28, డిసెంబర్ 2023, గురువారం

అనులోమ విలోమ చిత్రము !

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

                  🌷🌷🌷

శు  భో   ద   యం !!🙏


అనులోమ విలోమ చిత్రము !!


             కం:  " తా  వినువారికి  సరవిగ


                            భావనతో   నాను  నతి  విభావి  సుతేజా


                            దేవర   గౌరవ  మహిమన 


                           మా  వలసిన  కవిత  మరగి  మాకు నధీశా!" 


                  కళాపూర్ణోదయం--6  ఆ : 172 పద్యము-- పింగళి  సూరన.


                                ఈపద్యం  మొదటినుండి చదివితే  తెలుగు పద్యము.  చివరినుండి చదివిన సఁస్కృత  శ్లోకనము. అనులోమ విలోమమున  భాషాద్వయ  సమ్మేళనం. అదేచిత్ర కవిత! 


        తెలుగుపద్యమునకు అర్ధము:-  అతి విభావి సుతేజా--మిక్కిలి ప్రకాశించు పరాక్రమముగల; అధీశా!--ఓరాజా-;దేవర గౌరవ మహిమన-- ఏలిన వారి గొపిపతనములవననే ;(మహిమవలన)  మావలసినృకవిత-- మాకుప్రియమైనకవిత్వము; తాన్--అది; వినువారికిన్-- శ్రోతలకు; సరవిగన్--తగురీతిగా ; భావనతోన్--తలచినంతనే; మాకున్ మరగి--మాకుస్వాధీనమై; ఆనున్-- భాసిల్లును.;


           భావము:- రాజా! ఆశ్రయ దాతలైన  తమ మహిమాతి శయముచేతనే  శ్రోతల కానందమును గూర్చు యీకవిత మాకు వశవర్తినియై  మెఱుగారు చున్నది.


                                  ఈపద్యమును తుదినుండి చదివిన సంస్కృత శ్లోకమగును.


               శ్లో:   శాధీన  కుమా  గిరిసుత


                    వికనసి  లవమాన  మహిమ  వర  గౌరవ  దే


                   జాతే  సువిభా  వితి  నను


                    నాతో   నవ  భాగ   విరసకరి  నా  ను  వితా. 


              పదవిభాగము:-  శాధి ,ఇన ,కుమ్ , అగిరి ,మత , వికనసి , లవమాన , మహమ వర గౌరవదే ,జాతే , సు విభౌ , ఇతి ,నను , నా ,అతః నవ భాః ,గవి ,విరసకరి , వా, అనువితా;    


                అర్ధము:  ఇన--ఓరాజా!--  ఆగిరి-పర్వతములున్నంతవరకు ; కుమ్--భూమిని ; శాధి-- ఏలుము; మత--సర్వసమ్మతుడా;

వికనసి--మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నాడవు ; లవమాన;- లవుని వలెమానవంతుడవగు ;నను -ఓరాజా! ;మహిమ వరగౌరవ దే--గొప్పదనముచే  మిగుల గౌరవ మొసంగు ; సువిభౌ--నీవంటి ప్రభువు; ఇతి--ఈరీతి ;_ జాతే - ఉండగా ;నా-మనుజుడు (పండితుడు) 

అతః -ఇట్చిగౌరవమువలన : నవభా--నూతన వికాసము గలవాడై  ; రసకిరి-- నవ రసములను వెదజల్లు; గవి- భాషయందు ; అనువితా నా? --స్తుతింప బడకుండునా? 


              భావము:-  ఓరాజా! ధరలో గిరులున్నంత కాలము నీయిల నేలుము. శ్రీరామ కుమారుడైన లవుని వంటి ఘనుడా! గౌరవాదరములను జూపు  నీవంటి మహా ప్రభువును జూచినంతనే  సత్కవులు నూతనోత్సాహులై  పలుకుల రసములు గురియ

నిను వర్ణన సేయకుందురా?  నిను జూడగనే స్వాెభావికముగనే  కవితలు పొంగును.


                 నాటి ప్రబంధ కవులలో  సూరన  ప్రతిభావంతుడు. ఉత్పాద్య ప్రబంథమని  నాడు కళాపూర్ణోదయమును  పండితులీసడించినా, ఆగామి కాలమున దానిని ప్రస్తుతించనివారు లేరు. ఇట్టి చిత్ర విచిత్రములకది పుట్టినిల్లు.తెలుగున పద్యరూపమగు తొలి నవలగా  దానిని  నేడు సంభావించుచున్నారు. ఆమహాకవికి అంజలి ఘటించుచు--                                                స్వస్తి!

🙏🙏👌🌷🌷🌷🌷🌷👌👌👌

కామెంట్‌లు లేవు: