23, నవంబర్ 2023, గురువారం

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 84*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 84*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా*

*మమాప్యేతౌ మాత శ్శిరసి దయ యా ధేహి చరణౌ |*

*యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ*

*యయో ర్లాక్షాలక్ష్మీ      రరుణహరిచూడామణిరుచిః ‖*

*శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా*


 అని లలితా సహస్ర నామములలో ఒకటి. ఇందులో వేదములను స్త్రీమూర్తులుగా చెప్పారు. ఈ ముత్తయిదువులు అమ్మవారి పాదపద్మములకు నమస్కరించినప్పుడు ఆమె యెర్రని నఖములకు కల సింధూర వర్ణము వారి పాపిటకు అంటినదట. అనగా వేదములు ఎల్లప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూ  ఆరాధిస్తున్నాయని భావము. వేదములనే ముత్తయిదువుకు శిరస్సు ఉపనిషత్తు వేదాంతము. ఉపనిషత్తులు అమ్మవారిని ఆశ్రయించి పరతత్త్వాన్ని పొందాయట . అందుచేత అమ్మ పాదములను చేరవలెనంటే ఉపనిషత్ విజ్ఞానం ఎంతైనా అవసరం.


ఇప్పుడు శంకరులు ఈ సౌందర్యలహరి శ్లోకములో త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఎలా సేవిస్తున్నారో చెప్తున్నారు, పైన చెప్పబడిన నామమునకు అన్వయిస్తూ.


శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా = వేదములనే యువతులు బయలుదేరి అమ్మవారి పాదములను శిరసుపై ధరించారట . అమ్మవారి పాదములు ఉపనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ తత్త్వం. వేదముల శీర్షములు ఉపనిషత్తులు కదా! వేదములు బ్రహ్మ ప్రోక్తములు. ఆ విధముగా ఆయన అమ్మవారికి నమస్కరిస్తున్నాడు.


యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ = మరి ఆ పాదముల పాద్యము ఏది? పరమేశ్వరుని జటాజూటములోని గంగా జలము. ఆమెకు నమస్కరించటానికి శివుడు కొద్దిగా వంగినప్పుడు ఆ గంగాజలం ఆమె పాదములను కడిగింది. 

పరమాచార్య స్వామి వారు చమత్కరించారు. శివునికీ పార్వతీదేవికి ప్రణయకలహము కలిగినపుడు ఆయన కొద్దిగా వంగి జటాజూటములోని గంగాజలంతో ఆమె పాదములను తడిపి ఆమెను ఉపశమింపజేసాడు అని.


యయో ర్లాక్షాలక్ష్మీ            రరుణహరిచూడామణి రుచిః = మరి పారాణి శోభ ఏమిటి? (లాక్షా లక్ష్మీ) నారాయణుడు అమ్మవారి పాదాలపై శిరసునుంచినప్పుడు ఆయన కిరీటంలోని చూడామణి కాంతి అమ్మవారి పారాణిగా ప్రకాశిస్తున్నదని. ఈ విధంగా త్రిమూర్తులు అమ్మవారి పాదములను ఆశ్రయించుకొని సృష్టి స్థితి లయ నిర్వహణను చేస్తున్నారు.


మమాప్యేతౌ మాత శ్శిరసి దయయా ధేహి చరణౌ = అట్టి మహిమాన్వితమైన నీ పాదములను దయయుంచి నా శిరస్సు పైన కూడా ఉంచు తల్లీ అంటున్నారు ఆచార్యులవారు.


అమ్మవారి పాదములు సహస్రారం పైన ఉంటే శరీరమంతా శక్తిపాతం జరిగి అమృతమయమవుతుంది. అలాగే ఉపనిషత్ జ్ఞానాన్ని సముపార్జిస్తే పరబ్రహ్మ తత్త్వం యెరిగి పరమాత్మలో లీనమవుతాడు జీవుడు. సద్గురువులు, బ్రహ్మజ్ఞానోపదేశమునకు అర్హుడైన శిష్యునికి, అతడి శిరసుపై పాదం ఉంచి దీక్షనిస్తారు. అందువల్ల శిష్యుని సహస్రార పద్మము ద్వారా గురువు యొక్క జ్ఞానామృత ధార ప్రసరిస్తుంది.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: