8, డిసెంబర్ 2023, శుక్రవారం

రైలు ప్రయాణంలో

 నేను రైలు ప్రయాణంలో 

ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర  ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.


దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు ఒక *కృష్ణుడిఫోటో* తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.

ఎలా తిరిగి ఇవ్వడం?

ఈ పర్స్ ఎవరిదండీ? అంటూ అడిగా, అక్కడ ఉన్నవాల్లలో అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.


ఇంతలో పక్కబెర్తులో కూర్చుని *భగవద్గీత* చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.

మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన. 

"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా!" అని అడిగాను.

అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.


బాబూ..!  అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.

కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.


నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.


ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.

వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.


నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.

కొడుకు నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు.


నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.

నా విచారానికి ఓదారుస్తాడు.

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.


*భగవద్గీత* చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప, శాశ్వతమైన పరమసత్యం 

ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ *బ్రహ్మవిద్యపై* శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో, కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు 

ఆ పెద్దాయన.


ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.

నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.

పక్క స్టేషనులో రైలు ఆగింది, నేను దిగవలసినది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటకు రాగానే ఎదురుగా గోడపై

*భగవద్గీత చదవండి,*

*శ్రీ కృష్ణుని నిజభావం తెలుసుకొనండి"*  అని వ్రాసి ఉన్న బోర్డు చూసి, దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.

సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి  బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరకు వచ్చి *"భగవద్గీత"* నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది ' క్షమించాలి అన్నాడు. 

ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి, ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే.,  భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

*భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు...* నిత్యం మనకు ఎన్ని పనులు వున్నా భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!

నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు


🙏జై శ్రీ కృష్ణ🙏జై శ్రీ కృష్ణ🙏


 🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹

కామెంట్‌లు లేవు: