23, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


పంచేంద్రియాలకూ అధిష్టానం మనస్సయితే, దాని కదలికలకు కారణం ఈ గుణత్రయం.

కారణగుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదుగదా! మాయాపరికల్పితాలైన ఈ

గుణాలు భిన్నభిన్న స్వభావాలకు కారణాలు. శాంతుడు ఘోరుడు మూఢుడు- వీటితోనే ఏర్పడుతున్నారు.

ప్రతి మానవుడూ ఎప్పుడూ ఈ గుణత్రయంతో కలిసే ఉంటాడు. వీటికి అతీతుడుగానీ వీటిని

వివర్జించినవాడుగానీ ఎవడూ లేడు. ఉండడు. ఉండలేడు. దారాలులేకుండా వస్త్రం ఉంటుందా ?

ముట్టిలేకుండా కుండ ఉంటుందా ?

తత్సమేతః పుమాన్నిత్యం తద్విహీనః కథం భవేత్ |

న భవత్యేవ సంసారే రహితస్తంతుభిః పటః ॥

తథా గుణైస్త్రిభిర్హీనో న దేహీతి నిశ్చయః ।

దేవదేవో మనుష్యో వా తిర్యశ్చో వా నరాధిప ॥

గుణైర్విరహితో న స్యాత్ మృద్విహీనో ఘటో యథా

బ్రహ్మా విష్ణుస్తథా రుద్రస్త్రయశ్చామి గుణాశ్రయాః ॥ (31-34, 35, 36)

త్రిమూర్తులుకూడా మనలాగా ఒక్కొక్కప్పుడు ప్రీతి, మరొకప్పుడు కోపం, ఒకప్పుడు సంతోషం

ఇంకొకప్పుడు దుఃఖం ఇలా ప్రకటిస్తూనే ఉంటారు. అనుభవిస్తూనే ఉంటారు. సత్వగుణం ఆవరించినప్పుడు

బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటాడు. సర్వభూతప్రియుడు అవుతాడు. రజోగుణం

ఆవరించినప్పుడు ఘోరరూపుడు అవుతాడు. అంతటా అప్రీతి ప్రకటిస్తాడు. తమోగుణం ఆవరించినప్పుడు

మూఢుడై విషాదం పొందుతాడు. హరిహరులూ ఇంతే. యుగయుగాలలో సూర్యచంద్రవంశాలలో

జన్మించిన మనుప్రభృతులు మొదలుకొని సకలమానవులూ ఇలాగే గుణత్రయాధీనులై స్పందిస్తూ

ఉంటారు. ప్రవర్తిస్తూ ఉంటారు. అంచేత మాయాధీనం జగత్సర్వమ్ అనేది తిరుగులేని సత్యం.

అయితే ఆ మహామాయ సంవిద్రూపమైన పరతత్వంలో లీనమై ఉంటుంది. ఆ పరతత్త్వమే

మాయను ప్రేరేపించి జీవులను ఆడింపజేస్తుంది. మాయావిశిష్టాంతమైన ఆ సంవిత్తుమాత్రమే పరమేశ్వరి.

మాయేశ్వరి. భగవతి. సచ్చిదానంద స్వరూపిణి. ధ్యానించినవారికీ ఆరాధించినవారికీ నమస్కరించినవారికీ

జపించినవారికీ ఆ తల్లి దయతలిస్తే మోక్షం ఇస్తుంది. సుఖదుఃఖరూప సంసారబంధనాలనుంచి విముక్తి

కలిగిస్తుంది. ఆమెపట్ల మనస్సును సంలగ్నం చేసినవాడికి ఈ సాంసారిక బంధనాలూ భయాలూ ఏమీ

ఉండవు. అందుచేత మాయను జయించాలంటే మాయేశ్వరినే ఉపాసించాలి. మరొక దిక్కులేదు. మరొక

మార్గంలేదు. చీకటిని పారద్రోలాలంటే సూర్యచంద్రాదులే సమర్థులు. మాయను జయించాలంటే

స్వయంప్రకాశమానురాలూ సంవిద్రూపిణి అయిన మాయేశ్వరీమాతనే ఉపాసించాలి

జనమేజయా! నువ్వు అడిగినదల్లా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు.

ఇక్కడికిది ఈ పురాణంలో పూర్వార్థం. ఇది శ్రీమాతృరహస్యం. భక్తితో పఠించినవారికీ విన్నవారికీ

అఖిలైశ్వర్యాలూ పుష్కలంగా సిద్ధిస్తాయి. పారాయణ చేసినవారు జ్ఞానులై తరిస్తారు. దీన్ని బహూకరించిన

వారికి దేవీయజ్ఞమహాఫలం లభిస్తుంది.

(అధ్యాయం - 31, శ్లోకాలు-600)

షష్ఠ స్కంధం - శ్లోకాలు 1884 - తెలుగుసేత: బేతవోలు రామబ్రహ్మం

కామెంట్‌లు లేవు: