*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*341 వ రోజు
*కురు పాండవుల సమరం*
కర్ణుడు యుద్ధానికి రావడం చూసిన పాండవ యోధులు అందరూ " మన పాండవులు ఇంతటి దుర్ధశకు ఈ వినాశనానికి కారణమైన కర్ణుని వదలకండి వధించండి " అని అతడిని చుట్టుముట్టారు. కర్ణుడు అందుకు బెదరక ధైర్యంగా వారిని ఎదుర్కొని చీల్చిచెండాడసాగాడు. అది చూసి అర్జునుడు కర్ణుని ఎదుర్కొని ముప్పది బాణములతో అతడిని కొట్టాడు. కర్ణుని చేతిలో నుండి విల్లు జారిపోయింది. వేరొక విల్లు అందుకుని కర్ణుడు అర్జునుడు ఆశ్చర్యపడేలా శరములు గుప్పించాడు. అర్జునుడు ఆగ్రహించి ఒకే బాణంతో కర్ణుని విల్లు విరిచి, సారథి, హయములను చంపి కర్ణుని శరీరం నిండా శరములు గుచ్చాడు. వెంటనే కర్ణుడు కృపాచార్యుని దూషించానన్న సిగ్గు వదిలి పక్కనే ఉన్న అతడి రథము ఎక్కి తలదాచుకున్నాడు. కృపాచార్యుని రథము అక్కడి నుండి నిష్క్రమించింది. కర్ణుని పరాజయం చూసి కౌరవ సైన్యం పారిపోసాగింది. సుయోధనుడు " సైనికులారా ! పారిపోకండి నేను ఉన్నాను పాండవులను జయించగలము రండి " అని అర్జునుడిని ఎదుర్కోడానికి ముందుకు ఉరికాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థాను చూసి " కుమారా! అశ్వత్థామా ! రారాజు తన బలం ఎంతో ఎరుగక అర్జునుడితో యుద్ధానుకి సన్నద్ధమౌతున్నాడు. అలా జరిగితే అతడు అర్జునుడికి పట్టుబడగలడు. నీవు ఇక్కడ ఉండగా అది జరుగరాదు. కనుక నీవు రారాజుకు సాయంగా వెళ్ళు " అన్నాడు. అశ్వత్థామ సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! నేనుండగా నీ కెందుకు శ్రమ నేను అర్జునుడిని ఎదుర్కొంటాను నువ్వు వెళ్ళు " అన్నాడు. సుయోధనుడు " గురుపుత్రా ! నీకు నీ తండ్రికి అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ మీరు అర్జునుడితో మనసారా యుద్ధం చేసి అతడిని చంపరు. ఇప్పటికే నా తమ్ములు చనిపోయారు సైన్యం క్షీణించింది. కనుక మీరు పాండవుల వద్దకు రావద్దు. మీరు పాండవులతో యుద్ధం చెయ్య వద్దు నేను వారితో యుద్ధం చేస్తాను. మీరు వారి సేనలను నశింపచేయండి " అన్నాడు. అశ్వత్థామ " రారాజా ! నాకు నా తండ్రికి అర్జునుడంటే అభిమానం ఉన్న మాట నిజమే అయినా యుద్ధరంగంలో శత్రుపక్షాన ఉన్న వారు మిత్రులైనా, బంధువులైనా, అభిమానాలకు తావుండదు. మేము మా ఒళ్ళు దాచక యుద్ధం చేయడం చూస్తూనే నువ్వు మమ్ము నమ్మడం లేదు నువ్వు ఎవరినీ నమ్మవు అసలు నిన్ను నువ్వే నమ్మవు. అదంతా ఎందుకు నేను శత్రు సైన్యంలో ప్రవేశించి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి సైన్యమును పారతోలుతాను " అంటూ పాండసేనలో ప్రవేశించాడు.
.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి