21, అక్టోబర్ 2023, శనివారం

ఆలోచనాలోచనాలు

 ఃంఃం ఆలోచనాలోచనాలు ఃంఃం.                               -----💐నవ్వుల పువ్వులు 💐-----                                  ***** వీలైనప్పుడెల్లా నవ్వండి. నవ్వు అనేది దాదాపు ఉచితంగానే దొరికే అద్భుతమైన ఔషధం. మన ముఖంపై నవ్వులు పుయ్యని రోజు, ఒక వ్యర్థమైన రోజని గుర్తుంచుకోండి.                      ***** మనం దిగాలుగా ఉంటే , జీవితం మనల్ని చూచి నవ్వుతుంది. మనం కేరింతలు కొడుతుంటే జీవితం మనల్ని చూసి మురిసిపోతుంది. కానీ మనం ఇతరులను ఆనందపరచినప్పుడు , జీవితం మనకు చేతులెత్తి నమస్కరిస్తుంది.                    ***** మనం ఏడిస్తే ఈ లోకం నవ్వుతుంది. మనం నవ్వితే లోకం మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అయినా మనం ఈ లోకంలోనే బ్రతకాలి కాబట్టి, మనకు ఈ లోకంతో బ్రతికినన్నాళ్ళు పనే ఉంటుంది.                        ***** యోగి వేమన వంటి మహనీయులు లోకాన్ని పట్టించుకోకుండా తమ పనులను తాము చక్కదిద్దుకొని ప్రక్కకు తప్పుకొన్నారు. మనం ఆ స్థాయిలో ఉంటే లోకంతో మనకు పని ఉండదు.           ***** నా బాధ, మరొకరి నవ్వుకు కారణం కావచ్చు కానీ, నా నవ్వు మరొకరిబాధకు కారణం కాకూడదు అంటారు , ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్.                         ***** అద్దం నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే నేనెప్పుడు ఏడుస్తున్నా అది మాత్రం నన్ను చూచి నవ్వదు.                                      ***** నవ్వడానికి ముఖంలోని 16 కండరాలను మాత్రమే శ్రమ పెట్టాలి. అదే ముఖం చిట్లించడానికి ముఖంలోని 72 కండరాలు శ్రమపడాలి. ఏది సౌకర్యవంతమో మీరే ఆలోచించుకొని, ఆచరణలోకి తీసుకరండి.       ***** రాత్రింబవళ్ళు విపరీతమైన వత్తిడితో సతమతమయ్యే నేను రోజు మొత్తం లో కొంత సేపైనా హాయిగా నవ్వకుండావుండివుంటే, ఎప్పుడో చనిపోయివుండేవాడిని.--- అబ్రహాం లింకన్.                    ***** అసహజమైన నవ్వు నకిలీ నాణెం వంటిది. చలామణి లో ఉన్న ఈ నకిలీ నాణేన్ని ఎవరోఒకరు గుర్తించి " సర్కులేషన్" నుండి తొలగిస్తారు.               ***** ఈ భూమిపై హాయిగా నవ్వగలిగిన ఏకైక జీవి , మనిషి మాత్రమే! జన్మించనివారు , జన్మించి,కొంతకాలం జీవించి మరణించినవారు మాత్రమే నవ్వలేరు. మనం హాయిగా, కడుపుబ్బా నవ్వలేకపోతున్నాం అంటే కారణం కనుగొనాలి!                ***** సంపదకు, లాభానికి, శుభానికి, సర్వశ్రేయస్సుకు ప్రధానం సంతోషమే సుమా! ఈ లోకంలో దుఃఖింపని వాడే గొప్పవాడు సుమా!                ***** నవ్వడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక రోగం. పదిమందిని నవ్వించడం ఒక యోగం.              ***** చివరగా నోట్లో బంగారు దంతాలు ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి బాహాటంగా నవ్వకండి. దొంగలు ఎవరైనా పండ్లూడగొట్టి మరీ దోచుకోగలరు. జాగ్రత్త!                                    -------------------------------------------------                               అర్థబేధము గల పదములు.                           1* పరువము = వయస్సు.      పారువము = పావురము.      2* పండితమాన్యుడు = గొప్పవాడు;  పండితంమన్యుడు = శుంఠ  3* ప్రణామము = నమస్కారము ; ప్రమాణము = ఆదర్శము.     4* ప్రపత్తి = భక్తిని చూపుట.; ప్రతిపత్తి = ప్రగౌరవము                             5* ప్రమదము = సంతోషము ; ప్రమాదము = ఏమరుపాటు                     6* ప్రదానము = గొప్ప ఈవి; ప్రధానము = ముఖ్యము.                          7* పిట్ట = పక్షి ; పెట్ట = ఆడుపక్షి.                               8* బోయ = కిరాతుడు.         బోయి = పల్లకి మోసేవాడు.                           9* మద్యము = సుర ( పానీయము) మధ్యము = నడుమ                             10* వారిది = సేతువు;          వారిధి = సముద్రము              తేది 21--10--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: