11, నవంబర్ 2023, శనివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


శర్యాతి మహారాజు ఇలా మల్లగుల్లాలు పడుతున్నాడు. రాజదంపతులు రథం దిగకుండా

ఆశ్రమానికి అల్లంతదూరంలో ఉండిపోయారు. అంతలోకీ అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాలనుంచి

బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగుపరుగును

వచ్చింది. రండి, రండి. అక్కడే ఆగిపోయారేం? తండ్రీ! ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోలోపల

నలిగిపోతున్నట్టున్నారేమిటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంక ఇప్పుడు

వదిలిపోతుందిలెండి రండి. అడిగో నా భర్త. నమస్కరించండి.

మండిపోతున్న శర్యాతి - కూతురి మాటలకు అడ్డుతగిలాడు. ఏడీ చ్యవనుడు? వృద్ధుడూ

అంధుడూ అయిన తాపసి ఏడీ? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో

సందేహంగా ఉంది. దుష్టురాలా! మహర్షిని చంపేసి కామాంధురాలపై ఈ కొత్తమొగుడితో కులుకుతున్నావా?

కులవినాశినీ! ఎంత మహాపాపం చేశావు? కులటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాపసముద్రంలో

నేనేకాదు ఇక్ష్వాకు వంశమంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనపడుతున్నాడు. చ్యవమడి

అలికిడి ఎక్కడాలేదు.

సుకన్యాదేవి ఒక్కసారి పెద్దపెట్టున నవ్వేసింది. తల్లిదండ్రుల కుడిఎడమ చేతుల్ని తన ఎడమ

కుడిచేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమంలోపలికి నడిపించుకు వచ్చింది. నాన్నా! ఈయనే మీ

అల్లుడు. చ్యవనమహర్షి. అనుమానించవలసింది ఏమీలేదు. ఇది పచ్చి నిజం. అశ్వినీదేవతలు అనుగ్రహించి

వీరికి ఈ దివ్యరూపం ప్రసాదించారు. తండ్రీ! నేను నీ కూతుర్నికానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు?

బహుశ వీరి రూపం నిన్ను భ్రమ పెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చ్యవనమహర్షికి నమస్కరించు.

అడుగు. జరిగినదంతా వారే చెబుతారు అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది.

కామెంట్‌లు లేవు: