీనికి అర్ధం. 'లొటారం'అంటే రంధ్రం, బిలం అనే అర్థాలున్నాయి. పైపై మెరుగులేతప్పలోపల శూన్యం అనే అర్ధంలో దీన్నిసామెతలా వాడుతుంటారు. 


 ఇలాకన్యాశుల్కం

నాటకంలోని పదాలు వివరించుకుంటూ పోతే పెద్ద గ్రంధం అవుతుంది.  *_(ఈ రోజు గురజాడ జయంతి)_*

కామెంట్‌లు లేవు: