1, నవంబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


.

పరమధర్మజ్ఞుడైన శర్యాతి ఈ మాటలకు కుమిలిపోయాడు. దారుణంగా విలపించాడు.

గత్యంతరం లేదన్నట్టు నారచీరలు తెప్పించి అందించాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకు

అద్దుకుంది. వొంటిమీది నగలన్నీ తీసేసింది. వాలుజడ ముడిచుట్టింది. నారచీరలు ధరించింది.

పట్టుపుట్టాలూ రత్నాభరణాలూ తండ్రికి అందించింది. శర్యాతి ముఖం పాలిపోయింది. నోటమాట

రాలేదు. అడుగుముందుకి కదలలేదు. శిలాప్రతిమలా అలా నిలబడిపోయాడు.

అంతఃపురకాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయవిదారకంగా విలపించారు. ఓదార్చేందుకు

ఎవరూ ధైర్యం చెయ్యలేకపోయారు. విలపించి విలపించి అలిసిపోయిన రాజునూ రాజకాంతలనూ కడకు

మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకుని గుండె చిక్కబట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు.

రాజపుత్రిని ఒక మునిరాజుకు సమర్పించి బరువెక్కిన గుండెలతో మెల్లగా రాజధానికి చేరుకున్నారు.

(అధ్యాయం-3, శ్లోకాలు- 640)


సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలయ్యింది. ధర్మతత్పరురాలై అగ్నులను అర్చిస్తోంది.

కందమూల ఫలాలను ఏరితెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడినీళ్ళతో స్నానం చేయించి,

వల్కలాలు ధరింపజేసి శుభ్రప్రదేశంలో ఆసనంపై కూర్చోబెట్టి, దర్భలూ కమండలూదకాలూ మొదలైన

పూజా సామగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలు చేయిస్తోంది. అడవిలో గాలించి నీవారధాన్యం

తెచ్చి ఎండబోసి, దంచి, చెరిగి, రుచిగా వండి పెడుతోంది. పక్వఫలాలను భుజింపజేస్తోంది. భోజనం

అయ్యాక ఆచమనానికి నీళ్ళు అందించి, కాళ్ళూ చేతులూ కడిగి, తాంబూలం అందించి, తీసుకువచ్చి

శుభ్రాస్తరణంమీద విశ్రమింపజేస్తోంది. వింజామర వీస్తోంది. అటుపైని పతి అనుమతి తీసుకుని తాను

వెళ్ళి శరీర సాధనంగా రెండు మెతుకులో రెండు ఫలాలో నోట్లోవేసుకుంటోంది. మళ్ళీ వచ్చి సన్నిధిలో

'కూర్చుని ఏమి ఆజ్ఞ నాథా! అని వినయంగా అడుగుతోంది. కాళ్ళు వొత్తనా, మంచినీళ్ళు కావాలా -

ఇత్యాదిగా అవసరాలు అడిగి తెలుసుకుంటోంది

కామెంట్‌లు లేవు: