27, జనవరి 2024, శనివారం

నవగ్రహా పురాణం🪐

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *146వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ మహిమ - 1*

     

*"హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ ! సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!"*


నిర్వికల్పానంద శుక్ర స్తుతి శ్లోకాన్ని పఠించి , శుక్రగ్రహ మహిమా కథనాన్ని ప్రారంభించాడు.


*"శుక్రుడు ప్రధానంగా ఐశ్వర్య , ఆనంద , సౌభాగ్య , వైభవ కారకుడు. ఆయన కారకత్వాలు ఇంకా ఉన్నాయి కానీ , ప్రస్తుతం వాటితో మనకు అవసరం లేదు. ఐశ్వర్య సౌభాగ్య వైభవాలు కోల్పోయి , తిరిగి పొందిన పురాణపురుషుని గాధను ఉదాహరణగా చెప్పుకుందాం. క్షీరసాగర మథన గాథ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ అమృత సాధన కార్యంలో ఇంద్రాది దేవతలకు చేయూత అందించి , అమృతంలో పాలుపంచుకోలేక బలి చక్రవర్తి భంగపడిన విషయం మనం విన్నాం. సాగరమధనం అనంతరం జరిగిన సురాసుర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బలిచక్రవర్తిని శుక్రాచారుడు మృతసంజీవనీ విద్యతో పునర్జీవితుణ్ణి చేశాడు. బలిచక్రవర్తి కృతజ్ఞతాభారంతో శుక్రాచార్యుడిని అనన్య సామాన్యమైన రీతిలో సేవించి , సంతోషపెట్టాడు."*


*“శిష్యుడి సేవకు ప్రసన్నుడైన శుక్రుడు ఆయన చేత విశ్వజిత్ యాగం చేయించాడు. యజ్ఞం విజయవంతంగా పరిసమాప్తమైంది. హోమాగ్నిలోంచి సువర్ణ వస్త్రాలు కప్పిన రథమూ , సూర్యరథాశ్వాలలాంటి జవనాశ్వాలూ , సింహపతాకమూ , దివ్యమైన ధనుస్సూ , రెండు అమ్ముల పొదులూ , కవచమూ వెలికివచ్చాయి. అగ్నిదేవుడు వాటిని బలిచక్రవర్తికి బహూకరించాడు. శుక్రాచార్యుడు శిష్యుడికి తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు. తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్యమాల ఇచ్చాడు. బలిచక్రవర్తి ఆనందంతో పొంగిపోయి , గురుదేవుడైన శుక్రాచార్యులకు ధన్యవాదాలు అర్పించాడు..."*


★★★★★★★★★★★★★★★★


యుద్ధానికి అవసరమైన దివ్య పరికరాలను పొందిన బలితో శుక్రుడు ఇలా అన్నాడు.


*"బలీ ! మనకు అమృతం లేకపోతే ఏం ? మా వద్ద మృతసంజీవనీ దివ్య విద్య ఉంది. నీ వద్ద దివ్య రథమూ , ధనుర్భాణాలూ , కవచమూ ఉన్నాయి. మేము బహూకరించిన ధవళ శంఖాన్ని పూరించు. అమరుల మీద సమరం ప్రకటించు !"*


బలిచక్రవర్తి శుక్రాచార్యుడి వైపు క్షణకాలం సందేహిస్తూ చూశాడు. *“గురుదేవా ! క్షీరసాగర తీరాన జరిగింది చూశాక , విజయ సాధన విషయంలో సందేహంగా ఉంది. దేవతలను జయించడానికి ఈ రథమూ , ధనుర్బాణాలూ చాలునంటారా ?”*


*"చాలవు !"*


*"తమ శుభదృష్టిని ప్రసరించి , 'విజయోస్తు' అనండి !”*


*"అది ఒక్కటే కూడా చాలదు. అశుభ దృష్టిని కూడా ప్రసరిస్తాను...”*


*"గురుదేవా ?"* బలి ఆశ్చర్యంగా అన్నాడు.


*“నీ మీదా , నీ అసురగణం మీదా కాదు నాయనా ! ఇంద్రుడి మీద ! మహేంద్రుడి మీద ప్రసరించే ఈ శుక్రుడి వక్రవీక్షణ బలిచక్రవర్తికి వెయ్యింతలు బలాన్ని ఇస్తుంది ! 'సమరానికి సాగు ! ఈ సారి నిశ్చయంగా జయం నీదే !"* శుక్రాచార్యుడు తీక్షణంగా చూస్తూ అన్నాడు.


★★★★★★★★★★★★★★★★★


ఇంద్ర సభ !


రంభా , ఊర్వశీ నాట్యం చేస్తున్నారు. దేవేంద్రుడు తన్మయత్వంతో చూస్తూ , ఆనందిస్తున్నాడు. అప్సరసల అందెలు లయబద్ధంగా శ్రవణ మనోహరంగా ధ్వనిస్తున్నాయి. దేవచారులు ఇద్దరు ఆందోళనతో సభలోకి పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ రాకను గమనించిన బృహస్పతి చెయ్యెత్తి ఊర్వశీ , రంభలను వారించాడు. మంజీరాల మనోహర నాదాలూ ఆగిపోయాయి.


*“సుర సామ్రాట్టుకు జయం ! ప్రభూ ! బలిచక్రవర్తి అఖండ సేనా వాహినితో అమరావతిని చుట్టుముట్టాడు !”* ఒక దేవచారుడు అన్నాడు.


*"నిజమా ?!”* ఇంద్రుడు ఆశ్చర్యంతో అరిచాడు.


*“నిజమే ప్రభూ ! కోట చుట్టూ రాక్షస సైన్యం మోహరించింది ! మార్గాలన్నింటినీ మూసి వేశారు !"* రెండవ చారుడు వణికే కంఠంతో విన్నవించాడు.


అసుర సైన్యం మ్రోగిస్తున్న అనేక శంఖాల భీకర ధ్వనులు దేవచారులు తెచ్చిన వార్త నిజమే అంటూ చాటుతున్నట్టు సభా భవనంలోకి దూసుకొస్తున్నాయి. ఇంద్రుడు ఆందోళనతో బృహస్పతి వైపు చూస్తూ , సభ చాలించి లేచాడు.


★★★★★★★★★★★★★★★★


*"గురుదేవా ! పరాజయాన్ని రుచిచూసిన బలి అచిరకాలంలోనే యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడంటే , ఏదో నూతన శక్తి అతనికి లభించి ఉండాలి..."* ఇంద్రుడు సాలోచనగా అన్నాడు.


శూన్యంలోకి చూస్తున్న బృహస్పతి తన దృష్టిని ఇంద్రుడి వైపు తిప్పాడు. *“మహేంద్రా ! శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. దానితో అసురుల బలం ఇబ్బడి ముబ్బడి అయింది. బ్రహ్మ వాదులైన భృగువంశీకులు అసామాన్య శక్తులను బలికి ఒనగూర్చుతున్నారు. శ్రీమహావిష్ణువూ , పరమశివుడూ తప్ప మరెవ్వరూ బలిని ఎదిరించి జయించలేరు...”*


*"గురుదేవా !”*


*"అవును , దేవరాజా ! నా గణన ప్రకారం ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదు !"*


*"కర్తవ్యం ఏమిటో చెప్పండి !”*


*"నీకు తెలియనిది ఏముంది మహేంద్రా ! యుద్ధంలో సిద్ధించాల్సిన పర్యసనాలు రెండే ! ఒకటి విజయం. రెండు వీరమరణం. ప్రస్తుతం మనకు లభ్యంగా ఉన్న దైవికబలం , ఆయుధబలం ఈ రెండూ కూడా విజయసాధనకు చాలవు. అంటే ఈ రెండింటివల్లా విజయం రాదు ! అమృతం కారణంగా వీర మరణమూ రాదు !”* బృహస్పతి నిస్పృహతో అన్నాడు.


దేవేంద్రుడు నీరసంగా చూశాడు. *“మీ విశ్లేషణం నాకు ఆందోళన కలిగిస్తోంది ! కర్తవ్య బోధ చేయండి !”*


*"స్వర్గ సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి పరంచేసి , తొలగిపోవడమే కర్తవ్యం !”*


*"గురుదేవా !”*


*"ఆందోళన పడవద్దు మహేంద్రా ! ఈ పరిత్యాగం శాశ్వతం కాదు ; ” తాత్కాలికమే!”* బృహస్పతి ఓదార్పుగా అన్నాడు. ఇంద్రుడు వేడిగా నిట్టూర్చాడు.


★★★★★★★★★★★★★★★★


మహేంద్రుడి ఆనతిని అనుసరించి దేవతలూ , అప్సరసలూ స్వర్గలోకాన్ని వదిలి సురక్షితమైన అనుకూల ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇంద్రుడూ సతీ సంతాన సమేతంగా తరలి వెళ్ళాడు.


అమరులందరూ కాందిశీకులుగా మారిపోయి , చెట్టుకొకరూ , పుట్టుకొకరూ పారిపోయిన దుర్వార్తను నారదమహర్షి కశ్యపాశ్రమానికి చేరవేశాడు. తన సంతతి అయిన దేవతలకు ప్రాప్తించిన కష్టనష్టాలను విని , అదితి విచారంలో మునిగిపోయింది. భర్త కశ్యప బ్రహ్మ ముందు తన దుఃఖాన్ని ప్రకటించింది.


*"స్వామీ ! నా సంతతిగా జన్మించిన మన బిడ్డలు సౌమ్యులు , అక్రమ ప్రవర్తునులైన అసురుల మూలంగా భోగభోగ్యాలనూ , సుఖసంతోషాలనూ కోల్పోయి దుఃఖ సాగరంలో మునకలు వేస్తున్నారు. నా బిడ్డలైన ఇంద్రాదులను అమరావతిలో పునఃప్రతిష్ఠించండి. దైత్యదానవులను శిక్షించి , అదితేయులను రక్షించండి !”*


ఆవేదనతో కూడిన అదితి అభ్యర్ధన విని కశ్యపుడు నిట్టూర్చాడు. అనునయంగా ఆమె ఆశ్రువుల్ని తుడిచాడు. *"అదితీ ! నీ కోరికను తీర్చే శక్తి , సామర్థ్యం నాకు లేవు. నాకే కాదు ; త్రిలోకాలలో ఎవ్వరికీ లేవు , ఒకే ఒక్క మహితాత్ముడికి తప్ప !”*


*"స్వామీ... ఆ మహితాత్ముడు...”*


*"శ్రీమహావిష్ణువు !”* కశ్యపుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. *"అసురులను శిక్షించి , సురలను రక్షించే అపూర్వశక్తి ఆయనొక్కడికే ఉంది ! ఆ జగజ్జనకుడిని ఆరాధించు !”*


*"స్వామీ ! ఆ స్వామి కరుణిస్తారా ?”*


*"ఒక విశిష్టమైన , ప్రత్యేకమైన వ్రతవిధానం ఉంది. భక్తి ప్రపత్తులతో , నియమనిష్ఠలతో , చిత్తశుద్ధితో ఆ వ్రతాన్ని ఆచరిస్తే పరమ పురుషుడు తప్పక కరుణిస్తాడు !"* అదితి కుతూహలంగా , మౌనంగా చూసింది.


*"అద్వితీయమైన 'పయోభక్షణ వ్రతం' అది ! ఆ వ్రత విధానాన్నీ , మంత్రాన్నీ వ్రత కాలంలో పాటించవలసిన నియమాన్నీ , తగిన కాలాన్నీ , వ్యవధానాన్నీ నీకు ఎరుకపరుస్తాను. మహాశక్తివంతమైన , దివ్యమైన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. రేపు ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి ! వ్రతం ప్రారంభించడానికి మహత్తరమైన దినం. సరేనా !”*


*"ఆజ్ఞ ! రేపు ఉదయమే వ్రతాన్ని ప్రారంభిస్తాను !"* అదితి ఉత్సాహంగా అంది. *“శుభం ! మహాసంకల్పం చేసుకుని , ప్రారంభించాలి సుమా !”* కశ్యపుడు అన్నాడు.


★★★★★★★★★★★★★★★★


అదితి పతిదేవుని సూచనను అనుసరించి ఆ మరునాడే పయోభక్షణ వ్రతాన్ని ఆరంభించి , నియమనిష్ఠలతో పండ్రెండు రోజుల పాటు ఆచరించింది. పయోభక్షణ వ్రతం పరిసమాప్తమైంది.


అదితిని ఆనందాశ్చర్యాల డోలికలలో ఊపుతూ శ్రీమహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు.


*"అమ్మా... అదితీ !"*


*“తండ్రీ ! వచ్చావా ?!”* అదితి ఆనందబాష్పాలు రాలుస్తూ , గద్గదకంఠంతో అంది. *"అమ్మ పిలిస్తే రాకుండా ఉండగలనా !"* శ్రీహరి చిరునవ్వుల వెన్నెలలు కురిపిస్తూ అన్నాడు.


*"తండ్రీ !”* అదితి కదిలిపోతూ అంది.


*"నీ కోరిక నాకు తెలుసు తల్లీ ! నీ కడుపున పుట్టి , దేవతలకు పూర్వవైభవాన్ని చేకూర్చుతాను !”*


*"జగజ్జనకా ! నేనెంత అదృష్టవంతురాలిని !"* అదితి విశాల నేత్రాలు ఆనందాశ్రు వులను వర్షిస్తున్నాయి.


*"అదృష్టం నాది కూడా , మాతా ! నీ గర్భసుధాంబుధి వీచికలలో ఊయల లూగుతూ విశ్రమించి , తుష్టిని పొంది , సకాలంలో నీ వొడిని చేరి , నీ స్తన్యం త్రాగి పుష్టిని పొందుతాను !"*


అదితి శరీరం ఒక్కసారిగా జలదరించింది. *"తండ్రీ... నా తండ్రీ !”*


*“నా రూపాన్ని మనసులో ఉంచుకుంటూ తనువుతో నీ పతిదేవుణ్ణి సేవించు ! పవిత్ర యజ్ఞకుండంలో హవిస్సులాగా నేను నీ పావన గర్భంలో చేరుతాను !”* 


*"ధన్యురాలను స్వామీ !”*


*“సుపుత్ర ప్రాప్తిరస్తు !”* విష్ణువు చిరునవ్వుతో దీవిస్తూ అంతర్ధానమయ్యాడు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: