11, నవంబర్ 2023, శనివారం

ఆలోచనాలోచనాలు

 00000 ఆలోచనాలోచనాలు 00000                               -----౦తప్పులతో తిప్పలు ౦-----                                  ***** మనిషి తన తప్పులను ఒప్పుకొనేంత గొప్పవాడై వుండాలి. వాటి నుండి లాభాన్ని పొందేంత తెలివైనవాడై వుండాలి. వాటిని సరిచేసుకొనేంత బలవంతుడై వుండాలి.          ***** నా గురువుల నుండి నేను ఎంతో నేర్చుకొన్నాను.                      నా పుస్తకాలనుండి నేను ఎంతో నేర్చుకొన్నాను.              మరీ ముఖ్యంగా నేను చేసిన తప్పులనుండి ఎంతో నేర్చుకొన్నాను.            అతిగా వాగేవారి నుండి మౌనంగా ఉండటంలోని ఆనందాన్ని నేర్చుకొన్నాను.     ఊరకే చిరాకుపడేవారి నుండి సహనాన్ని, శాంతంగా ఉండటాన్ని నేర్చుకొన్నాను.                      ***** పెన్సిల్ చివర ఎరేజర్ ఉండేది, తప్పులు కొనసాగించేవారికోసం కాదు ; తప్పులను సరిదిద్దుకొని సక్రమంగా ఉండాలని భావించేవారి కోసం.                                   ***** తప్పు చేయడం కాదు; దానిని వెంటనే దిద్దుకొని సరియైన మార్గంలో కొనసాగకపోవడమే పెద్ద తప్పు.చేసిన తప్పులనే తిరిగి మళ్ళీ చేసుకొంటూపోవడం తప్పున్నరతప్పు.                  ***** మేథావులు తప్పులు లేదా పొరబాట్లు చెయ్యరు. ఎందుకంటే వారు చేసిన తప్పులు లేదా పొరబాట్లు ద్వారా వారు "" మేథావులు"" గ పరిగణింపబడ్డారు కాబట్టి;    ***** ఇతరుల తప్పులనుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వారు పూర్తిగా తప్పులన్నీ చేసేవరకు మనం ఈ భువిలో సజీవంగా ఉండకపోవచ్చు గదా!            ***** మన తప్పుల గురించి ఇతరులు చిలవలు పలవులుగా వర్ణించి లోకానికి చెప్పేముందు, మనమే మన తప్పును సంపూర్ణంగా ఒప్పుకొంటే ,అది ఎంతోకొంత క్షమించబడుతుంది. ఎవరైతే తమ తప్పులను ధైర్యంగా అంగీకరిస్తారో వారి తప్పులు తగలబెట్టబడి బూడిదగా మారతాయి.                        ***** చేసిన తప్పులు తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలని భావించకపోవడం, తన తప్పు తనకు బాగా తెలిసిపోయినా, దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం, దానిని సరియైనదే అని సమర్థించడానికి అసత్యాలు, అన్యాయాలతో నిలబెట్టడానికి ప్రయత్నించడం; ఇవన్నీ తప్పులతో ఆకాశానికి నిచ్చెన వెయ్యడంలాంటిది. కేవలం వ్యర్థప్రయత్నం మాత్రమే!                              ***** తప్పలపై మహనీయుల మాటలను పరికిద్దాం.                           1* ఒక్క తప్పు చెయ్యని వ్యక్తిని మీరు నాకు చూపించగల్గితే, నేను ఒక్క పని కూడా చెయ్యని మనిషిని మీకు చూపగలను.--- హెచ్. ఎల్. వేలాండ్.                       2* వ్యక్తి తాను తప్పు చేశానని ఒప్పుకోవడానికి సిగ్గు పడకూడదు. తన తప్పును తాను ఒప్పుకోవడమంటే నిన్నటికన్నా నేడు మనం తెలివిగా ప్రవర్తించినట్లు లెక్క. --- పోప్.                      3* తప్పులెన్నువారు, తమ తప్పులెరుగరయ్యా! --- యోగి వేమన.                       4* మనం ఇతరులలో కేవలం తప్పులను ఎంచి, ప్రకటించడం మొదలుపెట్టామా? మనకు బంధువులు మిగలరు. మిత్రులూ మిగలరు. మిగిలేది మనం మాత్రమే!-- అవ్వయార్.        5* తాను తప్పులను చేస్తున్నానని అనుమానించేవాడు, ఎప్పుడూ ఒప్పులనే చేసుకొంటూపోతాడు.--- స్పెయిన్ దేశపు సామెత.      6* అయినా రెండు తప్పులను కలిపితే , ఒక ఒప్పు అవుతుందని మీకు ఎవరు చెప్పారండీ! --- ఇంగ్లీషు సామెత.                    7* ఒక మనిషి మంచిగా ఉండాలని దైవం భావిస్తే, ఆ మనిషి తప్పులు చెయ్యకుండా అతనికి అంతఃదృష్టినిస్తాడు. --- మహమ్మదీయ సామెత.       8* ఇతరుల తప్పులను గమనించడం బహు తేలిక. తన తప్పులను గమనించడమే బహుకష్టం.--- బుద్ధ భగవానుడు.                        9* తప్పులను వెదికే స్వభావం ఉన్నవాడు , స్వర్గం లో కూడా అదే పనిని కొనసాగిస్తాడు.--- ధోరో.                                    10* తప్పులదేముంది. ఎవరైనా చేస్తారు. మూర్ఖులు మాత్రమే వాటిని సరిదిద్దుకోకుండా కాలాన్ని గడిపేస్తారు. --- సిసిరో.                                  చివరగా వెయ్యి ఆవుల మంద మధ్యన ఒక గేదె నడుస్తున్నా, జనం దానిని "ఆవుల మంద" గానే పిలుస్తారు. కాబట్టి మన ఒప్పుల సంఖ్యను పెంచుకొంటూ, తప్పులను వీలయినంత తక్కువ స్థాయికి తీసుకవెళదాం. ఏమంటారు?                        తేది 11 --11--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: