9, ఏప్రిల్ 2025, బుధవారం

తిరుమల సర్వస్వం 202-*

 *తిరుమల సర్వస్వం 202-*

 *శ్రీవారి సేవకులు-1* 


 శ్రీవారి గురించి, ఆనందనిలయం గురించి, తిరుమలక్షేత్రం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న తరువాత సహజంగానే భక్తుల మదిలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. తిరుమలలో కొద్ది రోజులు గడపాలని, స్వామివారికి సాధ్యమైనంత సేవ చేయాలని అసంకల్పితంగానే మదిలో మెదులుతుంది. శ్రీవెంకటేశ్వరుడు భక్తులను ప్రాణప్రదంగా చూసుకుంటాడని మనకు తెలుసు. అందువల్ల శ్రీవారి భక్తులను సేవించుకున్నా శ్రీనివాసుని సేవించుకున్నట్లే! ఈ పరమసత్యాన్ని గ్రహించినట్టి శ్రీవారి భక్తాగ్రేసరులైన శ్రీమద్రామానుజులవారు, హాథీరామ్ బావాజీ, తరిగొండ వెంగమాంబ, శ్రీకృష్ణదేవరాయల వంటివారు, శ్రీవారితో బాటుగా, వారి భక్తులకు సైతం అనేక రకాలుగా సేవలందించారు. ఇప్పుడు భక్తుడు భగవంతుడు, ఇరువురికీ సేవ చేసుకునే అవకాశాన్ని తి.తి.దే. వారు కల్పిస్తున్నారు.


 దాదాపు శతాబ్దం క్రితం వరకు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉండే భక్తజనం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమవుతూ, క్రమంగా వేల సంఖ్యను దాటి ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. అదే వేసవిశెలవులు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర సందర్భాల్లో, రోజువారీ భక్తుల సంఖ్య రెండు లక్షల పైమాటే! ఇంత మంది భక్తులను నియంత్రించడానికి, దర్శానాది కార్యక్రమాలు సజావుగా జరగటానికి స్వచ్ఛందంగా సేవలందించే వేలకొద్దీ కార్యకర్తలు కావాలి. అంతే గాకుండా ఆసక్తి కలిగిన భక్తులకు ఆ పరమపవిత్రమైన ప్రదేశంలో సేవ చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ రెండు పరమార్థాలను నెరవేర్చటానికి తి.తి.దే. వారు ప్రవేశపెట్టినదే *'శ్రీవారిసేవకుల'* వ్యవస్థ.


 ఇప్పుడీ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిద్దాం.


 *ఎంతెంత మంది? ఎవరెవరు??* 


 ప్రప్రథమంగా, 2000వ సంవత్సరంలో కేవలం 195 మంది స్వచ్ఛంద సేవకులతో 'శ్రీవారి సేవకులు' వ్యవస్థను తి.తి.దే. ప్రారంభించింది. క్రమంగా ఈ స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెరుగుతూ, ప్రస్తుతం ప్రతిరోజు 1,500 నుంచి 2,500 వరకు సేవకులు వివిధ సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని వేల మంది భక్తులు తి.తి.దే. తో నమోదు చేసుకుని, అవకాశం కోసం నెలల తరబడి వేచి ఉంటున్నారు. ఇప్పటివరకు సుమారుగా 8 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిసేవకులుగా నమోదు చేసుకొని సేవలందించారు.


 ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. వారిలో అన్నెం పున్నెం ఎరుగని గ్రామీణభక్తులు, జీవితంలో మొట్టమొదటిసారిగా తమతమ గ్రామాలను దాటి వేరే చోటికి వచ్చినవారు ఇలాంటి వారెందరో కూడా ఉంటారు. విశేషసందర్భాల్లో, పర్వదినాల్లో తిరుమలకొండ ఇసుక వేస్తే రాలనంతగా క్రిక్కిరిసి ఉంటుంది. దీంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలకు దర్శనం, వసతి, తిరుగుప్రయాణం, స్వామివారి సేవల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేగాక, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు భాష విషయంలోనూ జటిలమైన సమస్య తల ఎత్తే సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సమయాలలో శ్రీవారిసేవకులు వారికి చేదోడు వాదోడుగా ఉండి, తగిన సమాచారమిచ్చి, కావలసిన సహాయం అందిస్తారు. ఈ సేవలో పాల్గొనడానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆసక్తి చూపుతారు. శ్రీవారి సేవలో పేరెన్నికగన్న వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ప్రముఖవ్యాపారులు వంటి సమాజంలో ఉన్నతస్థాయికి చెందిన వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. వీరందరికీ తమ తమ వృత్తి నైపుణ్యానికి అనువైన సేవావిభాగాన్ని తి.తి.దే. వారు కేటాయిస్తారు.


 *ఏఏ సేవలందిస్తారు ?* 


 ప్రస్తుతం ఇరవై ఐదు విభాగాల్లో శ్రీవారి సేవకులను తి.తి.దే. వినియోగించు కుంటోంది. వాటిలో ముఖ్యమైనవి శ్రీవారి ముఖ్యాలయంలో వరుస నియంత్రణ; వైకుంఠం క్యూ సముదాయాల్లో భక్తుల బాగోగులు చూడటం; నాలుగు మాడవీధుల్లో నడిచే భక్తులకు తగిన సూచనలు అందించడం; తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా చూడటం; కూరగాయలను శుభ్రపరచడం, తరగడంలో వంటకార్మికులకు సహాయపడడం; లడ్డూ ప్రసాదకేంద్రాలలో క్యూలను నియంత్రించడం; ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పూలమాలలను అల్లడంలో సహాయపడటం; వివిధ ప్రదేశాలలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, ఇతర పానీయాలు, ఫలహారం అందించడం; చిన్నపిల్లలకు పాలు సరఫరా; లగేజీ సెంటర్లలో సాయం; భక్తులకు తిరునామం దిద్దటం; భక్తులకు అత్యవసర సందర్భాలలో ప్రథమచికిత్స అందించడం; తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడం; పరకామణి సేవలు మొదలైనవి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: