*ఆధ్యాత్మికత - సమాజము*
*ఆధ్యాత్మికత* అంటే మతాలకు, సిద్ధాంతాలకు, వర్గాలకు అతీతంగా *భక్తిని* ఏర్పర్చుకోగల్గి ఉన్నతమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన, అన్య భావనలచే మిశ్రితము కాని స్థితిని చేరుకోనుట అని సాధారణ అర్థము. కాని, అంతటి ప్రశాంతత ఇప్పటి పరిస్థితులలో సాధ్యము కాదన్న భావన కల్గుతుంది. *ఎందుకంటే మహా మహా భక్తులలో గూడా మా దేవుడు గొప్పవాడoటే మా దేవుడు గొప్పవాడని (వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, లింగాయతులు, తదితరులు) భావ వైరుధ్యాలతో సతమతమవుతున్నారు*. ఇటువంటి పరిస్థితులలో నిఖార్సైన ఆధ్యాత్మికతకు అవకాశమెక్కడిది.
*ఈ మధ్యనే రామేశ్వరంలో శ్రీ రామచంద్రుల వారిచే శివ లింగ స్థాపన మరియు అర్చనపై పలు భిన్నాభిప్రాయాలు వెలువడుట ఆశ్చర్యకరము*.కాబట్టి ప్రస్తుతము నిరంతర భక్తి ప్రపత్తులు గలవారినే *ఆధ్యాత్మికులు* గా పరిగణిద్దాము.
నీతి, ధర్మం ఈ రెండు మానవుణ్ణి సంస్కారవంతుడిని చేసి రాజమార్గంలో నడిపించేవి. నీతి అంటే దేశకాల పాత్రానుగుణంగా నడుచుకునే *హితరీతి* అని, ధర్మమంటే త్రికాలా సంబదితమైన *సత్యహిత* స్వరూపమని పెద్దలంటారు.
హృదయం, మేధ మానవుడికి జీవనాధారాలు. వీటిలో ఏది లోపించినా మానవత్వం సంపూర్ణం కాదు. ఈ రెండిటి సముచిత సమన్వయమే మానవత్వం. ఆ మానవత్వ సముపార్జనకై మానవుడు చేసే ప్రయత్నాలలో గ్రంథ పఠన, సాహిత్యోపాసన లలిత ప్రక్రియలు.
ఈ క్రమంలో మానవుడు వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, పురాణములను, ధర్మ శాస్త్రములను, ఆగమములను, ఇతిహాసములను (రామాయణ, మాహా భారత, భాగవతములు) మరియు భగవద్గీతను, ఇవే గాక లోక కళ్యాణ సంబంధమైన ఇతర గ్రంథములను అధ్యయనము చేసి ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు కూడా. *ఇవి అన్నియు ఇహ పర సాధనాలే*. సాటిలేని నీతి, ధర్మ దర్పణాలు, ఇది విశ్వజనీనం. వీటిలోని ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం, ప్రతి కథ, ప్రతి పాత్ర గొప్ప నీతిని, ధర్మాన్ని స్పురింప జేస్తాయి.
ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారము మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయి, వీటినే చతుర్విధ పురుషార్ధాలు అని అంటారు. అవి *ధర్మం*, *అర్థం*, *కామం*, *మోక్షం*.
అర్థం, కామం, మోక్షం వ్యక్తిగతాలు. *లోక శ్రేయస్సును కల్గించేది "ధర్మం" మాత్రమే*. అందువల్ల ప్రతి ఒక్కరూ *ధర్మాన్ని రక్షించుకోవాలి*. దీనికి ప్రతిఫలంగా ధర్మం వ్యక్తుల్ని, సమాజాన్ని రక్షిస్తుంది. *ధర్మో రక్షతి రక్షితః*. సమాజంలో *ధర్మానికి* సమాంతరంగా *ధర్మ వ్యతిరేక* శక్తులు గూడా పనిచేస్తూ ఉంటాయి.
యోగ్యులైన వారు ఆ *పాపపు శక్తులను* చూస్తూ నిర్లక్ష్యము చేయరాదు. *ధర్మ రక్షణ* చేయకపోతే జాతి నిర్వీర్యమై పోతుంది. అందులో మనమూ (సామాన్యులు, మాన్యులు) ఉంటాము. *ఆధర్మాన్ని ఉపేక్షించడము ఆత్మహత్యా సదృశమే*.
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి