23, నవంబర్ 2023, గురువారం

నాయనార్ల చరిత్ర - 07*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 07*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *7. ఎరిబత్త నాయనారు*


కరువూరు నగరంలో ఎరిబత్తనాయనారు అనే భక్తుడు శివభక్తులకు

సదా సేవ చేయడమే జీవితాశయంగా కలిగి జీవనం సాగిస్తూ వచ్చాడు.


కరువూరులోని ఆనిలై దేవాలయంలో వెలసిన పరమేశ్వరుని మీది

అచంచల భక్తిప్రపత్తులను కలిగిన శివగామి యాండార్ అనే మునీశ్వరుడు

రోజూ ఉదయాత్పూర్వమేలేని పుష్పాలను సేకరించి వాటిని మాలలుగా

కట్టి స్వామికి అలంకరించి ఆనందిస్తూ ఉండేవాడు.

ఒకరోజు శివగామి యాండార్ పూలను కోసుకొని వస్తుండగా

రాజుగారి పట్టపుటేనుగు కపోలంలో మదజలం స్రవిస్తుండగా వీధిలో

నున్నవారు భయకంపితులై పరుగులు పెట్టగా పెద్దకొండవలె భీకరంగా వచ్చింది. 


ఆ ఏనుగు మావటీ వారికి లొంగక తనముందు వెళ్తున్న శివగామి యాండార్ను వెన్నంటి వెళ్లి ఆయన స్వామి కోసం తీసుకువెళ్తున్న

పూలబుట్టను తొండంతో లాగి కింద పడవేసింది. శివగామి యాండార్

కిందపడి చేతులతో నేలను మోదుతూ “పరమేశ్వరా! నీ కోసం తీసుకువస్తున్న

ఈ పుష్పాలు నేల పాలయ్యాయి కదా! నేనేం చేయగలను?” 


అని గట్టిగా ఈ విధంగా శివగామి యాండార్ రోదిస్తుండగా ఎరిబత్తనాయనారు

దానిని విన్నాడు. "శివభక్తులకు ఏనుగు కారణంగా ఎంతటి కష్టం సంభవించింది. ఎవరువచ్చి అడ్డగించినప్పటికీ నేను దానిని నరికి సంహరిస్తాను” అని భీకరంగా గర్జిస్తూ ఎరిబత్తనాయనారు గండ్రగొడ్డలి

చేత ధరించి వేగంగా వెళ్లి ఆ ఏనుగు పైకి లంఘించాడు. 


పొడవైన దాని

తొండం నేలమీద పడేలా దానిని రెండుగా నరికాడు. ఆ ఏనుగు నల్లని

పర్వతం వలె నేలమీద వాలిపోయింది. ఏనుగు మీదున్న మావటీ వారు

వెన్నంటి వస్తున్న సైనికులు తనను ఎదుర్కోగా ఎరిబత్త నాయనారు వారిని

కూడ సంహరించాడు. 


మిగిలిన సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి ఈ సంగతిని విన్నవించారు. రాజుగారు చతురంగ బలాలను

సమీకరించుకొని ఏనుగు చనిపోయిపడి వున్న ప్రదేశానికి చేరుకున్నారు.

అక్కడ గండ్రగొడ్డలిని ధరించి తన ముందు నిలబడి ఉన్న శివభక్తుడైన

ఎరిబత్త నాయనారును చూశాడు. 


పరమేశ్వరుని భక్తుడైన ఇతడు ఈ ఏనుగును ఏ తప్పూ లేకుండా చంపి ఉండడు" అని మనసులో భావించి

సైనికులందరినీ అక్కడే ఉండమని చెప్పి తాను ఒంటరిగా ఎరిబత్త

నాయనారు దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. చోళ చక్రవర్తిని చూసి శివభక్తుడైన

ఎరిబత్త నాయనారు “చోళ రాజా! శివగామి యాండార్ అనే భక్తుడు

పరమేశ్వరునికి సమర్పించడానికి తీసుకువెళ్తున్న పుష్పహారాలను ఈ ఏనుగు

లాగి కింద పడవేయడం వలన నేను దానిని నేలమీద కూలేలా

ఖండించివేశాను. 


ఏనుగు ఈ విధంగా తప్పుచేస్తుండగా మావటీవారు,

కావలివారు దానిని నివారించని కారణంచే చంపబడ్డారు. ఇదే ఇక్కడ

జరిగిన విషయం" అని చెప్పాడు. "శివభక్తులకు ఈ ఏనుగు చేసిన

అపకారానికి ఇక్కడ మావటీ వారిని చేర్చి ఏనుగును చంపడంతో సరిపోదు.


 ఈ దుండగం జరగడానికి కారణమైన నన్ను కూడ చంపాలి" అంటూ

రాజు తన నడుముకు వేలాడుతున్న కరవాలాన్ని చేతితో పెకలించి దానిని

ఎరిబత్త నాయనారు చేతికి ఇచ్చాడు. ప్రేమైకమూర్తి అయిన ఈ రాజుగారిని

కూడా దుండగీడు అని నేను భావించాను. 


నా శరీరాన్ని కత్తితో

పొడుచుకోవడమే ఈ దుష్కార్యానికి పరిహారమవుతుంది" అని భావించి

ఎరిబత్త నాయనారు రాజుగారు ఇచ్చిన ఖడ్గంతో తన కంఠాన్ని

ఉత్తరించుకోబోయాడు. ఆ సమయంలో ఆకాశంలో అందరికీ వినిపించేలా

ఒక పెద్ద శబ్దం వినిపించింది. 


"మీ భక్తిని ప్రపంచానికి తెలియజేయడానికై

పరమేశ్వరుని వలన ఈ సంఘటన జరిగింది" అనే మాటలు వినిపించాయి.

చనిపోయిన మావటివారితో, సైనికులతో సహా ఏనుగు కూడ నిద్రనుండి

లేచినట్లు అప్పుడే పైకి లేచింది. దేవతలు ఇరువురిమీద చల్లని పుష్పాలను కురిపించారు. 


ఈ అద్భుతాన్ని చూసి ఆనందించిన శివగామి యాండార్

అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

ఎరిబత్త నాయనారు సదాచార వర్తనుడై జీవనం సాగించి ఆఖరున పవిత్రమైన కైలాస పర్వతంలో శివ గణాలకు నాయకుడయ్యే భాగ్యాన్ని పొందాడు.

      *ఏడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: