23, మే 2025, శుక్రవారం

🙏శ్రీ కుచేలోపాఖ్యానము : ఎనిమిదవ భాగం

 🙏🙏🙏శ్రీ కుచేలోపాఖ్యానము :

ఎనిమిదవ భాగం 


దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు

డాయ నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు

విమల సంగీత నృత్య వాద్యములు సెలఁగ

గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును.

 టీక:- దివిజ = దేవతా; వనితలన్ = స్త్రీలను; పోలెడు = పోలుచున్నట్టి; తెఱవలు = యువతులు {తెఱవ - తెఱ (తీరైన) వా (ఆమె), స్త్రీ}; అపుడు = అప్పుడు; డాయన్ = దగ్గరకు; ఏరెంచి = వచ్చి; ఇందు = ఇటువైపు; విచ్చేయుడు = రండి; అనుచు = అంటు; విమల = నిర్మలమైన; సంగీత = పాటలు; నృత్య = ఆటలు; వాద్యములు = వాయిద్యములు; చెలగన్ = చెలరేగగా; గరిమన్ = గౌరవముతో; తోడ్కొని = కూడా తీసుకొని; చనిరి = వెళ్ళిరి; అంతిపురమున్ = లోపలి గృహమున; కును = కు.

 భావము:- దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు.


ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు.

 టీక:- ఇట్లు = ఈ విధముగా; చనుదేర = రాగా; అతని = అతని యొక్క; భార్య = పెండ్లాము; ఐన = అయినట్టి; సతీ = స్త్రీ; లలామంబు = ఉత్తమురాలు; తన = తన యొక్క; మనంబునన్ = మనస్సు నందు; ఆనందరస = ఆనందరసమున; మగ్న = మునిగిన ఆమె; అగుచున్ = ఔతు.

 భావము:- కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది.


తన విభురాక ముందటఁ గని మనమున;

హర్షించి వైభవం బలర మనుజ

కామినీరూపంబు గైకొన్న యిందిరా;

వనిత చందంబునఁ దనరుచున్న

కలకంఠి తన వాలుఁగన్నుల క్రేవల;

నానందబాష్పంబు లంకురింప

నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా;

వంబున నాలింగనంబు సేసె


నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ

రణ విభూషితలై రతిరాజు సాయ

కముల గతి నొప్పు పరిచారికలు భజింప

లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.

 టీక:- తన = తన యొక్క; విభు = భర్త; రాకన్ = వచ్చుటను; ముందటన్ = ఎదురుగా; కని = చూసి; మనమునన్ = మనస్సునందు; హర్షించి = ఆనందించి; వైభవంబులు = వైభవములు; అలరన్ = వికసించగా; మనుజ = మానవ; కామినీ = స్త్రీ; రూపంబున్ = రూపమును; కైకొన్న = వహించినట్టి; ఇందిరా = లక్ష్మీ; వనిత = దేవి; చందంబునన్ = వలె; తనరుచున్న = ఒప్పుచున్న; కలకంఠి = స్త్రీ {కలకంఠి - కోకిల వంటి కంఠస్వరము కలామె, స్త్రీ}; తన = తన యొక్క; వాలుఁగన్నులక్రేవల = కడకన్నులందు {వాలుఁగన్నులక్రేవలు - దీర్ఘములైనకన్నుల చివరలు, కడకన్నులు}; ఆనంద = సంతోషమువలని; బాష్పంబులున్ = కన్నీరు; అంకురింపన్ = ఊరుతుండగ; అతనిన్ = అతని; పాదంబుల్ = కాళ్ళ; కున్ = కు; ఆత్మ = మనస్సు; లోన్ = అందు; మ్రొక్కి = నమస్కరించి; భావంబునన్ = మనస్సునందు; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసెన్ = చేసెను; ఆ = ఆ.

ధరాదేవుడు = బ్రాహ్మణుడు {ధరాదేవుడు - భూమిపైని దేవుడు, విప్రుడు}; అతుల = సాటిలోని; దివ్య = దివ్యమైన; అంబర = బట్టలు; ఆభరణ = అలంకారములతో; విభూషితలు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; రతిరాజు = మన్మథుని; సాయకముల = బాణముల; గతిన్ = వలె; ఒప్పు = చక్కగా ఉన్న; పరిచారికలు = సేవకురాండ్రు; భజింపన్ = సేవిస్తుండగా; లలిత = మనోజ్ఞమైన; సౌభాగ్య = సౌభాగ్యవతి; అగు = ఐన; నిజ = తన; లలనన్ = భార్యను, స్త్రీని; చూచి = చూసి.

 భావము:- ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి, కౌగలించుకుంది. దివ్యాంబరాలూ ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాల లాగ ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూసాడు.


ఆ నారీరత్నంబునుఁ

దానును ననురాగరసము దళుకొత్తఁగ ని

త్యానందము నొందుచుఁ బెం

పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్.

 టీక:- ఆ = ఆ; నారీ = స్త్రీ; రత్నంబును = శ్రేష్ఠురాలు; తానునున్ = అతను; అనురాగరసము = ప్రేమరసము; తళుకొత్తగా = చిగురించగా; నిత్య = ఎన్నడు చెడని; ఆనందమున్ = ఆనందమును; ఒందుచున్ = పొందుతు; పెంపూనిన = అతిశయించిన; హరి = కృష్ణునివలన; లబ్ధ = లభించిన; వైభవ = వైభవముల; ఉన్నతిన్ = పెంపుతో; మెఱయన్ = ప్రకాశింపగా.

 భావము:- కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరకూ సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు.


కమనీయ పద్మరాగస్తంభకంబులుఁ;

గొమరారు పటికంపుఁ గుడ్యములును

మరకత నవరత్నమయ కవాటంబులుఁ;

గీలిత హరి నీల జాలకములు

దీపిత చంద్రకాంతోపల వేదులు;

నంచిత వివిధ పదార్థములును

దగు హంసతూలికా తల్పంబులును హేమ;

లాలిత శయనస్థలములుఁ దనరు


సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు

మానితోన్నత చతురంతయానములును

వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును

గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి.

 టీక:- కమనీయ = మనోహరమైన; పద్మరాగ = పద్మరాగమణులు పొదగబడిన; స్తంభకంబులు = స్తంభములును; కొమరారు = మనోజ్ఞమైన; పటికంపు = స్ఫటికముల; కుడ్యములును = గోడలును; మరకత = మరకతములును; నవరత్నమయ = వజ్రము, వైడూర్యము, గోమేధికము, పుష్యరాగము, నీలము, మరకతము, మాణిక్యము, విద్రుమము, మౌక్తికము అను తొమ్మిది మణులున్న; కవాటంబులున్ = తలుపులు; కీలిత = పొదగబడిన; హరినీల = ఇంద్రనీలాల; జాలకములు = కిటికీలు; దీపిత = ప్రకాశవంతమైన; చంద్రకాంతోపల = చలువరాళ్ళ; వేదులున్ = వేదికలు; అంచిత = ఒప్పిదమైన; వివిధ = అనేక రకములైన; పదార్థములును = పదార్థములును; తగు = సరియైన; హంసతూలికా = హంసల మెత్తని యీకలు నింపిన; తల్పంబులును = శయ్యలును; హేమ = బంగారపు; లాలిత = అందమైన; శయనస్థలములున్ = పడకటిళ్ళును ; తనరు = ఒప్పు;

సమధిక = మిక్కిల అధికమైన; ఉత్తుంగ = ఎత్తైన; భద్రపీఠముల = పీఠములు; సిరులు = వైభవములు; మానిత = చక్కటి; ఉన్నత = గొప్ప; చతురంతయానములును = పల్లకీలు {చతురంతయానము - నాలుగుకాళ్ళు (బొంగులు) కల పల్లకీ}; వలయు = అవసరమైన; సత్ = మంచి; వస్తు = వస్తువులతో; పరిపూర్ణ = నిండుగా ఉన్నట్టి; వాటికలును = గదుల వరుసలు; కలిగి = ఉండి; చెలువొందు = అందగించు; మందిరంబున్ = గృహమును; ఎలమిన్ = వికాసముతో; చొచ్చి = ప్రవేశించి.

 భావము:- పద్మరాగాలు తాపిన చిరుస్తంభాలు; చలువరాతితో నిర్మించిన గోడలు; మరకతమణులు నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు; ఇంద్రనీలాల కిటికీలు; అందగించే చంద్రకాంత శిలావేదికలు; బహువిధ పదార్ధాలు; హంసతూలికా తల్పాలు; స్వర్ణమయ శయన మందిరాలు; వైభవోపేతమైన ఉన్నత పీఠములు; చక్కటి నాలుగు బొంగుల పల్లకీలు; కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు; కలిగి అందాలు చిందే ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు.


సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు.

 టీక:- సుఖంబునన్ = సౌఖ్యములతో; ఉండునట్టి = ఉన్నట్టి; ఎడన్ = వేళ; తన = తన; కున్ = కు; మనః = మనస్సు నందు; వికారంబులు = వక్రతలు; పొడమకుండన్ = పుట్టకుండ; వర్తించుచున్ = మెలగుతు; నిర్మలంబు = స్వచ్ఛమైనది; అగు = ఐన; తన = తన; మనంబునన్ = మనస్సు నందు; ఇట్లు = ఈ విధముగా; అనున్ = అనుకొనును; ఇంతకాలంబు = ఇంతవరకు; దురంతంబు = దాటరానిది; అగు = ఐన; దారిద్ర్య = పేదరికము అను; దుఃఖ = దుఃఖపూరితమైన; ఆర్ణవంబునన్ = సముద్రము నందు; మునింగి = ములిగిపోయి; ఉన్న = ఉన్నట్టి; నా = నా; కున్ = కు; కడపటన్ = చివరకు; కలిగిన = లభించిన; విభవంబునన్ = వైభవముచేత; ఇప్పుడు = ఇప్పుడు.

 భావము:- కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది.


ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా

కబ్బు టెల్ల హరిదయావలోక

నమునఁ జేసి కాదె! నళినాక్షుసన్నిధి

కర్థి నగుచు నేను నరుగుటయును.

 టీక:- ఎన్నన్ = ఎంచి చూసినచో; క్రొత్తలు = నూతనములు; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; సంపదలు = కలుములు; నా = నా; కున్ = కు; అబ్బుట = పట్టుట, కలుగుట; ఎల్లన్ = అంతా; హరి = కృష్ణుని; దయా = కృపతోకూడిన; అవలోకనమునన్ = చూపు; చేసి = వలన; కాదె = కాదా, అవును; నళినాక్షు = కృష్ణుని; సన్నిధి = వద్ద; కున్ = కు; అర్థిన్ = కోరువాడను; అగుచున్ = ఔతు; నేను = నేను; అరుగుటయున్ = వెళ్ళుట.

 భావము:- ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం....


నను నా వృత్తాంతంబును

దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ

మ్మని యీ సంపద లెల్లను

నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్.

 టీక:- ననున్ = నన్ను; నా = నా యొక్క; వృత్తాంతంబును = విషయమును; తన = తన యొక్క; మనమునన్ = మనస్సు నందు; కనియున్ = తెలిసికొనినను; ఏమి = ఏమియును; తడవక= ఆలస్యము చేయక; ననున్ = నన్ను; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఈ = ఈ; సంపదలు = సంపదలు; ఎల్లనున్ = సమస్తమును; ఒనరన్ = చక్కగా; ఒడగూర్చి = కలుగజేసి; నన్నున్ = నన్ను; ఒడయునిన్ = ప్రభువును; చేసెన్ = చేసెను.

 భావము:- ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు.


అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును.

 టీక:- అట్టి = అటువంటి; పురుషోత్తముండు = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; భక్తి = భక్తి యందు; నిష్ఠులు = నిష్ఠ కలవారు; ఐన = అయిన; సజ్జనులు = సత్పురుషులు; లేశమాత్రంబు = రవ్వంత; అగు = ఐన; పదార్థంబు = వస్తువు; ఐనన్ = అయినప్పటికి; భక్తి = భక్తి; పూర్వకంబు = తోకూడినది; కాన్ = అగునట్లు; సమర్పించినన్ = ఇచ్చినట్లైతే; అది = దానిని; కోటి = వందలక్షలు (1,00,00,000); గుణితంబు = రెట్లు; కాన్ = ఐనట్లు; కైకొని = పరిగ్రహించి; మన్నించుట = మన్ననచేయు ననుట; కున్ = కు; ఇదియ = ఇదే; దృష్టాంతంబు = ఉదాహరణ; కాదె = కాదా, అవును; మలిన = మాసిపోయిన; దేహుండును = శరీరము కలవాడు; జీర్ణ = చిరిగిపోయిన; అంబరుండును = బట్టలు కట్టుకున్నవాడు; అని = అని; చిత్తంబునన్ = మనస్సు నందు; హేయంబుగాన్ = రోతగా; పాటింపక = తలపక; నా = నా; చేన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అడుకులున్ = అటుకులను; ఆదరంబునన్ = మన్ననతో; ఆరగించి = తిని; నన్నున్ = నన్ను; కృతార్థునిన్ = ధన్యునిగా; చేయుట = చేయుట; అతని = అతని యొక్క; నిర్హేతుక = అకారణమైన; దయయ = కృపయే; కాదె = కాదా, అవును; అట్టి = అటువంటి; కారుణ్య = దయకు; సాగరుండు = సముద్రమువంటివాడు; ఐన = అయిన; గోవిందుని = కృష్ణుని; చరణ = పాదములను; అరవిందంబులన్ = పద్మముల; అందులన్ = ఎడలి; భక్తి = భక్తి; ప్రతి = ప్రతీ ఒక్క; భవంబునన్ = జన్మ యందు; కలుగుంగాక = కలగవలెను; అని = అని; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; అందులన్ = ఎడల; భక్తి = భక్తి; తాత్పర్యంబులన్ = భావన లందు; తగిలి = లగ్నమై; పత్నీ = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; నిఖిల = సర్వ; భోగంబుల = సౌఖ్యముల; అందున్ = లోను; ఆసక్తిన్ = ఆపేక్ష యందు; పొరయక = పొర్లక, పొందకుండ; రాగ = తగులములు; విరహితుండును = లేనివాడు; నిర్వికారుండునున్ = వికారము లేని వాడు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; క్రియలు = పనులు; అందున్ = లోను; అనంతుని = కృష్ణుని {అనంతుడు - దేశ కాల వస్తు భేదము లందును అంతము లేని వాడు, విష్ణువు}; అనంత = ఎడతెగని; ధ్యాన = ధ్యానించుటలోని; సుధారసంబునన్ = అమృతము నందు; చొక్కుచు = సోలుతు; విగత = తొలగిన; బంధనుడు = బంధనములు కలవాడు; ఐ = అయ్యి; అపవర్గప్రాప్తిన్ = మోక్షమును {అపవర్గప్రాప్తి - పరలోకము లభించుట, మోక్షము}; ఒందెన్ = పొందెను; మఱియును = ఇంకను.

 భావము:- భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును...


దేవదేవుఁ డఖిల భావజ్ఞుఁ డాశ్రిత

వరదుఁ డైన హరికి ధరణిసురులు

దైవతములు గాన ధారుణీదివిజుల

కంటె దైవ మొకఁడు గలడె భువిని?

 టీక:- దేవదేవుడు = భగవంతుడు {దేవదేవుడు - దేవతలకు దేవుడు, విష్షువు}; అఖిలభావజ్ఞుడు = భగవంతుడు {అఖిల భావజ్ఞుడు - సర్వుల తాత్పర్యములు తెలిసిన వాడు, విష్ణువు}; ఆశ్రితవరదుడు = భగవంతుడు {ఆశ్రిత వరదుడు - ఆశ్రయించినవారికి కోరికలు తీర్చు వాడు}; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ధరణిసురులు = బ్రాహ్మణులు; దైవతములు = దేవతలు; కానన్ = కాబట్టి; ధారుణీదివిజుల = బ్రాహ్మణుల; కంటెన్ = కంటె; దైవము = దేవుడు; ఒకడు = మరొకడు; కలడె = ఉన్నాడా, లేడు; భువిని = భూలోకము నందు.

 భావము:- దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు


మురహరుఁ డిట్లు కుచేలుని

చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స

త్పురుషుల కిహపరసుఖములు

హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!

 టీక:- మురహరుడు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; కుచేలుని = కుచేలుడిని; చరితార్థునిన్ = ధన్యునిగా; చేసినట్టి = చేసిన; చరితము = వృత్తాంతము; విను = వినెడి; సత్పురుషుల = సజ్జనుల; కున్ = కు; ఇహ = ఇహలోకపు; పర = పరలోకపు; సుఖములు = సౌఖ్యములు; హరి = కృష్ణుని; భక్తియున్ = భక్తి; యశము = కీర్తి; కలుగున్ = లభించును; అవనీనాథ = రాజా.

 భావము:- ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలోపాఖ్యానం విన్న వారందరికీ ఇహ పర సౌఖ్యములు ప్రసాదించును.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: