14, మార్చి 2024, గురువారం

కలలు కనడం

 కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి???


ఎలాంటి కలలు రావడం మంచిది కాదు?

మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు.


ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరగదు?

కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు.


అగ్నిపురాణం ప్రకారం… కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.


ఎలాంటి కలలు నష్టహేతువులు?

అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువులు.


ఇవేగాక…. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు.


ఎలాంటి కలలు రావడం వల్ల కోరికలు నెరవేరుతాయి?

ఒక్కోసారి పూలతోటల్లోను … పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా, ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, పాములు – తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ … దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి.


ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరుగుతుంది?

ఇక కలలో పాలు … తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన …సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు, తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది. అంతే కాదు పాము కాటు వేసి రక్తం కళ్ళచూసినట్లు కన్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది.


ఎలాంటి కలల వల్ల శత్రువులు నశిస్తారు?

ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు – తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను … తేళ్ళను చంపినట్టుగా కల వస్తే … త్వరలోనే శత్రువులు నశిస్తారు.

కామెంట్‌లు లేవు: