13, మార్చి 2025, గురువారం

గరుడ పురాణం_*8వ

 *గరుడ పురాణం_*8వ భాగం*


_*6వ అధ్యాయం:-*_


_*ధ్రువ వంశం - దక్ష సంతతి:*_


_శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు._


_*ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశంపాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతా లతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషీద' అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలనూ రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు.**_


_పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి, రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్దారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పది వేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు._


_*దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరి రాలేదు.*_


_దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు 'శబలాశ్వ' నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసివచ్చింది._


_(* వేన చరిత్రలో మనం గమనించ వలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజెలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి, తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు, బ్రాహ్మణ శబ్దానికి అర్హులైనవారు అలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది.)_


_*ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా అరవైమంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరామహర్షికి, ఇద్దరు కన్యలను కృశాశ్వునికీ పది మందిని ధర్మునికీ, పదునాల్గురిని కశ్యపునికీ, ఇరవై ఎనమండుగురిని చంద్రునికీ ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను నలుగురు కన్యలను అరిష్టనేమి కిచ్చి వివాహముగావించాడు.*_


_ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు. శంకరదేవా! భానుకి పన్నెండుగురు భానులూ, ముహూర్తకు ముహూర్తులూ జన్మించారు. లంబనుండి ఘోషులు, యామీ ద్వారా నాగవీథి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు._


_*ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వికాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ.


వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు.


అనల (అగ్ని) పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి; కృత్తి కలచే పాలింపబడి కార్తికేయుడై నాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అసలునికి కలిగారు.*_


_దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి. రుద్ర నందనులైన హర, బహురూప, త్య్రంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు._


_*కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.*_

కామెంట్‌లు లేవు: