🙏 శ్రీ కుచేలోపాఖ్యానం 🙏
నాల్గవ భాగం
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?
టీక:- ఏమి = ఎట్టి; తపంబున్ = తపస్సును; చేసెనొకొ = చేసినాడో; ఈ = ఈ యొక్క; ధరణీదివిజ = విప్ర; ఉత్తముండు = ఉత్తముడు; తొల్ = పూర్వపు; బామునన్ = జన్మము నందు; యోగి = మునులచేత; విస్ఫురత్ = మిక్కిలి ప్రసిద్ధముగా; ఉపాస్యకుడు = ఉపాసింప దగినవాడు; ఐ = అయ్యి; తనరారు = ఒప్పునట్టి; ఈ = ఈ దివ్యమైన; జగత్స్వామిన్ = కృష్ణుని; రమాథినాథున్ = కృష్ణుని; నిజ = స్వంత; తల్పమునన్ = పాన్పుపై; వసియించి = కూర్చుండి; ఉన్నవాడు = ఉన్నాడు; ఈ = ఈ యొక్క; మహనీయ = గొప్పవాడైన; మూర్తి = వ్యక్తి; కిన్ = కి; ఎనయే = సమానులా, కారు; ముని = ముని; పుంగవులు = శ్రేష్ఠులు; ఎంత = ఎంతటి; వారలున్ = వారైనప్పటికి.
భావము:- “ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా.
28
అదియునుం గాక.
టీక:- అదియునునే = అంతే; కాక = కాకుండా.
భావము:- అంతే కాకుండా....
29
తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున్
వినయమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుడో? "
టీక:- తన = తన యొక్క; మృదు = మెత్తని; తల్పము = మంచము; అందున్ = మీద; వనితా = స్త్రీ; మణి = శ్రేష్ఠురాలు; ఐన = అయినట్టి; రమాలలామ = రుక్మిణీదేవి; పొందును = కూడికను; ఎడగాన్ = దూరమగుటను; తలంపక = ఎంచకుండ; యదుప్రవరుండు = కృష్ణుడు {యదుప్రవరుడు - యదు వంశావళిలోని వాడు, కృష్ణుడు}; ఎదురేగి = ఎదురుగా వెళ్ళి; మోదమున్ = సంతోషము; తనుకగన్ = కలుగగా; కౌగలించి = ఆలింగనము చేసికొని; ఉచిత = తగిన; క్రియలన్ = పరిచర్యలచేత; పరితుష్టున్ = మిక్కిలి తృప్తి చెందినవాని; చేయుచున్ = చేస్తూ; వినయమునన్ = వినయముతో; భజించెన్ = సేవించెను; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; ఎంతటి = ఎంత గొప్ప; భాగ్యవంతుడో = అదృష్టవంతుడోకదా.
భావము:- తన మృదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా, శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.”
30
అను నయ్యవసరంబున
టీక:- అను = అనుకొనుచున్న; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- ఈ విధంగా అంతఃపుర కాంతలు అనుకుంటున్న సమయంలో....
31
మురసంహరుఁడు కుచేలుని
కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ “మన మా
గురుగృహమున వర్తించిన
చరితము” లని కొన్ని నుడివి చతురత మఱియున్.
టీక:- మురసంహరుడు = కృష్ణుడు {ముర సంహరుడు - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు}; కుచేలునిన్ = కుచేలుని యొక్క; కరమున్ = చేతిని; కరంబునన్ = చేతితో; తెమల్చి = ఒడిసి పట్టుకొని; కడకన్ = పూని; మనము = మనము; ఆ = ఆ యొక్క; గురు = గురువు యొక్క; గృహమునన్ = ఇంటిలో; వర్తించిన = నడచిన; చరితములు = నడవడికలు; అని = అని; కొన్ని = కొన్నిటిని; నుడివి = చెప్పి; చతురతన్ = నేర్పరితనముతో; మఱియున్ = ఇంకను.
భావము:- కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు.
32
"బ్రాహ్మణోత్తమ! వేదపాఠనలబ్ధ ద;
క్షత గల చారువంశంబు వలనఁ
బరిణయంబైనట్టి భార్య సుశీలవ;
ర్తనములఁ దగభవత్సదృశ యగునె?
తలఁప గృహక్షేత్ర ధనదార పుత్త్రాదు;
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేనుదుది లోకసంగ్రహా;
ర్థంబు కర్మాచరణంబుసేయు
33
గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిమై యుక్తకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ఠ
దవిలియుందురు కొంద ఱుత్తములు భువిని. "
టీక:- బ్రాహ్మణ = బ్రాహ్మణ; ఉత్తమ = ఉత్తముడా; వేద = వేదములను; పాఠన = చదువు చుండుటచే; లబ్ధ = లభించిన; దక్షత = సామర్థ్యము; కల = కలిగినట్టి; చారు = చక్కటి; వంశంబున్ = వంశస్థురాలు; వలన = తోటి; పరిణయంబు = వివాహము; ఐనట్టి = అయినట్టి; భార్య = భార్య; సు = మంచి; శీల = స్వభావముచేత; వర్తనములన్ = నడవడికచేత; తగన్ = చక్కగా; భవత్ = నీకు; సదృశ = సరిపడునామె; అగునె = ఐ ఉండెనా; తలపన్ = విచారించినచో; గృహ = ఇల్లు; క్షేత్ర = పొలములు; ధన = సంపదలు; దార = భార్య; పుత్ర = పిల్లలు; ఆదులు = మున్నగువాని; అందున్ = ఎడల; నీ = నీ యొక్క; చిత్తంబు = మనస్సు; చెందకుండ = తగుల్కొనకుండుట; తోచుచున్నది = కనబడుతున్నది; ఏను = నేను; తుదిన్ = చివరకు; లోక = లోకాచారమును; సంగ్రహార్థంబు = స్వీకరించుటకు; కర్మా = కర్మములను; ఆచరణంబున్ = ఆచరించుట; చేయు = చేసెడి.
గతిన్ = విధమును; మనంబునన్ = మనస్సు; కామ = కోరికలందు; మోహితులు = భ్రమచెందినవారు; కాకన్ = కాకుండగా; అర్థిమై = ప్రీతితో; యుక్త = తగినట్టి; కర్మంబులున్ = కర్మలను; ఆచరించి = చేసి; ప్రకృతి = మాయా; సంబంధములున్ = సంబంధములను; వాసి = దూరమై; భవ్య = గొప్ప; నిష్ఠన్ = నియమములతో; తవిలి = పూని; ఉందురు = ఉంటారు; కొందఱు = కొంతమంది; ఉత్తములు = ఉత్తములు; భువిన్ = భూలోకమునందు.
భావము:- “ఓ భూసురోత్తమా! చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు.”
34
అని మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.
భావము:- ఇలా అని శ్రీకృష్ణుడు కుచేలుడితో మరల ఇలా అన్నాడు....
35
"ఎఱుఁగుదువె? మనము గురు మం
దిరమున వసియించి యతఁడు దెలుపఁగ వరుస
న్నెఱుఁగఁగ వలసిన యర్థము
లెఱిఁగి పరిజ్ఞానమహిమ లెఱుఁగుట లెల్లన్. "
టీక:- ఎఱుగుదువె = గుర్తున్నదా; మనము = మనము; గురు = గురువు యొక్క; మందిరమునన్ = ఇంటిలో; వసియించి = ఉండగా; అతడు = అతను; తెలుపగన్ = చెప్పుతుండగా; వరుసన్ = క్రమముగా; ఎఱుగగన్ = తెలిసికొనుటకు; వలసిన = కావలసిన; అర్థములు = విషయములను; ఎఱిగి = తెలిసికొని; పరిజ్ఞాన = యుక్తాయుక్తముల నెరుగునట్టి; మహిమలున్ = మహత్వములు; ఎఱుగుట = తెలియుట; ఎల్లను = సర్వము.
భావము:- “మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా?”
36
అని మఱియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; గురు = గురువును; ప్రశంస = పొగడుట; చేయన్ = చేయవలెనని; తలంచి = కోరి; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.
భావము:- ఇలా కుచేలుని పలకరిస్తున్న శ్రీకృష్ణుడు గురుప్రశంస చేయదలచి ఇలా అన్నాడు...
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
<<
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి