10, నవంబర్ 2023, శుక్రవారం

 ///// ఆలోచనాలోచనాలు ///// 


      ------౦ కష్టాలు- కడగండ్లు ౦-----                                  ***** కష్టం అనేది ఒక గులకరాయి వంటిది. దాన్ని కంటికి మరీ దగ్గరగా ఉంచుకొని చూస్తే మొత్తం ప్రపంచాన్నే ఆక్రమిస్తుంది. అందువలన మిగిలిన అన్నింటినీ పూర్తిగా కప్పివేస్తుంది. దానిని కంటికి సరైన దూరంలో ఉంచి చూస్తే దాని పరిమాణాన్ని అంచనా వెయ్యగలం. పూర్తిగా కాళ్ళ దగ్గర పడేసి గమనిస్తే , దానిని సులువుగా అధిగమించగలమనే ధైర్యం మనకు కలుగుతుంది.                       ***** కష్టాలు కూడా ఒకందుకు మంచివే! మన నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో మనకు ఆ సమయంలోనే మనకు తెలిసిపోతారు.                      ***** కష్టాలు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసి, చివరలో మనకు ఎంతోకొంత మేలు చేసిపోతాయి. వాటి ప్రభావం నుండి బయటపడ్డప్పుడు కానీ ఈ రహస్యం బోధపడదు , మన మనస్సుకు.                  ***** కష్టాన్ని ఎదుర్కోకుండా చేతగానివలె కూర్చుంటే అది భయంకరమైన "సింహం" లాగా తయారు అవుతుంది. తెగువచూపి, మొండి ధైర్యం తో ఎదుర్కొన్నావా దాని స్థాయి పొగరుమోతు" గుఱ్ఱం" గా దిగజారిపోతోంది. శక్తియుక్తులన్నీ కూడదీసుకొని ఆ కష్టాన్ని అధిగమించావా? ఓడిపోయిన కష్టం ఒక" గాడిద" స్తాయికి దిగజారుతుంది. దీని కోసమా, మనం ఇంత శ్రమపడింది, అని మన మనస్సుకు తోస్తుంది.             ***** అయినా మహనీయులు పడిన కష్టాలతో పోల్చుకొంటే మన కష్టాలు ఏపాటివి. ధర్మరాజు, నలచక్రవర్తి, శ్రీరాముడు వీరంతా కష్టాల కొలిమిలో కాగి దృఢచిత్తంతో విజయవంతంగా వెలువడ్డారు. వారి గాధలు మనకు కష్టాలలో ధైర్యాన్ని కలుగజేస్తాయి.                     ***** బంగారం పడే కష్టాలు ఇతర ఏ లోహం పడటం లేదు. అందువలననే " అపరంజి" కి అందరూ మోహపడతారు.                    ***** ఎలోపతి వైద్యంలో కొన్ని ద్రవరూప మందులపై "" Shake well before use"" అని ముద్రించబడి ఉంటుంది. భగవంతుడు కూడా చేసేపని అదే! మనం బాగా పరిణతిచెంది, పదిమందికి ఇంకా ఎక్కువ ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మనలను మనం భరించగలిగినంత కష్టాల్లో ముంచి, తేల్చి ఆపై మనకొక ఉన్నతిని కలుగజేస్తున్నాడు.                ***** మనకు వచ్చే కష్టాలన్నీ కరెంటు మీటరు వద్ద మనం ఏర్పరచుకొన్న ఫ్యూజ్ వైర్ లాంటివి. ఓల్టేజి అధికమైనప్పుడు " ఫ్యూజ్ వైర్" మాత్రమే కాలిపోయి ఇంట్లోని ఖరీదైన విద్యుత్ పరికరాలను కాపాడటం మనం గమనిస్తూనే ఉంటాం గదా!                        ***** దుఃఖం, సోమరితనం ఈ రెండూ పిల్లలు ఆటస్థలంలో ఆడుకొనే"" సీ-సా"" క్రీడాపరికరం వంటివి. ఒకటి క్రిందకు పోయినప్పుడు, మరొకటి పైకి లేస్తుంది. నిరంతరం పనిలో మునిగితేలేవారికి కష్టాల్లో ఏడవడానికి కూడా సమయం లభించదు.           ***** ఎన్నోకష్టాలను అధిగమించినవారికి ఒక రహస్యం అవగతమవుతుంది. అదేమిటయ్యా! అంటే " ఏ కష్టమూ శాశ్వతంగా మనల్నే అంటిపెట్టుకుని ఉండదని.""                          ***** మనం తమాషాగా ఇట్లా ఆలోచిద్దాం. మనం "" నరకలోకం"" లోనే ఉన్నామని కాసేపు భావిద్దాం. అక్కడే కూర్చొని, తీరుబడిగ రాగయుక్తంగా ఏడవటం అయితే చెయ్యం కదా! ఏదోవిధంగా ఆ "" నరకలోకాన్నుండి"" విముక్తి కై ప్రయత్నిస్తాంగదా! అదేదో ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే , రేపటి మన ఇబ్బందులకు ఈ అభ్యాసం ఎంతోకొంత ఉపయోగపడుతుంది కదా! ఆలోచించండి.           ***** యుద్ధానికి వెళ్ళే ప్రతి యోధుడు తన శరీర రక్షణకు గట్టి కవచాన్ని ధరిస్తాడు. మనం కూడా అంతే! వీలయినంతగా "" హాస్యరసాన్ని"" అలవర్చుకొంటే , ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా భావించి, ఆందోళన చెందకుండా నెమ్మదిగా కష్టాలనుండి బయటపడే మార్గాలను అన్వేషించగలం.                   * * * * * * * * * * * * * * * * * * * *                             Answers to sharpen your mind!                          1* Time  2* Racecar       3* Your breath 4* "B" is the daughter of "A".     ~~~~~~~~~~~~~~~~.                                       ***** అర్థబేధము గల పదములు *****                1* సమజము= పశువుల మంద.     సమాజము = మానవ సంఘము.               2* సమము = సమానము.   శమము = శాంతము.          3* సరము = దండ.           శరము = బాణము.              4* సర్వదా = ఎల్లప్పుడు.       సర్వధా = అన్ని విధములు.                            5* స్వరాజ్యము = స్వాతంత్య్రము.                   స్వారాజ్యము = స్వర్గము.     - - - - - - - - - - - - - - - - - - - - -                                          తెలుగు పొడుపుకథలు.      1* వృషభుడికి నూరు కళ్ళున్నాయి గాని చూడలేడు? ( జల్లెడ)           2* వీళ్ళెప్పుడూ విడిపోరు. స్నేహితులు మాత్రం కారు. ఎప్పుడూ కలవరు. శత్రువులు మాత్రం కారు. ఇంతకూ వీళ్ళెవరండీ బాబూ! ( రైలు పట్టాలు)        3* వాకిలివేసి ఇల్లు. తెల్లని సున్నం వేసి ఉంది. అద్దెకు దిగేవారే లేరు? ( కోడిగుడ్డు)                        4* విలువలేని కండ. విస్తుపోయే ముండ. నమ్మి ముందుకు సాగితే, మిగిలేది ఎండ? ( ఎండమావులు )                      5* విసనకర్ర కాడ వింతలు బుట్టె; కోటకొమ్మ కాడ కొమ్మలు బుట్టె; కొమ్మ కొమ్మకు కోటి బిడ్డలు బుట్టె? ( పసుపు చెట్టు )        తేది 10--11--2023, శుక్రవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: