9, డిసెంబర్ 2023, శనివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


మనవల్లనే అతడికి వసిష్ఠశాపం తగిలింది. ఒకనాడు ఏ జంతువూ దొరకక వసిష్ఠుల వారి పాడి 

ఆవును సంహరించాడు సత్యవ్రతుడు. దానికి కోపించిన ఆ మహర్షి త్రిశంకుడివైపొమ్మనీ చండాలుడిగా

మారిపొమ్మనీ శపించాడు. ఇది తెలిసి నేనెంతగానో దుఃఖించాను. నన్నూ నా పిల్లల్ని పోషించడానికి

ఇతడు నానా అవస్థలూపడి శాపానికి గురిఅయ్యాడు అని లోలోపల నలిగిపోయాను. ప్రత్యుపకారం ఏమో

చెయ్యలేని అశక్తురాలిని. స్వామి! నువ్వు తపోబల సంపన్నుడవు. ఏదైనా ఉపాయం ఆలోచించు.

ఎలాగోలాగ అతడివి రక్షించు. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత ఋణవిముక్తి.

భామినీ ! ఊరడిల్లు. ఎన్ని కష్టాలు పడ్డావు ! ఇదంతా నేను లేకపోవడంవల్ల వచ్చింది. పోనీలే,

అయ్యిందేదో అయ్యింది. నువ్వన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను. నా తపోవిద్యాబలంతో

శాపవిమోచనం కలిగిస్తాను - అని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మపత్నిని ఓదార్చాడు.

ఏ ఉపకారం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆ మర్నాడే

అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు శ్వపచాకారంలో దీనవదనుడై ఎదురువచ్చి

సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. సాంత్వనవచనాలు పలికి

- రాజేంద్రా ! నాకోసం నువ్వు శాపానికి గురి అయ్యావు. ఏమి కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తాను

- అన్నాడు. త్రిశంకుడి కన్నుల్లో సన్నటి మెరుపు మిలమిలలాడింది.

కౌశికమహర్షీ ! ఒకానొక యజ్ఞం చేయించమని మా కులగురువు వసిష్ఠుడిని అభ్యర్థించి

భంగపడ్డాను. దయచేసి నువ్వు చేయించు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. నీ ఇష్టం. ఏ యజ్ఞం

చేయిస్తావో, ఎలా చేయిస్తావో, అవసరమైన సంబారాలన్నీ సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు

వసిష్ఠుడు కోపించి తిరస్కరించాడు. పోనీలే, చేయించగలిగిన మరొక పురోహితుణ్ణి వెతుక్కుంటాను

అనుమతించమన్నాను. దానికి అలిగి ఈ శ్వపచాకారం త్రిశంకుత్వం ప్రసాదించాడు. ఏమీ దాచకుండా

జరిగింది జరిగినట్టు నీకు విన్నవించాను. నా దుఃఖం తీర్చి కోరిక సాధ్యం చెయ్యగల సమర్థుడివి నువ్వే.

దయచూపించు. ఇదే నేను కోరుకునే వరం అని అభ్యర్థించాడు త్రిశంకుడు. శాపాన్ని మరల్చడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు.

కామెంట్‌లు లేవు: