*ఆధునిక నవలా శైలితో ప్రాచీన సంస్కృత నాటకం:*
‘ముద్రా రాక్షసం’ గురించి మూడు ముక్కలు.
*-- ప్రకాష్*
📗 📙 📘 📕
*విశాఖదత్తుని సుప్రసిద్ధ సంస్కృత నాటకం ‘ముద్రారాక్షసమ్’.* దీన్ని డా. ధూళిపాళ అన్నపూర్ణగారు తెలుగులో అనువదించారు. నాకు తెలిసి ఈ నాటకానికి చాలా ఏళ్ల క్రితం రెండు అనువాదాలు వెలువడ్డాయి. ఒకటి అవధానము చంద్రశేఖర శర్మగారు 1957 లో చేసినది.( ఇందులో గేయాలు కూడా ఉన్నాయి) రెండోది శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవి 1966 లో చేసినది. ఇవి అడుగడుగునా పద్యాలతో, అరసున్నలతో, సరళ గ్రాంథికంలో ఉన్నాయి. ఇద్దరూ ఉద్దండ పండితులే! ఇద్దరూ తమవి సరళాను వాదాలే అని చెప్పుకున్నారు. కానీ చిన్నయసూరిగారు పిల్లల కోసం రాసిన ‘నీతి చంద్రిక’ పెద్దలకు కూడా ఒక పట్టాన కొరుకుడు పడనట్టు ఇవి నేటి పాఠకులకు సాఫీగా సాగవు. నేను కొన్నేళ్ళ క్రితం చదవాలని ప్రయత్నించి ‘ మనవల్ల కాదులే’ అని రెండూ మొదటి అంకంలోనే ఆపేశాను.
పైన చెప్పిన పండితుల అనువాదాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయినా వాటి పునర్ముద్రణకు ఎవరూ సాహసించలేదు. అలాంటి సమయంలో అన్నపూర్ణగారు సరికొత్త శైలిలో దీని అనువాదానికి పూనుకోవడం ప్రశంసనీయం. ఈ అనువాదంలో క్లిష్టమైన పదాలు కానీ, సంస్కృతసమాసాలు కానీ లేవు. కాబట్టి ఒక నవలలా చదువుకుంటూ పోవచ్చు. సుమారు నాలుగు దశాబ్దాల సంస్కృత బోధనానుభవంమాత్రమే దీనికి సరిపోదు. ఆధునిక తెలుగు సాహిత్యానురక్తీ, పరిశీలనాశక్తీ కూడా ఉండటం వల్ల అన్నపూర్ణగారికి ఈ అనువాదం తేటతెలుగులో రాయడం సాధ్యమైంది. ప్రథమాంకం, ద్వితీయాంకం అనకుండా మొదటి అంకం రెండో అంకం అన్నారు. సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను చక్కగా విశ్లేషించారు. ‘ఆగు ఆగు ఒరేయ్ !’ , ‘చాణక్య గాడు’.. అనడం కంటే వ్యావహారిక శైలి ఏముంటుంది? సరళీకరణకు ఏ మేరకు అవకాశం ఉందో ఆ మేరకు చేసారు. భవిష్యత్తులో ఇలాంటి సంస్కృత నాటకాల అనువాదకులకు ఇది నమూనాగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఒక అనువాదం ఎంత సరళంగా ఉందో చెప్పడానికి తిరుపతి వెంకటేశ్వరకవి అనువాదంలోని ఒక పలుకుబడిని చూడండి. రాక్షసుడు ఒక సందర్భంలో తన బాధను వ్యక్తం చేస్తూ ‘గండము పై పిండకము పుట్టినది’ అంటాడు. ఇక్కడ సామాన్య పాఠకుడు నిఘంటువు వెతకాల్సిందే. దీనిని అన్నపూర్ణగారు ‘ ‘పుండుమీద కారం చల్లినట్టు’ ‘ గోరుచుట్టు మీద రోకటి పోటులా’ అని జనవ్యవహారంలో ఉన్న సామెతలను ఉపయోగించారు.
ఇంకో ఉదాహరణ. తిరుపతి వారి అనువాదంలోదే సూత్రధారుడి పద్యం ఇది. గీ. “తెలివితక్కువవాఁడు విత్తినను మంచి/ నేలపైఁ బడ్డ విత్తన మేల చెడును ?/పొలము బలమైనదై యుండవలయుఁగాని/ వప్తగుణ మేల వరివేళ్ళు పాఱుటకును”. ఇందులో ‘వప్త’ అంటే విత్తులు నాటేవాడు. కొంచెం ప్రయత్నిస్తే అర్ధమవుతుంది. కానీ పాఠకుడు ఆపాటి కష్టం కూడా పడకూడదనుకున్నారు అన్నపూర్ణగారు. ‘ మంచి నేలలో పడిన గింజకు దానిని చల్లినవానితో పనిలేదు. నేల తాలూకు సారం వల్లనే చక్కగా ఎదిగి మంచి పంటను ఇస్తుంది’ అని ‘అరటి పండు ఒలిచి పాఠకుడి నోటికి అందించారు.
తిరుపతి కవిగారు చాణక్యుడి మాటలు గురించి చెబుతూ “ చ. పుడమికి రొమ్ముజబ్బు లనఁ బోలిన నందుల నాఱుమూగురన్/ గెడపితి' అంటే అన్నపూర్ణ గారు ‘ ఈ భూమికి మానసికమైన జబ్బులా ఉన్న తొమ్మండుగురు నందుల్ని దుంపనాశనం చేశాను’ అని చక్కని జాతీయం ప్రయోగించారు. దుంపనాశనం అంటే సమూలంగా ధ్వంసం చేయడం అని అర్ధం.
ఇలా చెప్పడం ఆ పూర్వ పండితుల వైదుష్యాన్ని తక్కువ చేసి చెప్పడం కాదు. అన్నపూర్ణగారి అనువాదం చదువుకోడానికి ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికే.
తెలుగుపాఠకులు దీన్ని చదివితే సంస్కృత నాటకం గొప్ప తనం తెలుస్తుంది. సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు చదివితే ఆ గొప్పతనాన్ని తెలుగులో ఎంత సరళంగా చెప్ప వచ్చో తెలుస్తుంది. సామాజిక మాధ్యమాలవల్ల పాఠకుల అభిరుచులు పక్కదారి పట్టాయనే కొందరి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఈ నాటకాన్ని ప్రచురించిన తురగా ప్రచురణాలయం వారినీ, ఎంతో శ్రమకోర్చి నాటకాన్ని తెలుగు చేసిన డా. అన్నపూర్ణగారినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
*పుస్తకం లభించే చిరునామా :
తురగా ప్రచురణాలయం
99085 72598
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి