6, డిసెంబర్ 2023, బుధవారం

 శుభోదయం🙏



కృతిపతి కాశీస్సులు!


            శా:  శ్రీవక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద ,విశ్వభరా


                   దేవిన్  దత్కమలా   సమీపమున  బ్రీతిన్  నిల్పినాడో యనం


                   గా ,వందారు  సనందనాది  నిజభక్తశ్రేణికిన్   దోచు   , రా


                  జీవాక్షుండుఁ   గృతార్ధుసేయు  శుభ దృష్టిన్  కృష్ణరాయాధిపున్. 


                   మనుచరిత్ర ప్రారంభ పద్యము-  అల్లసాని  పెద్దన  గారు!


                 అర్ధము:   శ్రీ-  లక్ష్మీదేవియొక్క; వక్షోజ  -స్తనముల యందలి;  కురంగ నాభము- కస్తూరి ; ఎదపై-  వక్షస్థలమందు;  చెన్నొందన్- ప్రకాశింపఁగా;  విశ్వంభరాదేవిన్ - భూదేవిని;  తత్- ఆ;  కమలాసమీపమున- లక్ష్మి సన్నిధానమునందు;  ప్రీతిన్- ప్రేమతో;

నిల్పినాడో  యనంగా- నిల్పెపెనాయని ;  వందారు- నమస్కరించు ;  సనందనాది- సనందనుడు మున్నగు; నిజభక్తశ్రేణికిన్- తన భక్త

సముదాయమునకు  తోచు- కనబడు;  రాజీవాక్షుండు- విష్ణువు;  శుభదృష్టన్- శుభములనొసగు చూపులతో; కృష్ణరాయాధిపున్-

శ్రీకృష్ణరాయ  సార్వభౌముని;  కృతార్ధు  సేయున్- కోరికలు దీర్చి గాపాడుగాక!


                   భావము: లక్ష్మీదేవి  వక్షోజములకు గల కస్తురి  విష్ణువక్షస్థలమునకు అంటగా  ,నమస్కరింప వచ్చిన  సనక సనందనాదిభక్తిలకు " శ్రీహరి  లక్ష్మిదేవితోబాటు  భూదేవిని గూడ తనహృదయమున  ధరించెనా? " యను భ్రమను కల్గించుచుండెను.

అట్టి శ్రీహరి కృష్ణరాయల కోరిక లీడేర్చి రక్షించుగాక.! యనిభావము.


              విశేషాంశములు: విష్ణువక్షాలయా"- అని కమలాదేవికి బిరుదు. శ్రీహరి వక్షస్థలమామెకు స్వంతము. అక్కడ మరెవ్వరికి తావులేదు. కానీ చూచు సనకాది భక్తులకు  భ్రమకలుగుచున్నది. యేమని?  లక్ష్మి ప్రక్కన  శ్రీదేవినిగూడ (శ్రీహరి) చేర్చెనేమోయని. సవతుల నొక్కచోటఁజేర్చుటా!అమ్మో!యెంతయాశ్చర్యము!దానికి కారణముగూడ కనిపించుచున్నది. లక్ష్మీదేవి తన స్తనమండలమున  కస్తూరీ ద్రవ్యము నలదుకొని  వచ్చినది. శ్రీహరి ప్రణయ పారవశ్యమున

కమలను కౌగిలింప  ఆకస్తురి యంతయు నతని  వక్షస్థలమున  కంటినది. కస్తురి  నల్లనిది. భూమియు నల్లనిదే  ఆకారణమున సనకాదుదులకు  అనుమానము  గలిగినది.ఆవిధముగా  యిరువురి  భార్యలను రంజింపజేయు సామర్ధ్యముగల హరి కృష్ణరాయల కాపాడుగాక !యనిపెద్దన యాశీర్వాదము..


                         దీని వెనుక  రాయల కథయు వ్యంగ్య రీతిని జోడించినాడు. రాయలకు  తిరుమలదేవి, చిన్నాదేవి యను నిరువురు

భార్యలు. నావిష్ణుః పృధివీపతిః - అన్నారుగనుక రాయలుగూడ విష్ణుతుల్యుడే! భార్యలును  శ్రీదేవి భూదేవులే.హరి భార్యలను ఏలినట్టు  గా నీవును దేవేరులను రంజింప జేయవలెననుట  యొకసందేశము. 


                   రాజ్యాధికారమునకు  మూలమైనవి భూమి ,ధనము , ఈరెంటిని  తనయధీనమున నుంచుకొన్నహరి ,ఆరెంటిని నీకొసంగి

రక్షించునుగాక! అనియాశీర్వాద ఫలితమును వెల్లడించుట. పర్యాయముగా ఆఇద్దరి ఇల్లాండ్ర మగడు ఈఇద్దరు ఇల్లాండ్ర మగనిని బ్రోచుగాత!

అని ఆశీస్సులు!!


                              మహా కవుల  కవితల లోని మతలబు  లిట్లుండును. 


                                              స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: