*తిరుమల సర్వస్వం 255-*
*ద్వాదశ ఆళ్వారులు-19*
*దేవదేవి ప్రతిన*
ఒకానొక దినాన 'దేవదేవి' గా పిలువబడే ప్రముఖనర్తకి చోళరాజు సభలో తన నృత్యగానాలను అతినేర్పుగా ప్రదర్శించి, చోళప్రభువును ఆకట్టుకొంది. రాజుగారిచే బహూకరింపబడ్డ వెలలేని కట్నకానుకలు, దాసదాసీ జనంతో పాటుగా ఆమె తన స్వగ్రామానికేగుతూ, మార్గమధ్యలో విప్రనారాయణుని పూదోటను చూడటం తటస్థించింది. మార్గాయాసంతో అలసి ఉన్న దేవదేవి, ముచ్చట గొలుపుతున్న ఆ ఉద్యానవనంలో తన సోదరితో పాటుగా విశ్రమించింది. ఆ పూదోట సోయగానికి అబ్బురపడిన వారిరువురూ కొంత తడవు సేద తీరిన తరువాత, వారికి సర్వసంగపరిత్యాగి యైన విప్రనారాయణుడు తారసిల్లాడు. వారిరువురూ విప్రనారాయణునికి నమస్కరించగా, అద్వితీయ సౌందర్యంతో అలరారుతున్న దేవదేవిని అత్యంత సమీపం నుండి చూచి కూడా, యౌవనదశలో నున్న ఆ సాధుపుంగవుడు ఏవిధమైన చిత్తచాపల్యానికి లోనవ్వలేదు. ఆ సాధుసత్తముడు వారినాశీర్వదించి నిష్క్రమించిన తరువాత; దేవదేవి తనవంటి సౌందర్యరాశిని చూచి కూడా నిర్వికారంగా ఉండగలిగిన ఈ విప్రుడు నిశ్చయంగా ఉన్మత్తుడే (పిచ్చివాడు) నని వెటకారమాడింది. అంతట ఆమె సోదరి వీరెవ్వరో ఇంద్రియనిగ్రహం కలిగిన సాధుపుంగవుని వలె గోచరిస్తున్నారని, దేవదేవి తళుకు బెళుకులకు లొంగిపోయే సాధారణ పురుషుడు కారని, ఆ మునివర్యుని వశం చేసుకోవడం దేవదేవి వల్ల కాదని, పుణ్యపురుషులను హేళన చేయడం కూడదని హితవు పలికింది. దానితో అహం దెబ్బతిన్న దేవదేవి ఆరునెలలలో ఆ సన్యాసిని తన దారి లోకి తెచ్చుకుంటానని; అతనిని తన కోసం సర్వం ధార పోసేటట్లుగా చేయగలనని; లేకుంటే తాను తన సోదరికి జీవితాంతం దాసిగా పడి ఉంటానని ప్రతిన పూనింది.
*ముని ఆశ్రయంలో దేవదేవి*
తన పంతం నెరవేర్చుకోవడానికై వెనువెంటనే రంగం లోకి దిగిన దేవదేవి తన సర్వాభరణాలను, పట్టుపీతాంబరాలను తీసివేసి; కాషాయ వస్త్రధారియై విప్రనారాయణుణ్ణి సమీపించింది. తాను సమీప గ్రామంలో నున్న ఒక వేశ్యా కుటుంబంలో జన్మించానని; తనకు చిన్నతనం నుండే ఆ వృత్తి పట్ల ఏహ్య భావముందని; కానీ తన తల్లి తనను కులవృత్తి చెపట్టడానికై ఒత్తిడి చేయసాగిందని; మీవంటి మునిపుంగవుల సమీపంలో ఉంటే మరుజన్మ లోనైనా ఉత్తమజన్మ సంప్రాప్తిస్తుందని; ఉద్యానవనంలో తలదాచుకుంటూ మొక్కలను సంరక్షించడానికి తనను అనుమతించమని; లేకుంటే తనకు అత్మహత్యే శరణ్యమని కల్లబొల్లి మాటలల్లింది. అప్పటివరకు పరస్త్రీ సాన్నిహిత్యమే లేని, లోకరీతి తెలియని విప్రనారాయణుడు దేవదేవి కపటపు మాటలను పూర్తిగా విశ్వసించి, ఆ అబల దీనావస్థకు జాలిపడి, తన ఉద్యానవనం లోని ఒక పూరిపాకలో నివసించడానికి ఆమెను అనుమతించాడు. అదే అదనుగా భావించిన దేవదేవి తాను కూడా తాపసి దుస్తులు ధరించి, తోటపని చేస్తూ, మాలలల్లడంలో విప్రనారాయణునికి సాయపడుతూ, కొంత సమయం సంయమనంతో గడిపింది. దేవదేవి ఎంత సమీపంలోనున్నప్పటికీ విప్రనారాయణుడు ఏ విధమైన వికారానికి లోనుకాలేదు
2 ఆరు నెలలు పూర్తికావడానికి మరికొంత సమయం మాత్రమే మిగలి ఉండడంతో దేవదేవి కలవరానికి గురై; విప్రనారాయణుణ్ణి లొంగదీసు కోవడానికి అనువైన సమయం కోసం వేచిచూస్తూ, తన కార్యం సఫలం చేయమని శ్రీరంగనాథుణ్ణి పరిపరి విధాలుగా వేడుకోసాగింది.
*ఉచ్చులో చిక్కిన విప్రుడు*
ఇంతలో వర్షఋతువు ఆసన్నమైంది. ఒకనాటి రాత్రి విప్రనారాయణుడు తన కుటీరంలో విశ్రమించి యుండగా ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి కురియసాగింది. ఆ ఫెళఫెళారావాలకు నిద్రాభంగం కలిగిన విప్రనారాయణునికి, ఆశ్రమం బయటే విశ్రమిస్తున్న దేవదేవి దైన్యస్థితి తలపు చ్చింది. దయాహృదయం పెల్లుబికిన విప్రనారాయణుడు ఆరుబయలే ఒక వృక్షం క్రింద నిలుచుని జడివానలో తడిసి ముద్దవుతున్న దేవదేవిని కాంచి; తన ఆశ్రమం లోనికి వచ్చి, వర్షం వెలిసేంత వరకూ ఒక మూలన విశ్రమించడానికి ఆమెకు అనుమతినిచ్చాడు. అదే అదను కోసం వేచియున్న దేవదేవి ఆశ్రమం లోనికి ప్రవేశించి, తన కోకిల కంఠంతో మునీశ్వరుని క్షేమ సమాచారాలడుగుతూ, వారితో సంభాషణ ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా అంత సమీపం నుండి వినవచ్చిన ఆమె మృదువైన కంఠస్వరం విప్రనారాయణునికి ఆసక్తి కలిగించింది. తన నేర్పరితనంతో దేవదేవి సంభాషణ తీరుతెన్నులను తనకు అనుకూలంగా మార్చుకో గలిగింది. అలా వారి సంవాదం సరససల్లాపంగా మారిన కొంత తడవు తరువాత, విప్రనారాయణుడు దేవదేవి కోరికపై ఆమెను తన పాదాల నొత్తడానికి అనుమతించాడు. తొలిసారిగా అంతటి మధుర స్పర్శను ఆస్వాదించిన విప్రోత్తముడు విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాడు. ఇరువురూ శ్రీరంగనాథుని భక్తులే! ఆ రంగశాయి లీలావినోదం వల్ల, దేవదేవి ప్రతిన నెరవేరింది. ఆరునెలల సమయం ముగిసే లోపుగానే విప్రనారాయణుడు దేవదేవికి దాసానుదాసునిగా మారాడు. బ్రాహ్మణ్యం మంట గలిసిపోయింది. విప్రనారాయణుడు నిత్యానుష్ఠానుదులకు, భగవతారాధనకు తిలోదకాలర్పించి, ఎల్లవేళలా దేవదేవి సాంగత్యంలో కాలం గడపసాగాడు. భోగలాలసుడై, ఆశ్రమాన్ని విడిచి దేవదేవితో పాటుగా ఆమె గృహానికి చేరుకున్నాడు. సత్సాంగత్యం వల్ల దేవదేవి కూడా పరిణతి చెందింది. తన ప్రతిన విషయం మరిచి, అర్థాంగి వలె విప్రనారాయణునికి చిత్తశుద్ధితో సపరిచర్యలు చేయసాగింది. కానీ, కేవలం ధనాపేక్ష మాత్రమే గలిగిన, కఠినాత్మురాలైన దేవదేవి తల్లి తన సర్వస్వం అప్పటికే ధారపోసిన విప్రనారాయణుణ్ణి, నిర్దాక్షిణ్యంగా ఇంటినుండి తరిమి వేసింది. దేవదేవిపై వ్యామోహం వీడని విప్రనారాయణుడు ఆరుబయట, వేశ్య ఇంటి అరుగుపై విశ్రమించాడు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి