3, మార్చి 2025, సోమవారం

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(65వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

      *పరశురాముడి ప్రతిజ్ఞ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కృతవీర్యుని పుత్రుడు కార్తవీర్యార్జునుడు. హైహయ వంశానికి చెందిన వాడు. వేయి చేతులతనికి. మాహిష్మతీపురం అతని రాజధాని. దత్తాత్రేయుని భక్తుడతను. ఆ దేవుని అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు గొప్ప శక్తిసంపన్నుడయ్యాడు. అనేక శస్త్రాస్త్రాలు సాధించాడు. ఆ కాలంలో అతన్ని ఎదిరించగలిగిన వీరుడే లేడు. రావణాసురుణ్ణే బంధించిన ఘనత అతనిది.*


*అలాంటి కార్తవీర్యార్జునుడు ఒకనాడు సైన్యసమేతంగా వేటకి వెళ్ళి, దోవలో జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. వచ్చిన రాజుని సాదరంగా ఆహ్వానించాడు జమదగ్ని. తన వద్దగల కామధేనువు ప్రభావంతో రాజుకీ, అతని సైన్యానికీ షడ్రసోపేతమయిన విందు ఏర్పాటు చేశాడు. విందు బాగుంది. కామధేనువు ప్రభావాన్ని మెచ్చుకున్నాడు రాజు. దానిని కావాలన్నాడు.*


*ఇవ్వలేనన్నాడు జమదగ్ని. ముని వాకిట ఉండాల్సిన గోవు కామధేనువంటూ నచ్చజెప్పజూశాడు. అతని మాటలకి కోపం వచ్చింది కార్తవీర్యార్జునునికి. భటులతో బలవంతంగా గోవుని తోలుకుని పోయాడు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు.*


*వచ్చిన తర్వాత జరిగిందంతా తెలుసుకున్నాడతను. ఆగ్రహంతో ఊగిపోయాడు. ధనుర్బాణాలూ, పరశువూ ధరించి, కార్తవీర్యార్జునుని మీద యుద్ధం ప్రకటించాడు. ఇద్దరికీ పెద్ద యుద్ధమే జరిగింది. కార్తవీర్యార్జుని బలపరాక్రమాలేవీ పరశురాముని ముందు పని చెయ్యలేదు.*


*విష్ణ్వంశతో జన్మించిన పరశురాముడు, తన పరశువుతో కార్తవీర్యార్జుని వేయి చేతులూ ఖండించాడు. అతని శిరస్సును కూడా తుంచి వేశాడు.*


*కామధేనువును చేజిక్కించుకుని, తీసుకుని వచ్చి, తండ్రికి సమర్పించాడు.  రాజుని చంపడం మహాపాపం అని జమదగ్ని చెబితే, ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఓ సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేశాడు పరశురాముడు.*


*రేణుక ఒకనాడు నీరు తెచ్చేందుకు గంగానదికి వెళ్ళింది. అక్కడ ఆమెకు చిత్రరథుడు అనే గంధర్వుడు కనిపించాడు. అతను, అప్సరసలతో జలక్రీడలాడడం చూడముచ్చటనిపించి, చూస్తూ ఉండిపోయింది రేణుక. కాస్సేపటికి నీరు తీసుకుని ఆశ్రమానికి చేరుకుంది. ఆలస్యంగా ఆశ్రమానికి చేరిన రేణుకను గమనించి, కోపించాడు భర్త జమదగ్ని.*


*ఆమెను చంపమని కుమారులను ఆజ్ఞాపించాడు. తల్లిని చంపడం పాపమని, తమ వల్ల కాదని కుమారులంతా వెనుకడుగువేశారు. పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాటించాడు. తల్లిని వధించాడు. తన ఆజ్ఞను పాటించి, తల్లిని వధించినందుకు పరశురాముణ్ణి మెచ్చుకున్నాడు జమదగ్ని.*


*వరం కోరుకోమన్నాడు. తల్లిని బ్రతికించమని కోరాడు పరశురాముడు. పరశురాముని కోరిక మేరకు రేణుక బ్రతికింది. జమదగ్ని ఆమెను పునర్జీవింపజేశాడు. తమ తండ్రి కార్తవీర్యార్జుని చంపినందుకు అతని కొడుకులు హైహయులు, పరశురాముని మీద కసి తీర్చుకునేందుకు సమయం కోసం వేచి చూశారు. సమయం చిక్కింది.*


*ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని వేళ, తపస్సు చేసుకుంటున్న అతని తండ్రి జమదగ్ని తల నరికి వెళ్ళిపోయారు హైహయులు. పతివియోగాన్ని తట్టుకోలేకపోయింది రేణుక. కంటికీ మంటికీ ఏకధారగా ఏడ్చింది. అప్పుడు అక్కడకి వచ్చాడు పరశురాముడు. తండ్రిని తెగ నరికిన హైహయుల గురించి తెలుసుకుని, ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ క్షణమే క్షత్రియుడు అన్నవాడే లోకంలో ఉండకుండా చేస్తానని శపథం పట్టాడు.*


*మహిష్మతీపురంపై విరుచుకు పడ్డాడు. హైహయులందరినీ వధించాడు. ఆ పట్టణాన్ని భస్మీపటలం చేశాడు. అక్కడితో ఊరుకోలేదు. క్షత్రియుల మీద పగబట్టి ఇరవై ఒక్కసార్లు భూమి మీద నలువైపులా ఉన్న రాజయినవారినల్లా అంతమొందించాడు.*


*పరశురాముడి నుంచి తప్పించుకునేందుకు కొందరు రాజులు గాజులు తొడిగించుకుని, స్త్రీల మధ్య దాగున్నారు. మరికొందరు పశువులమందలో కలసిపోయారు.*


*అలా ప్రాణాన్ని కాపాడుకున్న వారిలో దశరథుడు ఒకడు. అతని కొడుకే శ్రీరాముడు. క్షత్రియులను సంహరించి, వారి రక్తాన్ని మడుగులు కట్టించాడు పరశురాముడు. అలా ఏర్పడినదే శమంతక పంచకం. దీని సమీపంలో గల కురుక్షేత్రంలోనే పాండవులకూ కౌరవులకూ యుద్ధం జరిగింది.*


*తండ్రి జమదగ్ని శిరస్సును మొండానికి అమర్చి, గొప్ప యజ్ఞం చేశాడు పరశురాముడు. ఆ యజ్ఞఫలంగా జమదగ్ని బ్రతికాడు. సప్తర్షుల్లో ఒకడై ఆకాశంలో విరాజిల్లసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: